ఇంటర్‌సిటీతో పాటు పలు పాసింజర్ సర్వీసుల రద్దు
Published Wed, Oct 9 2013 6:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఆమదాలవలస, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావం ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై తీవ్రంగా పడింది. రెండు రోజుల నుంచి కొన్ని సర్వీసులు రద్దు చేసి, మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడుపుతున్న విషయం విదితమే. సోమవారం కన్నా కాస్త మెరుగ్గా ఉన్నా మంగళవారం మాత్రం ప్రయాణికులను రైల్వే శాఖ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పలాస-విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైళ్లతో పాటు భువనేశ్వర్-విశాఖపట్నం (18411/12) ఇంటర్‌సిటీ, పలాస-విశాఖపట్నం(78531/78532),(58525/58526), (67293/ 67294)ఈఎంయూ పాసింజర్లను రద్దు చేశారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను డీజిల్ ఇంజిన్‌తో నడిపారు. ముజఫర్‌బాద్-యశ్వంత్‌పూర్ (152 28) ఎక్స్‌ప్రెస్ 3గంటలు ఆలస్యంగా నడిచింది. మిగిలిన రైళ్లన్నీ అరగంట, గంట ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రయాణికుల ఇక్కట్లు
రైళ్ల ఆలస్యం, రద్దులతో ప్రయాణికులు లేక ప్లాట్‌ఫారం బోసిబోయింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారితో పాటు సమీపంలోని ప్రయాణికులు రైళ్ల రాకపోకల సమాచారం గురించి బుకింగ్ కౌంటర్ వద్ద నిరీక్షించినా అధికారులు సరైన సమాచారం అందివ్వడంలో విఫలమయ్యారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నిర్మానుష్యంగా నౌపడ రైల్వే స్టేషన్
టెక్కలి రూరల్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ సిబ్బంది చేపట్టిన సమ్మె ప్రభావంతో మంగళవారం పలు ప్రధాన రైళ్లు రద్దయ్యాయి. పాసింజర్ రైళ్లు కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో నౌపడ రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా కనిపించింది.
గంటల తరబడి నిరీక్షణ
పలాస : విద్యుత్ సిబ్బంది సమ్మె ప్రభావం రైళ్ల రాకపోకలపై పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో రైళ్లు రాకపోవడంతో పలాస రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మంగళవారం పలాస రైల్వేస్టేషన్‌కు రావాల్సిన ఎనిమిది పాసింజర్ రైళ్లు రద్దయినట్లు పలాస రైల్వేస్టేషన్ మేనేజర్ ఎంకె రావు చెప్పారు.
పలాస- గుణుపూర్, గుణుపూర్-పలాస, పలాస-విశాఖ, విశాఖ-పలాస, ఈఎంయు, పూరి-గుణుపూర్ పాసింజర్ రైళ్లతోపాటు భువనేశ్వర్-విశాఖ ఇంటర్‌సిటీ, విశాఖ-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయని ఆయన చెప్పారు. భువనేశ్వర్- సికింద్రాబాదు విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్, హౌరా-వాస్కోడిగామా, హౌరా- చెన్నై మెయిల్ సుమారు గంట ఆలస్యంగా నడిచాయన్నారు. పలాస రైల్వేస్టేషన్ మీదుగా మంగళవార ం మొత్తం 13 ఎక్స్‌ప్రెస్ రైళ్లు యథాతథంగా రాకపోకలు సాగించాయని చెప్పారు. పూరీ-గుణుపూర్ పాసింజర్ రైలు పలాసలో నిలుపుదల చేశారు. ఆ రైలు ఎప్పుడు వెళుతుందో చెప్పలేమని స్టేషన్ మేనేజర్ అన్నారు.
పట్టించుకునే నాథుడేడి?
విద్యుత్ సమస్యతో రైళ్లు ఆగుతుండడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల బాధలు పట్టించుకునే నాథుడే లేడు. సకాలంలో రాని రైళ్ల సమాచారం ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం.
- పి.రాములు (సిరుసువాడ), హైదరాబాద్
వసతుల్లేని స్టేషన్
జిల్లా కేంద్రానికి సమీపంలో గల రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కడ సరైన వసతిలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి సరైన బోజనం దొరకలేదు. వసతులపై అధికారులు దృష్టి సారించాలి.
- వి.కృష్ణాచారి (శ్రీకాకుళం), హైదరాబాద్
Advertisement
Advertisement