చంద్రబాబూ నీ దీక్ష ఎందుకు?
Published Mon, Oct 7 2013 4:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
అమలాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న స్పష్టమైన డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఢిల్లీలో దీక్ష చేస్తారో చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన కుట్రకు వంతపాడిన చంద్రబాబు సమైక్యాంధ్రపై తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అవినీతి కేసులలో శిక్ష పడుతుందనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, రాష్ట్ర విభజనకు కూడా పూనుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు సైతం సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్ష చేయాలని, తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కోరారు.
అలా చేస్తే ఆయన చిత్తశుద్ధి ప్రజలకు అర్థం అవుతుందన్నారు. పదవులకు రాజీనామాలు చేయని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీల నివాసాలను సోమవారం ముట్టడిస్తామని కుడుపూడి ప్రకటించారు. నిరసన తెలిపేందుకు వెళ్లిన ఏపీఎన్జీవోలపై హర్షకుమార్ తనయుల దాడి దారుణమని ఖండించారు. అమలాపురంలో జేఏసీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయనీయమన్నారు. నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా హర్షకుమార్ రాజీనామా చేయాలని చిట్టబ్బాయి కోరారు. పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ కేబినెట్ నోట్‌ను టేబుల్‌నోట్‌గా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసిందన్నారు. రాజమండ్రిలో ఎంపీ హర్ష కుమార్ తనయుల దాడి సభ్యసమాజం తలవంచుకునేలా ఉందని విమర్శించారు.
చమురు సంస్థలపై ఉద్యమాలకు ప్రజల సహాయం కోరిన హర్షకుమార్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వచ్చిన ప్రజలపై దాడి చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. తన కాలేజీపై దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకులున్నారని హర్షకుమార్ చేసిన ఆరోపణను బాబూరావు ఖండించారు. తెరవెనుక రాజకీయాలు చేసే అలవాటు వైఎస్సార్‌సీపీకి లేదన్నారు. కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఏజేవీబీ మహేశ్వరరావు మాట్లాడుతూ ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయలేదని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని తెలిపారు. రాష్ట్రపతికి ఇచ్చిన లేఖలో కూడా ఇదే పేర్కొన్నామన్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, నియోజకవర్గ పరిశీలకుడు నలమాటి లంకరాజు, పట్టణ, మండల పార్టీల కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జంపన రమేష్‌రాజు, నిమ్మకాయల హనుమంత శ్రీనివాస్, పచ్చిమాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement