77వ రోజు కొనసాగిన సమైక్యాంధ్ర ఉద్యమాలు
Published Thu, Oct 17 2013 3:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సమైక్య ఉద్యమం పట్టు సడలకుండా కొనసాగుతోంది. సమైక్యవాదులు నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 78వ రోజు కూడా ఒకే జెండా.. ఒకే ఎజెండాగా పోరును కొనసాగించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మన్యాన్ని దిగ్బంధించారు.
సాక్షి, రాజమండ్రి : ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో ఆరుచోట్ల బ్యాలెట్ బ్యాక్స్‌లు పెట్టి రాష్ట్ర విభజనపై ప్రజాభిపాయ సేకరణ చేపట్టారు. సమైక్య రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారా? తెలుగువారు లేని కేంద్రం మంత్రుల కమిటీ (జీఓఎం) వల్ల మనకు న్యాయం జరుగుతుందా? దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌లు పరిష్కరించి తర్వాత మనరాష్ట్ర విభజన చేయాలని మీరు కోరుకుంటున్నారా? అనే అంశాలతో బ్యాలెట్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో సకల జనులు సమైక్యరాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. ఇంకా జేఏసీ ఆధ్వర్యంలో అల్లవరంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో కొరమగిరిపట్నం ఉపాధి మేట్లు పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద ప్రముఖ రచయిత సవేరా రచించిన సమైక్య పాటలను ఆవిష్కరించారు. ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో కొనసాగుతున్న దీక్షల్లో మత్స్యకారులు, గొల్లవిల్లిలో ఎస్.యానాం పంచాయతీ పాలక వర్గం, ఎస్. యానాంలో స్థానికులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
మాజీ మంత్రి ప్రమాణం
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తాను అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల వద్దకు వచ్చిన ఆయన తాను రాసి తెచ్చిన ప్రమాణ పత్రాన్ని జేఏసీ ప్రతినిధులకు చదివి వినిపించారు. దీక్షలు 75వ రోజుకు చేరిన సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థులు 75 మంది రిలే దీక్షలు చేపట్టారు. రాజమండ్రిలో పశుసంవర్థక శాఖ జేఏసీ చైర్మన్ డాక్టర్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు వందమంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధవళేశ్వరంలో ఏపీఎన్‌జీఓలు, కడియంలో బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్వంలో కలెక్టరేట్ వద్ద దీక్షలు కొనసాగాయి. ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద వైద్య శాఖ ఉద్యోగులు దీక్షలు కొనసాగిస్తున్నారు.
కళ్లకు గంతలు కట్టుకుని
ముమ్మిడివరం గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిర నన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే తమ బతుకుల్లో అంధకారమే అంటూ నినాదాలు చేశారు. ముమ్మిడివరంలో గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ సమైక్య వాదులతో కలిసి మానవహారంగా ఏర్పడి విభజనవాదులకు కనువిప్పు కలగాలని కోరుతూ నినాదాలు చేశారు. కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పెన్షనర్లు దీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మామిడికుదురులో నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మల్కిపురం, సఖినేటిపల్లి, టెకిశెట్టిపాలెం, రాజోలు గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
దీక్షబూనిన మహిళలు
సామర్లకోటలో తహశీల్దారు కార్యాలయం వద్ద జేఏసీ కొనసాగిస్తున్న దీక్షల్లో 30 మంది మహిళలు పాల్గొన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కన్వీనర్ తోట సుబ్బారావునాయుడు తదితర సమైక్యవాదులు ‘గెట్ టుగెదర్’ ఏర్పాటు చేశారు. సమైకాంధ్ర ఉద్యమంపై చర్చించారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే అనర్థాలను విశ్లేషించారు. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద కొనసాగుతున్న జేఏసీ దీక్షా శిబిరం సమైక్యవాదులు సమైక్యాంధ్ర జపం నిర్వహించారు. గోకవరంలో ఉపాధ్యాయులు చేపట్టిన 36 గంటల దీక్షలు ముగిశాయి. ప్రైవేట్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటూ సమైక్యవాదులు వినతి పత్రాలు సమర్పించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన్యం దిగ్బంధం
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఏజెన్సీని అష్ట దిగ్బంధం చేశారు. ఏజెన్సీ వ్యాప్తంగా బంద్ పాటించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, రంపచోడవరం నియోజక వర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాజవొమ్మంగి వద్ద ఆయన ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. రంపచోడవరంలో సరిహద్దు రహదారులను దిగ్బంధం చేశారు. ఇందులో భాగంగా ఫోక్స్ పేట వద్ద రాస్తారోకో చేస్తున్న పార్టీ మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, బి.వెలమలకోట గోకవరం సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
కడియంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దీక్షలకు కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి కోటగుమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దీక్షా శిబిరం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు బస్సులు, రోడ్డు తుడిచి నిరసన తెలిపారు. జగ్గంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు కొనసాగిస్తున్న దీక్షలకు పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ తన మద్దతు ప్రకటించారు.
Advertisement
Advertisement