విద్యుత్ ఉద్యోగుల కన్నెర్ర
Published Mon, Oct 7 2013 4:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, గుంటూరు : విద్యుత్ ఉద్యోగులు కన్నెర్ర జేశా రు. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. సంఘటితమై సమ్మెబాట పట్టారు. జిల్లా అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమైక్యాంధ్ర కాంక్షిస్తూ సమ్మెను పతాకస్థాయికి చేర్చారు. జిల్లా అంతటా జనజీవనం స్తంభించింది. ఉక్కపోతతో విలవిల్లాడింది. పరిశ్రమల్లో ఉత్పత్తులు పడిపోయాయి.అత్యవసరసేవలైన వైద్యం, తాగునీరు, రైల్వే వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే రెండు నెలలుగా జరిగిన సమైక్య ఉద్యమం ఒక ఎత్తయితే, ఆదివారం నాటి విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఒక ఎత్తుగా మారింది.
తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా శుక్రవార సాయంత్రం నుంచి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగులు మెరుపు సమ్మెలోకి వెళ్లారు. దీంతో 6 యూనిట్లలో విద్యుదుత్పాదన నిలిచిపోయింది. శనివారం మొత్తం జిల్లాకు అరకొరగా విద్యుత్ సరఫరా జరిగింది. ఇదే రోజు సాయంత్రం విద్యుత్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ సాయిబాబు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెలోకి వెళ్లారు. జిల్లాలోని 4వేల మంది ఉద్యోగులుఒక్కసారిగా విధులకు గైర్హాజరయ్యారు. యూపీఏ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడక్కడా సరఫరా అవుతున్న విద్యుత్‌ను నిలిపి వేశారు. జిల్లా మొత్తానికి విద్యుత్‌ను అందించే తాడికొండ 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని షట్‌డౌన్ చేశారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఫలితంగా జిల్లాలోని సత్తెనపల్లి, మాచర్ల, తెనాలి, రేపల్లె, వేమూరు, వినుకొండ నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లోనూ, ఆరేడు మున్సిపాల్టీల్లోనూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాగునీటిని చెరువుల నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకులకు ఎక్కించడం సాధ్యం కాక పలు గ్రామాల్లో జనం ఆదివారం అవస్థలు పడ్డారు. గుంటూ రు, నరసరావుపేట,తెనాలి, సత్తెనపల్లిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బాలింతలు, చంటిపిల్లల తల్లులు ఉక్కపోతతో విలవిల్లాడారు. పట్టణాల్లోని పలు దుకాణాలు స్వచ్ఛం దంగా మూతపడ్డాయి. ఉదయం నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు జిల్లాకు అధిక మొత్తంలో పవర్ సప్లయి చేసే తాడికొండ 220 కేవీ ఉపకేంద్రాన్నినిలిపివేశారు. దీంతో గుంటూరు, మంగళగిరి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో సరఫరా ఆగిపోయింది.
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు...
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా గుంటూరు స్టేషన్‌కు రాకపోకలు సాగించే పలు ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యా యి. మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరాల్సిన గుంటూరు-విజయవాడ ప్యాసిం జర్ రైలును అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా తెనాలి-గుంటూరు, తెనాలి-రేపల్లె, విజయవాడ-బిట్రగుంట ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విజయవాడ నుంచి రేణిగుంట వైపు వెళ్లే రైల్వేలైను మొత్తం విద్యుద్దీకరించిన లైను కావడంతో ఆ మార్గంలోని రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. గుంటూరు-సికింద్రాబాద్ లైనులో రైళ్లు డీజిల్‌తోనే నడిచాయి. ప్యాసింజర్ రైళ్లు రద్దవడంతో గుంటూరు స్టేషన్‌లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
రాత్రి 7గంటలకు విద్యుత్ పునరుద్ధరణ..
ఆదివారం రాత్రి 7 గంటలకు గుంటూరుతో పాటు జిల్లాలోని పలు పట్టణాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అత్యవసరసేవల నిమిత్తం రాత్రి సమయంలోనైనా విద్యుత్ సరఫరాను కొనసాగించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర, జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌లు విద్యుత్ జేఏసీ నాయకుల్ని కోరడంతో ఉద్యోగులు రాత్రి 7 గంటల నుంచి కరెంటు సరఫరాను పునరుద్దరించారు. సోమవారం ఉదయం 7 గంట ల నుంచి మళ్లీ విద్యుత్ సరఫరా ఆగిపోతుందని విద్యుత్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement