అంధకారంలో సుమారు 200 గ్రామాలు
Published Sat, Sep 14 2013 5:06 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: విద్యుత్ సమ్మె సిక్కోలు జిల్లాను చిక్కుల్లోకి నెట్టింది. జిల్లా కేంద్రంతో సహా నాలుగో వంతు గ్రామాలను చీకట్లలోకి నెట్టింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మె చేస్తున్న విషయం తెలిసింది. ఈ సమ్మె తొలిరోజైన గురువారంనాడే జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం ఉదయం నుంచి విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతోపాటు తాత్కాలిక ఉద్యోగులతో మరమ్మతులు చేయిస్తున్నా పెద్ద ప్రయోజనం కనిపించడంలేదు. గురువారం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలోని దాదాపు సగం ప్రాంతాలతోపాటు 85 గ్రామాలకు సరఫరా నిలిచిపోగా.. శుక్రవారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 200 గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఒకపక్క మరమత్తులు చేసి సరఫరా పునరుద్ధరిస్తుంటే.. మరో పక్క మరికొన్ని ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తాత్కాలిక ఉద్యోగులు శుక్రవారం భైరి బారువ, పొం దూరు, కడకెల్ల, బత్తిలి, బెజ్జిపురం, పాలకొండ, కోటబొమ్మాళి రూరల్, బూర్జ, చిలకపాలెం, వీరఘట్టం, పప్పలపాడు, గొల్లకంచిలి తదితర ప్రాంతాల్లో మరమ్మతులు చేయగా పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. అయితే అంతలోనే మరికొన్ని ఫీడర్లలో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా జిల్లాలోని వందలాది గ్రామాల్లో సరఫరా నిలిచిపోయింది. తోటపాలెం, పెదపాడు, అలికాం, గుప్పెడుపేట, కోటబొమ్మాళి పట్టణం, రాగోలు, డోల, దళ్లవలస, మడపాం, తులివాడ, తెట్టంగి, లోలుగు, బుడితి, బోరుభద్ర, గొప్పిలి, వజ్రపుకొత్తూరు, పూండి, కమలపాడు, అక్కుపల్లి, నరసన్నపేట పట్టణంలో సరఫరా నిలిచిపోయింది.
అలాగే శ్రీకాకుళం పట్టణంలోని 50 శాతం ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలిగింది. పట్టణంలోని దమ్మల వీధి, బోడెమ్మ కోవెల, మేదర వీధి, రైతు బజార్, ఇలిసిపురం, డీసీసీబీ కాలనీ, హడ్కో కాలనీ, పాతబస్టాండు, రాయివీధి, ఇలిసిపురం, రైతుబజార్ రోడుడ ఏఎస్‌ఎన్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, ఆదివారపుపేట, బలగ, శాంతినగర్ కాలనీ, బ్యాంకర్స్ కాలనీ, అరసవల్లిలోని కొంతభాగం, హౌసింగ్ బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటిలో కొన్ని ప్రాంతాలకు శుక్రవారం రాత్రి సరఫరా పునరుద్ధరించగలిగారు. అయితే తరచూ కరెంటు పోయి వస్తుండటంతో ఎప్పుడు పూర్తిగా నిలిచిపోతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
కనిపించనిఅధికారులు
శుక్రవారం ఉదయం ఓ గంట మాత్రమే అధికారులు విద్యుత్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. ఆతర్వాత ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసమూర్తితో పాటు, విశాఖపట్నం నుంచి వచ్చిన అధికారులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావులు కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్లు పనిచేయకపోవడం, మరోవైపు అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.
ఫలించని కలెక్టర్ యత్నాలు
సమ్మె కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సౌరభ్‌గౌర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనిపై ట్రాన్స్‌కో ఉద్యోగులతో శుక్రవారం ఆయన చర్చించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నందున విధులకు హాజరుకావాలని కోరగా వారు నిరాకరించారు. దాంతో తాత్కాలిక సిబ్బందితో పనులు చేయిస్తామని అంతరాయం కల్పించకుండా, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వారికి సహకరించాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నెలన్నర రోజులుగా జరుగుతున్నప్పటికీ, విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజల నుంచి తీవ్ర వత్తిడి ఎదుర్కోవలసి వస్తోందని కలెక్టర్ వ్యాఖ్యానించారు. అత్యవసర సేవలకు విఘాతం కలిగినప్పుడు మాత్రం మరమ్మతులు చేయాలని ఆయన అభ్యర్థించగా, అందుకు అంగీకరించిన ఉద్యోగులువిధుల్లోకి మాత్రం 72 గంటల తర్వాతే హాజరవుతామని స్పష్టం చేశారు.
