జగన్ దీక్ష భగ్నంపై 36 గంటల నిరసన
Published Fri, Oct 11 2013 6:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా రాజమండ్రి నగర అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ 36 గంటల బహిరంగ నిరసన చేపట్టారు. గురువారం రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన ఈ దీక్ష చేపట్టారు.
తుపాను ప్రభావంతో హోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా మహానేత పాదాల సాక్షిగా ఆయన దీక్ష కొనసాగించారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి జైలులో చేపట్టిన నిరవధిక దీక్షను భగ్నం చేసినపుడు కూడా సాగర్ ఇదే విగ్రహం వద్ద 24 గంటల బహిరంగ దీక్ష చేశారు. సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం తమ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షను ప్రభుత్వం కక్ష కట్టి భగ్నం చేసిందన్నారు.
సమైక్యాంధ్ర కోసం సాగుతున్న ప్రజా ఉద్యమాన్ని కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జగన్ దీక్ష భగ్నం చేసినందుకు నిరసనగా తాను ఈ దీక్ష కు పూనుకున్నానని ఎండయినా, వానయినా 36 గంటల దీక్ష ను కొనసాగిస్తానని పేర్కొన్నారు. పార్టీ నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర అధికార ప్రతినిధులు మంచాల బాబ్జీ, చిర్రా రాజ్‌కుమార్ తదితరులు సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement