72 గంటల బంద్ తొలిరోజు విజయవంతం
Published Sat, Oct 5 2013 4:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సీమాంధ్రలో కోట్ల గొంతుకలు రెండు నెలలుగా ముక్తకంఠంతో చేస్తున్న సమైక్య నినాదాన్ని పెడచెవిన పెట్టిన ఢిల్లీ పాలకులు దిగి రావాలంటే.. ఇప్పటి వరకూ కనబరిచిన రణస్ఫూర్తి రెట్టింపు కావలసిందేనని భావించిన వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్ తొలిరోజైన శుక్రవారం జిల్లాలో సంపూర్ణంగా విజయవంతమైంది. ప్రజల ఆకాంక్షను సాకారం చేసేందుకు కదం తొక్కిన పార్టీ శ్రేణులకు అన్నివర్గాల నుంచీ అపూర్వ సంఘీభావం లభించడంతో జన జీవనం స్తంభించింది.
సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపునకు జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కడంతో తొలిరోజైన శుక్రవారం బంద్ విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా దుకాణాలు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ శ్రేణులు దగ్గరుండి మూయించి వేశారు. జాతీయ రహదారులతో పాటు మారుమూల రహదారులను దిగ్బంధించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ముఖ్యనేతలతోపాటు వేలాదిగా పార్టీ శ్రేణులు ఉదయం నుంచే రోడ్లపైకి చేరుకొనిబంద్ విజయవంతానికి కృషి చేశారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆర్‌వీజేఆర్ కుమార్ బంద్‌ను పర్యవేక్షించారు. పార్టీ శ్రేణులు బృందాలుగా బైకు ర్యాలీలు నిర్వహిస్తూ బంద్ చేయించారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కాకినాడ సర్పవరం జంక్షన్‌లో అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ట్రేడ్‌యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నగర వీధుల్లో పాదయాత్ర చేస్తూ బంద్ నిర్వహించారు. లాలాచెరువు సెంటర్‌లో ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకోచేసి రాకపోకలను స్తంభింప చేశారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ఇతర నేతలు జేఏసీతో కలిసి కడియం రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. సిగ్నల్‌రూమ్‌లో బైఠాయించి రైల్వే సిబ్బందితో సమైక్య నినాదాలు చేయించారు. ధవళేశ్వరంలో హార్లిక్స్ ఫ్యాక్టరీని ముట్టడించారు. బొమ్మూరులో జాతీయ రహదారిపై సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజమండ్రి గోదావరి రైల్వేస్టేషన్‌లో పార్టీ శ్రేణులు గూడ్స్ రైళ్ల రాకపోకలను కొద్దిసేపు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ జెండాలు దగ్ధం చేసిన బోస్
మాజీ మంత్రి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ద్రాక్షారామలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా వెళ్లి బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ జెండాలను దగ్ధం చేశారు. మలికిపురంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గెడ్డం ఫిలిప్‌రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆ పార్టీ ఫ్లెక్సీలు ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో గొల్లల మామిడాడలో బంద్ నిర్వహించి, రాస్తారోకో చేశారు. అమలాపురంలో పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ శ్రేణులతో కలిసి బైకు ర్యాలీ చేస్తూ బంద్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురంలో బంద్ నిర్వహించి చిత్రాడ రైల్వే ఫ్లై ఓవర్‌పై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, వరుపుల సూరిబాబుల ఆధ్వర్యంలో ఏలేశ్వరం సెంటర్‌లో రాస్తారోకో చేశారు.
నల్లదుస్తులు, నల్ల కళ్లజోళ్లతో నిరసన
రంపచోడవరంలో పార్టీ యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో వందలాదిమంది పార్టీశ్రేణులు నల్లదుస్తులు, నల్లకళ్లజోళ్లు ధరించి రాజమండ్రి-భద్రాచలం రహదారిని దిగ్బంధించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి వైఎస్సార్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పి.గన్నవరంలో పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాజోలులో కో ఆర్డినేటర్లు మత్తి జయప్రకాష్, మట్టా శైలజ, బొంతు రాజేశ్వరరావు, చింతలపాటి వెంకటరామరాజు, ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యిల చిట్టిబాబుల ఆధ్వర్యంలో బైకు ర్యాలీలు చేసి దుకాణాలు మూయించారు. మండపేట బస్టాండ్ సెంటర్‌లో కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కర్రి పాపారాయుడు, పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. తునిలో దాడిశెట్టి రాజా, పెద్దాపురంలో తోట సుబ్బారావునాయుడు, రామచంద్రపురంలో పార్టీ నాయకుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ తదితరులు బంద్ నిర్వహించారు.
ఆమరణ దీక్షల విరమణ
పార్టీ పిలుపునిచ్చిన సమైక్య దీక్షల్లో భాగంగా ఆమరణ దీక్షలు చేపట్టిన నేతలు శుక్రవారం తమ దీక్షలను విరమించారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు, మత్తి జయప్రకాష్, పార్టీ నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం తమ ఆమరణ నిరాహారదీక్షలను విరమించారు. కాగా జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. విభజన ప్రక్రియపై మనస్తాపం చెందిన కాట్రేనికోన సేవాదళ్ కన్వీనర్ గిడ్డి దివాకర్ ముమ్మిడి వరంలో మూడవరోజు రిలేదీక్షల్లో కూర్చున్న కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి పోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
జాతీయ రహదారిపై వంటావార్పు
జగ్గంపేటలో పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో వందలాదిమంది పార్టీ శ్రేణులు ఎన్‌హెచ్-16ని దిగ్బంధించి రాకపోకలను స్తంభింపచేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సహ పంక్తి భోజనాలు చేశారు. రాజానగరంలో పాత జాతీయ రహదారిపై సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రహదారిపైనే టీ స్టాల్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ , పారిశ్రామిక విభాగంజిల్లా కన్వీనర్లు మార్గన గంగాధర్, మంతెన రవిరాజుల ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ శ్రేణులు జేఏసీ సభ్యులతో కలిసి ఎన్‌హెచ్-16ను ఏడు గంటల పాటు దిగ్బంధించి రాకపోకలను స్తంభింపజేశారు. సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, కావూరి, చిరంజీవిల దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు.
Advertisement
Advertisement