వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ | Chimakurthy: Small Scale Granite Industry Units to get Power Subsidy | Sakshi
Sakshi News home page

వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌

Published Wed, Sep 28 2022 8:33 PM | Last Updated on Wed, Sep 28 2022 8:40 PM

Chimakurthy: Small Scale Granite Industry Units to get Power Subsidy - Sakshi

(బివి రాఘవ రెడ్డి) ఈ భూ మండలంలో రెండు విలువైన సంపదలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు కాగా.. మరొకటి ప్రకాశం జిల్లా చీమకుర్తి భూగర్భంలో ఉన్న గెలాక్సీ బ్లాక్‌ గ్రానైట్‌.  

45 ఏళ్ల కిందట.. తనకు రోజూ మంచి కాఫీ ఇస్తున్నాడన్న అభిమానంతో చీమకుర్తి తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు.. ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ టీస్టాల్‌ యజమానికి సాగు చేసుకోమంటూ రెండెకరాలకు పట్టా రాసిచ్చారు. పశువుల మేత కూడా మొలవని ఆ భూమి నాకెందుకంటూ అతను పట్టా తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ భూమి విలువ ఇప్పుడు ఎకరా రూ.3 కోట్లు! 

చీమకుర్తికి 4 కి.మీ దూరంలో రాళ్లు, రప్పలు, రేగుచెట్లతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న వేమా ఎల్లయ్య రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. అదే భూమి గర్భంలో రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్‌ ఉన్నట్లు తర్వాత కాలంలో బయట పడింది.  


చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ మరింతగా వెలుగులు విరజిమ్మనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతులు పెరగటంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబరు 58ని ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రకారం అక్టోబర్‌ 1 నుంచి కొత్త స్లాబ్‌ సిస్టం అమలులోకి రానుంది. 

సింగిల్‌ కట్టర్‌ బ్లేడ్‌ ఉన్న ఫ్యాక్టరీ యజమాని రూ.27 వేలు చెల్లిస్తే 22 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ రాయిని ప్రాసెస్‌ చేసుకునేందుకు అనుమతి వస్తుంది. మల్టీ కట్టర్‌ బ్లేడ్‌ ఫ్యాక్టరీ అయితే రూ.54 వేలు చెల్లించి 44 క్యూబిక్‌ మీటర్ల రాయిని ప్రాసెస్‌ చేసుకోవచ్చు. విద్యుత్‌ చార్జీల రాయితీపైనా త్వరలో జీవో విడుదల కానుంది. ఆ మేరకు యూనిట్‌కు రూ.2 రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఒక్కో ఫ్యాక్టరీ యజమానికి నెలకు కనీసం రూ.లక్ష ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు రా మెటీరియల్‌ను క్వారీ యజమానుల వద్ద నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. విజిలెన్స్‌ దాడుల భయం లేకుండా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. రామాయపట్నం పోర్టు ఇక్కడి ఎగుమతిదారులకు వరం కానుంది.  


రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు

ఈ ప్రాంతంలో ఇప్పటికే 1650 గ్రానైట్‌ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 60 అధునాతన ఫ్యాక్టరీలు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యాయి. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే యజమానులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్‌ పాలసీ ప్రకారం జనరల్‌ కేటగిరీ, బీసీ వర్గాలకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం సబ్సిడీ వస్తుంది. దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రెండు మూడు సంవత్సరాల్లోనే తీర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ సహకారం బాగుండటంతో ఏటేటా ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడేళ్లలోనే 250కి పైగా గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 90 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.   


ఏడాదికి 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎగుమతి

జిల్లా నుంచి ఏడాదికి 8.82 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌  చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, టర్కీ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. అందులో బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ ఒక్కటే 6.25 లక్షల క్యూబిక్‌ మీటర్లు ఎగుమతి అవుతుంది. బ్లాక్‌ గ్రానైట్‌ ఏడాదికి 80 వేల క్యూబిక్‌ మీటర్లు, కలర్‌ గ్రానైట్‌ 1.77 లక్షల క్యూబిక్‌ మీటర్లు ఎగుమతవుతోంది.