భారీ ఎత్తున వసూళ్లు
ఎక్కడికక్కడ సమస్యలు తలెత్తి సరఫరా నిలిచి పోతుండటంతో దాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు పడుతున్న తాపత్రయాన్ని అవకాశంగా తీసుకొని కొందరు ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు, ట్రాన్స్‌కోలోని కొందరు తాత్కాలిక ఉద్యోగులు భారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వారు అడిగినంత ముట్టజెప్పినట్లు వినికిడి. శ్రీకాకుళం పట్టణంలోని చిన్నబజారుతోపాటు పాత బస్టాండు ప్రాంతంలో సరఫరా నిలిచిపోగా మరమ్మతు చేసేందుకు ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు రెండువేల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు తెలిసింది. దాంతో ఆ ప్రాంతాల ప్రజలు చందాలు వేసుకొని వారు అడిగినంత చెల్లించి సరఫరాను పునరుద్ధరించుకున్నారని సమాచారం. ఇటువంటి సంఘటనలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో జరిగినట్లుగా తెలుస్తోంది.
రణస్థలం మండలంలోని వేల్పురాయి, దేవరాపల్లి గ్రామస్థులు రణస్థలం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రాత్రి 10 గంటల సమయంలో సుమారు 50 మంది సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
పాలకొండ నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం
పాలకొండ : విద్యుత్ సమ్మె ప్రభావం పాల కొండ నియోజకవర్గంపై తీవ్రంగా పడింది. ప్రధానంగా భామిని మండలం అంధకారంలో మునిగిపోయింది. మండలంలో మొత్తం 59 గ్రామాలుండగా పెద్దదిమిలి, చిన్నదిమిలి, కొరమ మినహా 56 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి చార్జింగ్ చేసేందుకు అవసరమైన విద్యుత్ కూడా అందుబాటులో లేకపోవడం, సిబ్బంది విధుల్లో లేకపోవడంతో ఈ గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక వీరఘట్టం మండలంలో తెట్టంగి ఫీడర్ పరిధిలోకివచ్చే 8 గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాలకొండ పట్టణంలో గురువారం సగభాగానికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా కొన్ని గంటల్లోనే పునరుద్ధరించారు. శుక్రవారం మాత్రం పాలకొండ, సీతంపేట మండలాలకు విద్యుత్ సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడం కొంత ఊరటగా నిలిచింది. కాని ఏ క్షణాన విద్యుత్ సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
నవగాం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన
పాలకొండ : మండలంలోని నవగాం 33/11 కెవి 33 సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ సబ్‌స్టేషన్ పరిధిలోకి వచ్చే ఎనిమిది గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అంధకారం అలముకొంది. దీంతో సబ్ స్టేషన పరిధిలోని వీరఘట్టం మండలం తెట్టంగి, నీలానగరం, కుమ్మరిగుండ, పనస నందివాడ, తలవరం, పాలకొండ మండలం బెజ్జి, టీడీపారాపురం గ్రామాల ప్రజలు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణమే విద్యుత్‌ను పునరుద్ధరించాలని సిబ్బందిని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అంధకారంలో 25 గ్రామాలు
రేగిడి : రేగిడి మండలంలోని 25 గ్రామాల్లో అంధకారం నెలకొంది. శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ గ్రామాలన్నీ అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి విద్యుత్ పరఫరా నిలిచిపోవడంతో బూరాడ, తాటిపాడు, లక్ష్మణ వలస, ఉప్పర్నాయుడువలస, ఆడవరం, లక్ష్మీపురం, ఉంగరాడ మెట్ట తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్‌కో ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో సరఫరాను పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు నరకం చూస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన సోనియ గాంధీకి శాపనార్ధాలు పెట్టారు.
2 రోజుల్లో రూ.6 లక్షల నష్టం
విద్యుత్ సరఫరాలో అంతరాయంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పైడిభీమవరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సమస్యలు తలెత్తడంతో గురు, శుక్రవారాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్యాక్టరీ పని చేయకపోవడంతో ఈ రెండు రోజుల్లోనే రూ. 6 లక్షల వరకు నష్టం వాటిల్లింది. జనరేటర్‌తో యంత్రాలు నడపాలంటే రోజుకు సుమారు రూ. 3 లక్షల విలువైన డీజీల్ ఖర్చవుతుంది. అంత ఖర్చు భరించలేక ఉత్పత్తి నిలిపివేశాం.
- వెంకటరెడ్డి, ల్యాన్‌టెక్ మేనేజర్, పైడిభీమవరం
పనిచేయని కంట్రోల్ రూమ్ ఫోన్లు
విద్యుత్ సమస్యలు ఎదురైతే తెలియజేయాలంటూ విద్యుత్ అధికారులు పత్రికాముఖంగా ఇచ్చిన ఫోన్ నెంబర్లు శుక్రవారం మూగబోయాయి. ల్యాండ్‌లైన్ ఫోన్ తాత్కాలికంగా పనిచేయడం లేదని వస్తుండగా, సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చిన బజారుకు చెందిన పలువురు మహిళలు కుటుంబాలతో సహా విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. తామిక్కడే పడుకుంటామని దోమల బెడదతో నీరు లేక పిల్లా పాపలతో నరకాన్ని చవిచూస్తున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పి శుక్రవారం రాత్రి సరికి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు.
Advertisement
Advertisement