శంఖారావం ప్రతిధ్వనిస్తోంది.. సమైక్య సభ పిలుస్తోంది! | Clarion echoes .. United house calls | Sakshi
Sakshi News home page

శంఖారావం ప్రతిధ్వనిస్తోంది.. సమైక్య సభ పిలుస్తోంది!

Published Mon, Oct 21 2013 4:10 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Clarion echoes .. United house calls

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  విభజన కుట్రలను అడ్డుకునేందుకు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవిరళ కృషి జరుపుతున్న ఏకైక పార్టీగా ప్రజల మన్ననలు పొందుతున్న వైఎస్‌ఆర్ సీపీ అదే స్ఫూర్తితో సమైక్య శంఖారావాన్ని పూరిస్తోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ నెల 26న పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్యులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జూలై నెలాఖరున రాష్ట్ర విభజనపై కేంద్ర నాయకులు ప్రకటన చేసిన రోజు నుంచే వైఎస్‌ఆర్‌సీపీ సమ న్యాయం లేదా సమైక్య రాష్ట్రం అన్న నినాదంతో ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. సమ న్యాయం జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో సమైక్యాంధ్రను కాపాడుకోవాలని పోరాడుతోంది. కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలోనూ ఆ పార్టీ నాయకులు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
 
 ఇదే లక్ష్యంతో పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన బస్సుయాత్ర గత నెలలో జిల్లాలో నిర్వహించగా అన్ని ప్రాంతాల్లోనూ వేల సంఖ్యలో జనం హాజరై సమైక్య ఆకాంక్షను ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పలు సభలు, సమావేశాలు, దీక్షలు, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా గాంధీ జయంతి నుంచి రాష్ట్రావతరణ దినోత్సవం వరకు పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉండగా ఉద్యమానికి మరింత ఊపునిచ్చేందుకు.. సమైక్యాంధ్ర ఆకాంక్షను ఢిల్లీ వరకు గట్టిగా వినిపించేందుకు ఈ నెల 26న హైదరాబాద్‌లో పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లనున్నాయి.
 
 సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది హైదరాబాద్‌లోని తమ బంధువులు ఇళ్లకు చేరుకుంటున్నారు. 26న సభావేదిక వద్దకు నేరుగా వెళ్లవచ్చుననే ఆలోచనతో పలువురు ముందుగానే హైదరాబాద్ బయలుదేరుతున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు సభకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైలుబోగీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 25న బయలుదేరేలా ఈ రైలు బోగీలను బుక్ చేశారు. సుమారు 500 మంది రైలులో వెళ్లాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు. ఇదే కాకుండా ఎవరికి వారు కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక నుంచి తాము వేసే ప్రతి అడుగూ సమైక్యాంధ్ర కోసమేనని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement