ఉద్యోగులకు ‘జగన్ ఆపన్నహస్తం’
Published Sat, Oct 12 2013 3:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
జగ్గంపేట, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రధాన డిమాండ్‌తో సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ కుమార్ నడుం బిగించారు. ‘వైఎస్ జగన్ ఆపన్నహస్తం’ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించడమే కాకుండా తొలిచర్యగా 1200 మంది ఉద్యోగులకు బియ్యం, కందిపప్పు, పంచదార, చింతపండు శుక్రవారం పంపిణీ చేశారు.
సుమారు రూ.12 లక్షలతో జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల్లోని కింద స్థాయి ఉద్యోగులైన అటెండర్లు, స్వీపర్లు, ట్యాంక్ వాచర్లు, పాఠశాల అటెండర్లు, హాస్టల్ కుక్‌లు, ఏలేశ్వరం, గోకవరం ఆర్టీసీ డిపోల పరిధిలోని డ్రైవర్లు, క్లీనర్లకు వాటిని అందజేశారు. గోకవరం మండలంలో ఉదయం ఈకార్యక్రమం ప్రారంభమైంది, మధ్యాహ్నం జగ్గంపేట, సాయంత్రం గండేపల్లి, రాత్రి ఏలేశ్వరంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా పార్టీ కాకినాడ పార్లమెంటు నాయకుడు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గంపల వెంకట రమణ హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని 72 రోజుల పాటు ఉద్యమాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు.
వైఎస్‌జగన్ ఆపన్నహస్తం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ సంస్థ ద్వారా ఉద్యోగులకు సహాయ కార్యక్రమాన్ని చేపట్టిన నవీన్‌ను సునీల్, వరుపుల అభినందించారు. సర్పంచ్ కొలిపే ప్రసన్నరాణి, మండల పార్టీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, ఏపీ ఎన్జీఓల సంఘం జగ్గంపేట తాలూకా అధ్యక్షుడు టీజే స్వామి ప్రసంగించారు. జీను మణిబాబు, ఒమ్మి రఘురామ్, జంపన సీతారామచంద్రవర్మ, ఏలేటి బాబి, ఉద్యోగుల సంఘ నాయకుడు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement