ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె జిల్లాలో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్యోగుల సమ్మెతో వరుసగా రెండో రోజు జిల్లాలో చీకట్లు అలుముకున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. విద్యుత్ ఉద్యోగులు మాత్రం సమ్మెను కొనసాగించి తీరుతామని, విద్యుత్ సరఫరాలో తలెత్తే ఇబ్బందులకు బాధ్యత తమది కాదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగి వచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని
డిమాండ్ చేస్తున్నారు.
కరెంటిచ్చింది కొన్నిచోట్లే..
విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆదివారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో జిల్లా మొత్తం కరెంట్ నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రానికి కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయినా ఇప్పటికీ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు నగరంలో ఇప్పటికీ పూర్తిగా విద్యుత్ లేదు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేయలేక అధికారులు తంటాలు పడుతున్నారు. పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు విద్యుత్ ఇచ్చి, మరికొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయకపోవడంపై ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం అయితే నగరం మొత్తం పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేక కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గం, యర్రగొండపాలెం, మార్కాపురం, అద్దంకి, పర్చూరు ఏరియాల్లో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. అద్దంకి పట్టణంలో సోమవారం ఆరు విడతలుగా విద్యుత్‌ను సరఫరా చేశారు. లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగా పనిచేయలేదు. పశ్చిమ ప్రాంత ప్రజలు నిరంతర విద్యుత్ కోతతో అల్లాడుతున్నారు. యర్రగొండపాలెంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేదు. రాత్రికి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. మార్కాపురంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొండపి నియోజకవర్గంలోని గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ నిలిపేశారు. పర్చూరులోనూ ఇదే పరిస్థితి. పామూరు మండలంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
తప్పని ఇక్కట్లు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో వరుసగా రెండో రోజూ జిల్లా వాసులకు కష్టాలు తప్ప లేదు. పట్టణాల్లో నివసించే వారికి నిద్ర కూడా కరుైవె ంది. ఇరుకు గదుల్లో దోమల కాటుకి, ఉక్కపోతలకు తట్టుకోలేక రోడ్లపైకి వచ్చి జాగారం చేయాల్సి వచ్చింది. ఇక చంటి పిల్లల తల్లులు నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు నీటి కష్టాలూ తప్పడం లేదు. విద్యుత్ లేక మోటార్లు పనిచేయకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక తలపట్టుకుంటున్నారు. చేతిపంపులు, బావులు, మున్సిపల్ కుళాయిలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇక గ్రామీణ ప్రజలైతే రెండు రోజుల నుంచి పూర్తిగా అంధకారంలోనే మగ్గుతున్నారు. రెండు రోజుల నుంచి మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో తాగునీటికి సైతం అవస్థపడుతున్నారు.
వ్యవసాయానికి పూర్తిగా బంద్
ఉద్యోగుల సమ్మెతో వ్యవసాయ విద్యుత్‌కు పూర్తి ఆటంకం ఏర్పడింది. పంటలు సాగు చేసుకునే సమయంలో విద్యుత్ కోతల వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మామూలుగానే రోజులో నాలుగైదు గంటలకు మించి కరెంట్ ఉండదు. ఇక సమ్మె ప్రభావంతో కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం వల్లే ఈ స్థితి
-మణికుమార్, జెరాక్స్ షాపు, యజమాని
చిరువ్యాపారులుగా ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తిగా ప్రభుత్వాలదే బాధ్యత. రెండు రోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో అరకొరగా ఉన్న వ్యాపారం కాస్తా దెబ్బతింది. బంద్‌లతో నెల రోజులుగా వ్యాపారమే జరగడం లేదు. అయినా నెల వచ్చే సరికి షాపునకు *7,500 అద్దె, కరెంట్ బిల్లు, నెట్ బిల్లు చెల్లించాలి. వ్యాపారం లేకుండా ఈ బిల్లులన్నీ ఎలా కట్టాలి. ఇందులో ఉద్యోగులను తప్పు పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుండా ఇలా మా లాంటి మధ్యతరగతి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది.
విభజన చీకట్లు
Published Tue, Oct 8 2013 4:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement