శ్రీశైలం ప్రాజెక్టులో ఉధృతి
10 గేట్లు ఎత్తి శ్రీశైలం నుంచి 2,75,700 క్యూసెక్కులు విడుదల
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి మంగళవారం రాత్రి 9గంటల సమయానికి 3,79,822 క్యూసెక్కుల వరద వస్తోంది. పది గేట్లను పది అడుగుల మేరకు తెరచి 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయానికి 4,51,080 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలైన నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,21,973 క్యూసెక్కులు విడుదలైంది.
కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 18.437 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. రాత్రి 9గంటల సమయానికి జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.
ఆల్మట్టిలోకి 3.01 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.85 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment