ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
నేడు శ్రీశైలంలోకి మరింత పెరగనున్న వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/హొళగుంద: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 61,111 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం.
ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండిపోతుంది. మంగళవారం ఉదయం ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటి విడుదలను ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం
తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. మొత్తం 33 గేట్లను ఎత్తి 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది.
మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment