కొనసాగిన సమైక్య ఉద్యమం | Continued united movement | Sakshi
Sakshi News home page

కొనసాగిన సమైక్య ఉద్యమం

Published Thu, Oct 17 2013 3:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Continued united movement

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పైలీన్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. తెలంగాణ  నోట్‌ను వ్యతిరేకించాలని, ఆ బిల్లు అసెం బ్లీకి వస్తే ఓడించాలని ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్న ఏపీఎన్జీఓ సంఘం నాయకులు బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే, మంత్రి శత్రుచర్ల విజయరామరాజు నుంచి ఆ మేరకు హమీపత్రం పొందారు. శ్రీకాకుళంలో  రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, జిల్లా పరిషత్, పురపాలక సంఘం ఉద్యోగులు, న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
 
   పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వేదిక శిబిరంలో డివిజన్ విద్యార్థి జేఏసీ, ఐటీడీఏ ఉపాధ్యాయులు, గ్రామ సేవకుల జేఏసీ ప్రతినిధులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు పాలకొండ-శ్రీకాకుళం ప్రధాన రహదారిలో కుర్చీలు పెకైత్తి పట్టుకుని రాస్తారోకో నిర్వహించారు. ఆంజనేయ సెంటర్‌లోని వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంలో పొట్లి మాజీ సర్పంచ్‌లు బెజ్జిపురం లక్షుంనాయుడు, తేగల రాములతోపాటు 25 మంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
 
   ఆమదాలవలసలో సమైక్యాంధ్ర జేఏసీ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆమదాలవల స రామమందిరం సమీపంలోని వైఎస్‌ఆర్‌సీపీ దీక్షా శిబిరంలో ఆరుగురు రిలే దీక్ష చేపట్టారు.
 
   పలాస-కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 56వ రోజుకు చేరాయి.
 
   రాజాంలో ఏపీఎన్‌జీఓ జేఏసీ శిబిరంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లు రిలే దీక్ష చేశారు. అంబేద్కర్ జంక్షన్‌లో సోనియా గాంధీ, కేంద్రమంత్రుల కమిటీలో ఉన్న మంత్రుల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలపై కుళ్లిన టామాటాలు, కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ దీక్షా శిబిరంలో ఏడుగురు రిలే దీక్ష చేశారు. రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద ఎన్‌జీఓ జేఏసీ ప్రతినిధులు రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను గంటసేపు నిలిపివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement