11న పాలకొండ డివిజన్ బంద్
Published Mon, Sep 9 2013 4:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
పాలకొండ/ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: ఈ నెల 11న పాలకొండ డివిజన్ బంద్‌కు పాలకొండ డివిజన్ సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. పాలకొండలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జేఏసీ అత్యవసర సమావేశంలో జేఏసీ గౌరవాధ్యక్షుడు వి.వి.గోపాలకృష్ణ, అధ్యక్షుడు ఇ.లిల్లీపుష్పనాథం, కన్వీనర్లు బి.కె.మూర్తి, కె.రంగాచారి, ఎం.సంపత్‌కుమార్‌లు ఏకగ్రీవ ఆమోదంతో తీర్మానించారు. 40 రోజులుగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పాలకొండ రెవెన్యూ డివిజన్‌లోని హిరమండలం, కొత్తూరు, భామిని, పాలకొండ, వీరఘట్టాం, పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోట, సీతంపేట మండలాల్లో సంపూర్ణ బంద్ చేపట్టేందుకు పాలకొండ ఆర్డీవో దయానిధి పిలుపునిచ్చారని హిరమండలం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఆర్.గోవిందపట్నాయక్ తెలిపారు. దీనికి ఉపాధ్యాయలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, ఎన్జీవోలు, వ్యాపార, వర్తక సంఘాలతో పాటు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళా సంఘాలు, ఉపాధిహామీ సిబ్బంది, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఆటో యూనియన్లు, ట్రక్కర్ యూనియన్లు, అభిమానులు, సమైక్యాంధ్రా పోరాట ఆందోళన కారులు సహకరించాలని కోరారు.
ఆరోజు దుకాణాలు పూర్తిగా బంద్ పాటించాలన్నారు. జేఏసీ సమావేశంలో గిరిజన ఉపాధ్యాయ ఐక్యవేదిక చైర్మన్ గున్ను రామ్మోహనరావు, ఉపాధ్యాయ సంఘ నేతలు సిరిపురపు శ్రీనివాస్, దన్నాన నారాయణరావు, పక్కి శివప్రసాదరావు, శీమల రామ్‌గోపాల్, జి.విజయభాస్కర్, విద్యార్థి జేఏసీ డివిజన్ కన్వీనర్ లంక నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement