అలుపూ సొలుపు లేని ఉద్యమం
Published Thu, Oct 10 2013 4:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం అలుపూ సొలుపు లేకుండా కొనసాగుతోంది. రెండోరోజు బుధవారం కూడా కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఉద్యోగు లు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రాజాంలో కాపు కులస్తులు కన్నెర్ర పేరిట ఆందోళ కార్యక్రమాలు చేపట్టగా కంచిలిలో విద్యార్థి గర్జన నిర్వహించారు. కొన్నిచోట్ల పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులను సమైక్యవాదులు బయటకు పంపి కార్యాలయాలను మూసివేయించారు.
శ్రీకాకుళంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. సోనియా, దిగ్విజయ్‌సింగ్, బొత్స, కృపారాణిల దిష్టిబొమ్మలతో లెస్సైన్స్‌డ్ సర్వేయర్లు, కన్సల్టెంట్ ఇంజినీర్లు ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా, కృపారాణి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కృపారాణి, కావూరి ఫ్లెక్సీలపై మున్సిపల్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు టమాటా పళ్లు, గుడ్లు విసిరి నిరసన తెలిపారు. పీఆర్, ఆర్డీ ఉద్యోగులు కృపారాణి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
పాలకొండలో కొందరు సమైక్యవాదులు ఏపీ గ్రామీణ వికాస్‌బ్యాంక్ మేడపైకి ఎక్కి కేంద్రమంత్రి కిశోర్‌దేవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో శాంతించారు. మండల ఐకేపీ ఉద్యోగులు, పెదకాపువీధి పాఠశాల సముదాయం పరిధిలోని ఉపాధ్యాయులు రిలే దీక్ష చేపట్టారు. కోటదుర్గమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమం జరిపారు. సీతంపేటలో గురుకుల ఉపాధ్యాయులు, వీరఘట్టంలో నడుకూరు దళిత ఉద్యోగ సంఘ ప్రతినిధులు రిలే దీక్ష చేపట్టారు.
ఆమదాలవలసలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధం చేపట్టారు. ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. సరుబుజ్జిలి, పొందూరు, కొల్లివలస జంక్షన్లలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి.
ఇచ్ఛాపురంలో ఒడిశా సవరదేవిపేటకు చెందిన ఉత్కళాంధ్ర సభ్యులు రిలే దీక్ష చేశారు. సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ దిష్టిబొమ్మలతో టీడీపీ కార్యకర్తలు శవయాత్ర నిర్వహించి దహ నం చేశారు. కంచిలి, కవిటిల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. కంచిలిలో సమైక్యాం ధ్ర విద్యార్థి గర్జన నిర్వహించారు. ర్యాలీలో వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
పాతపట్నంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయా న్ని జేఏసీ నాయకులు మూసివేయించారు. రిలే దీక్షలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పలాసలో ప్రెస్‌క్లబ్, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ జేఏసీ, టీడీపీల ఆధ్వర్యంలో వేర్వేరుగా చేపట్టిన రిలే దీక్షలు, పాతటెక్కలి, మందసల్లో రిలే దీక్షలు కొనసాగాయి.
రాజాంలో కాపు కులస్తులు ‘కాపు కన్నెర్ర’ పేరిట పట్టణ బంద్ చేపట్టారు. ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రిలే దీక్షలో పాల్గొన్నారు.
ఎచ్చెర్లలో జాతీయ రహదారిపై ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ , సమాక్యాంధ్ర వాదనలతో టగ్ ఆఫ్ వార్ ఆడి సమైక్యవాదం గెలిచినట్టు చూపారు.
నరసన్నపేటలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ ప్రతినిధులు మూసివేయించారు. విద్యార్థులు, సమైక్యవాదులు ర్యాలీ చేశారు.
కొనసాగిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల రిలే దీక్షలు
సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా బుధవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు చేశారు. శ్రీకాకుళంలో ఆరుగురు ముస్లిం సోదరులు, ఇచ్ఛాపురంలో 8 మంది, పాతపట్నంలో 11 మంది, ఆమదాలవలసలో 12 మంది, ఎచ్చెర్లలో 9 మంది, పలాసలో 11 మంది, రాజాంలో ఐదుగురు కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement