రాష్ట్ర విభజన జరిగితే జిల్లాకు విద్యుత్ గండం ఏర్పడే అవకాశం లేకపోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి నుంచి రోజూ కోటీ 41 లక్షల 14 వేల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది
మార్కాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగితే జిల్లాకు విద్యుత్ గండం ఏర్పడే అవకాశం లేకపోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి నుంచి రోజూ కోటీ 41 లక్షల 14 వేల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో జిల్లాకు 41 లక్షల 60 వేల మెగా యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తారు. జిల్లాకు సగటున రోజుకు 71 లక్షల 60 వేల మెగా యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇందులో శ్రీశైలం నుంచి 41 లక్షల 60 వేల మెగా యూనిట్ల విద్యుత్ వస్తుండగా మిగిలిన 30 లక్షల మెగా యూనిట్ల విద్యుత్ వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్) నుంచి జిల్లాకు వస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం డ్యామ్‌కు నీరు రావటం కష్టమే. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఆనకట్టలు నిర్మిస్తే శ్రీశైలం జలాశయానికి నీటి సరఫరా అనుమానమే. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఉండదు. కృష్ణానదిపై ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కృష్ణానదికి ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలోని బాబ్లీ, ఆల్మట్టి డ్యామ్‌ల ఎత్తు పెంచటంతో నీటి ప్రవాహం శ్రీశైలానికి తగ్గింది.
ఏటా మార్చి నుంచి జూన్ నెలాఖరు వరకు శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి సరఫరా ఆధారంగానే విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉండగా 1.10 లక్షల మంది రైతులు వ్యవసాయ బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. షాపులు, వస్త్ర, తదితర దుకాణాలకు 60 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,200 పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తారు. 378 కోళ్ల ఫారాలు, తదితర చిన్న పరిశ్రమలు, 295 హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. నీటి పథకాలు, వీధిలైట్లు, తదితర వాటి కింద 12,500 కనెక్షన్లు ఉన్నాయి. శ్రీశైలం నుంచి వచ్చే విద్యుత్‌లో మార్కాపురం డివిజన్‌కు 20 లక్షల 60 వేల మెగా యూనిట్లు, పొదిలికి 15 లక్షల 60 వేల మెగా యూనిట్లు కేటాయిస్తున్నారు. కృష్ణానదికి జలాల కేటాయింపులు తగ్గితే జిల్లాలో విద్యుత్ సంక్షోభం ఏర్పడక తప్పదని విద్యుత్‌శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాలకులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూద్దాం