మద్యం ఆదాయానికి సమైక్య షాక్
Published Thu, Oct 10 2013 4:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ప్రభుత్వోద్యోగుల సమైక్య సమ్మెతో ఇప్పటికే కుదేలైన సర్కారు ఖజానాకు ఇప్పుడు మరో కన్నం పడనుంది. కీలకమైన దసరా సీజనులో మద్యం అమ్మకాలు రెట్టింపునకుపైగా పెరిగి భారీ ఆదాయం సమకూర్చడం సర్వసాధారణం. అయితే ఈసారి సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అంత ఆదాయం వస్తుందో రాదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎక్సైజ్ సిబ్బంది బాంబు పేల్చారు. గురువారం రాత్రి నుంచి తాము సైతం సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. దసరా పండుగకు రెండు రోజుల ముందు సమ్మె చేపట్టనుండటంతో షాపులు, బార్లకు మద్యం సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఫలితంగా సర్కారు ఆదాయం పడిపోతుంది.
జిల్లాలో 232 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 29 దుకాణాల పర్మిట్లు ఈ ఏడాది రెన్యూవల్ కాలేదు. మిగిలిన 203 దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే జిల్లాలో 17 బార్లకుగాను ఒక బార్ లెసైన్సు వివాదం కారణంగా మూతపడింది. మిగతా 10 బార్లు కొనసాగుతున్నాయి. వీటికి మద్యం సరఫరా చేసే బాట్లింగ్ యూనిట్‌లోని ఎక్సైజ్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి రానుండటంతో సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. తమ వద్ద ఇప్పటికే ఉన్న స్టాక్‌ను మాత్రమే మద్యం షాపులు, బార్లు విక్రయించగలుతాయి. ఆ తర్వాత మూతపడక తప్పదు.
ఎక్సైజ్ జేఏసీ ఏర్పాటు
ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా ఎక్సైజ్ పోలీసులు సమ్మె సైరన్ మోగించారు. గురువారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 212 మంది ఎక్సైజ్ పోలీసులు సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె పర్యవేక్షణకు జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం శ్రీకాకుళంలో సమావేశమైన ఉద్యోగులు జేఏసీ చైర్మన్‌గా శ్రీకాకుళం సీఐ ఎస్.విజయ్‌కుమార్, వైస్ చైర్మన్‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్ కానిస్టేబుల్ కె.రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా టెక్కలి సీఐ పాపారావు, కానిస్టేబుల్ సింహాచలంలను ఎన్నుకున్నారు. అనంతరం ఉద్యమ కార్యచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎస్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తామన్నారు.
శుక్రవారం ఉదయం పది గంటలకు యూనిఫారాలు ధరించి వైఎస్‌ఆర్ కూడలి నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. మద్యం తయారీ సంస్థలు, బాట్లింగ్ యూనిట్లలో పనిచేస్తున్న ఎక్సైజ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని వివరించారు.
Advertisement
Advertisement