సమైక్య ఆకాంక్షను ఢిల్లీ కి చాటాలి
Published Mon, Oct 21 2013 3:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
అమలాపురం, న్యూస్‌లైన్ : ఆరున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పేలా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగే సమైక్య శంఖారావానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సమైక్యవాదులు కూడా పెద్దఎత్తున తరలిరావాలని ఆపార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. అమలాపురంలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 26న హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో పార్టీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నామని, ఈ సభకు లక్షలాదిగా సమైక్యవాదులు తరలివచ్చి తమ ఆకాంక్షను దేశవ్యాప్తంగా వినిపించేలా చేయాలన్నారు. ఉద్యోగులు, ఏపీఎన్జీఓలు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఈ సమయంలో సమైక్యవాణిని బలంగా చాటాలంటే సమైక్యవాదులు ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తొలి నుంచి సమైక్యం కోసం పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు, పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఒకసారి ప్రాణాలు పణంగా పెట్టి నిరాహారదీక్షకు దిగారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం మండల, గ్రామస్థాయి నుంచి పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్సార్‌సీపీయేనని, సమైక్యరాష్ట్రం సాధించే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే ధైర్యంలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పూనుకున్నాయని, దీనిని తిప్పికొట్టేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, యువత ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమైక్య శంఖారావం సభ ద్వారా తమ ఆకాంక్షను ఢిల్లీకి చాటాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు.
17 లోక్‌సభ సీట్ల కోసం సీమాంధ్ర ప్రజల ఆశలను బలి చేస్తున్నారని, రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ఒక తరం తమ జీవితాన్ని కోల్పోతారన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు దొంగ రాజీనామాలకు తెరతీసి ప్రజలను పక్కదారి పట్టించడం అన్యాయమన్నారు. సమైక్య శంఖారావం విజయవంతం చేయాల్సిన బాధ్యత జిల్లాలోని పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లతోపాటు జిల్లా అనుబంధ కమిటీల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల కార్యవర్గం, అనుబంధ కమిటీల కన్వీనర్లపై ఉందన్నారు. జనసమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులే కాకుండా సమైక్యవాదులంతా సభకు తరలివచ్చి సమైక్య కాంక్షను ఢిల్లీకి బలంగా చాటాలని చిట్టబ్బాయి విజ్ఞప్తి చేశారు.
Advertisement