తారస్థాయికి సమైక్య ఉద్యమం
Published Sat, Sep 21 2013 4:21 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు, వంటా వార్పు, రిలే నిరాహార దీక్షలు కొనసాగగా.. ఉద్యమానికి పెద్ద ఊపు తెచ్చేలా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ‘సిక్కోలు సమైక్య గర్జన’, పలాసలో ‘లక్ష జనకేక’ పేరిట భారీ బహిరంగ సభలు జరిగాయి. వీటిలో లక్షలాది మంది జనం పాల్గొని సమైక్య వ్యాణిని ముక్తకంఠంతో వినిపించారు. జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం కూడా ముతపడ్డాయి. కొన్నిచోట్ల బ్యాంకు శాఖలను తెరిచేందుకు ప్రయత్నం చేయగా సమైక్యవాదులు అడ్డుకున్నారు.
పాలకొండలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు విధులు నిర్వహించడంతో సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు కార్యాలయం రెండో అంతస్తుపై ఉన్న హోర్డింగ్ ఎక్కి కార్యాలయాన్ని మూసివేస్తేనే కిందకు దిగుతామని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కిందకు దించి కార్యాలయానికి తాళం వేశారు. రాజాంలోని ఇండియా ఇన్‌ఫోలైన్ కార్యాల యంలో ఆరుగురు ఉద్యోగినులను లోపల ఉంచి కోఆర్డినేటర్ బయట తాళం వేసిన విషయాన్ని గుర్తించిన ఎన్‌జీఓ, ఆర్టీసీ, ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు, న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఏఎస్‌ఐ ప్రసాదరావు అక్కడకు చేరుకుని మేనేజర్‌తో మాట్లాడి తాళం తీయించి ఉద్యోగినులను బయటకు పంపారు. శ్రీకాకుళంలో జెడ్పీ ఉద్యోగులు ఆర్ అండ్ బీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈఈని బయటకు పంపారు, నరసన్నపేటలో నడిరోడ్డుపై డాక్టర్లు వైద్య సేవలందించారు.
రాజాంలో ఎన్‌జీఓ జేఏసీ రిలే దీక్షలో పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ శిబిరంలో సారధి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులు కూర్చున్నారు. వీరికి సంఘీబావంగా ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు లలితా సహస్రనామ పారాయణం చేశారు. రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద 150 మీటర్ల పొడవుగల జాతీయ జెండాతో జేఏసీ ప్రతినిధులు ప్రదర్శన చేపట్టారు.
ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, ఉపాధ్యాయ జేఏసీ, ఎన్జీఓల రిలే దీక్షలు.. కవిటిలో ఉపాధ్యాయ జేఏసీ, టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు, కంచిలిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ప్రతినిధుల రిలే దీక్షలు.. ఎం.ఎస్.పల్లిలో జేఏసీ రిలేదీక్షలు, కంచిలిలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ప్రతినిధుల రిలే దీక్షలు కొనసాగాయి. కంచిలి, బారువల్లో రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఇచ్ఛాపురంలో దీక్ష చేసిన కార్యకర్తలకు వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.కృష్ణారావు సంఘీభావం తెలిపారు.
పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక శిబిరం వద్ద బడ్డుమాసంగి, గంగంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు రిలే దీక్ష చేపట్టారు. ఇక్కడ నిర్వహించిన చిలక జోస్యం వినోదాన్ని పంచింది. ఉమ్మడి ఉపాధ్యాయ ఐక్యవేదిక వద్ద పాలకొండ జెడ్పీ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయులు చీపుళ్లతో ప్రధాన రోడ్డును శుభ్రం చేశారు. పట్టణంలోని కళాశాల ల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు టెక్కలి, శ్రీకాకుళం వైపు వెళ్లే ఇంజినీరింగ్ కళాశాలల బస్సులను అడ్డుకున్నారు. ఎస్‌బీఐ శాఖలో చీఫ్ మేనేజర్ సమీక్ష నిర్వహిస్తుండగా సమైక్యవాదులు అడ్డుకొని ఆయనను బయటకు పంపారు. వీరఘట్టంలో ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. భామిని, సీతంపేటల్లో బ్యాంకులను సమైక్యవాదులు మూసివేయించారు.
ఆమదాలవలసలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యమకారులు మూసివేయించారు. ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. రాష్ట్ర విభజన వద్దంటూ ప్రధానికి రాసిన పోస్ట్‌కార్డులను మహిళలు మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. సరుబుజ్జిలి జంక్షన్ లో రేషన్ డీలర్లు రిలే దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగాయి. పొందూరులో నాయి బ్రాహ్మణులు ర్యాలీ, మానవహారం చేపట్టి రోడ్డును దిగ్బంధించారు. బూర్జ, కొల్లివలసలో ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది రిలే దీక్ష చేపట్టారు. కొరగాంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.
టెక్కలిలో ఇన్‌ఫాంట్ జీసస్ పాఠశాల సిబ్బంది రిలే దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు.
పాతపట్నంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. బస్టాండ్‌లో ఉద్యమకారులు కబడ్డీ ఆడారు. యోగా చేశారు. మెళియాపుట్టిలో నలంద పాఠశాల విద్యార్ధుల ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
Advertisement
Advertisement