వెలికితీసిన గ్రానైట్‌ విలువ రూ.1.26 లక్షల కోట్లు! 
ఇక్కడ గ్రానైట్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఏడాదికి 11 వేల క్యూబిక్‌ మీటర్ల రాయిని వెలికి తీసినా ప్రస్తుతం పది లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయిని తీస్తున్నారు. 35 ఏళ్లలో సరాసరిన ఏడాదికి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల వంతున లెక్కగట్టినా 1.40 కోట్ల చ.మీటర్ల గ్రానైట్‌ రాయిని తవ్వి తీసినట్లు అంచనా. క్యూబిక్‌ మీటర్‌ గ్రానైట్‌ నాణ్యతను బట్టి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. క్యూబిక్‌ మీటర్‌కు సరాసరిన రూ.90 వేలు లెక్కగట్టినా ఇప్పటి వరకు రూ.1.26 లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్‌ను బయటకు తీసినట్లు అంచనా. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్న గ్రానైట్‌లో 30 శాతం గనుల ద్వారా వెలికితీయగా.. రానున్న 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కరువు జిల్లాలో కనకవర్షం... 
ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువుకు పెట్టింది పేరు. అలాంటి జిల్లా నేడు పారిశ్రామిక కేంద్రంగా మారిందంటే దానికి చీమకుర్తి బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ కారణం. అప్పట్లో ఎందుకూ పనికి రాదనుకున్న రామతీర్థం పరిసరాల్లోని భూమి నేడు ఎకరం రూ.3 నుంచి రూ.4 కోట్లకు పైనే పలుకుతోంది. చీమకుర్తితో పాటు ఒంగోలు శివారులో నున్న పేర్నమిట్ట ఎస్టేట్, సంతనూతలపాడు, మార్టూరు, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ తదితర ప్రాంతాల్లో 1650 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌ వంటి పలు రాష్ట్రాల కార్మికులు ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 

ఆదుకున్న వైఎస్‌... 
2008లో ఆర్థిక మాంద్యం కారణంగా గ్రానైట్‌ గనుల లీజుదారులు తీవ్రంగా నష్టాల బారిన çపడ్డారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్పందించి లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీలో మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ నంబర్లు 104, 105 ను జారీ చేశారు. దాంతోనే తాము ఒడ్డున పడ్డామని చీమకుర్తి గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.   


బ్లాక్‌ గెలాక్సీ.. పేరెలా వచ్చిందంటే 

చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో గ్రానైట్‌ ఉన్నట్లు 1983లో బయటపడింది. 1985లో మైనింగ్‌ లీజుకు తీసుకున్న జూబ్లీ గ్రానైట్‌ యజమాని నన్వాని వెలికి తీసిన గ్రానైట్‌ను మార్కెటింగ్‌ కోసం చైనా తీసుకెళ్లారు. నల్లని బండపై నగిషీలు అద్దినట్టున్న ఆ గ్రానైట్‌కు బ్లాక్‌ గెలాక్సీ అని పేరుపెట్టారు.  దాని డిమాండ్‌ను గుర్తించిన చైనా అధునాతన కటింగ్‌ మిషన్లతో పెద్దఎత్తున యూనిట్లను నెలకొల్పింది.  

రూ.11,015 ఆదాయంతో మొదలు 
రామతీర్థం పరిసరాల్లో గ్రానైట్‌ ఉన్నట్లు గుర్తించిన అనంతరం మొట్టమొదటి సారిగా 8.094 హెక్టార్లలో ఒకే ఒక లీజుతో రాయల్టీ ద్వారా రూ.11,015 ఆదాయం వచ్చినట్లు ఒంగోలు భూగర్భ గనుల శాఖాధికారుల వద్దనున్న గణాంకాలు చెబుతున్నాయి. 2013లో రాయల్టీ రూçపంలో ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 1081 హెక్టార్లలో 327 లీజులతో ఏడాదికి రూ.566 కోట్ల ఆదాయం రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి వస్తోందని మైన్స్‌ డీడీ తెలిపారు. జీఎస్టీ, డెడ్‌రెంట్‌లు, పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది.  

ఏటా రూ.500– రూ.600 కోట్లు  
బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 85 శాతం చైనాకు ఎగుమతి అవుతోంది. గ్రానైట్‌ రాయి కటింగ్‌కు, పాలిషింగ్‌కు ఉపయోగించే మిషనరీ, డైమండ్‌ కట్టర్‌లు, సెగ్‌మెంట్‌లు అన్నీ చైనా లో పెద్దఎత్తున అభివృద్ధి చేసి యూనిట్లు స్థాపించారు. కొన్నేళ్లుగా మన పారిశ్రామికవేత్తలు చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. 
– బి.జగన్నాథరావు, మైన్స్‌ డీడీ, ఒంగోలు  

చైనా మార్కెట్‌తోనే డిమాండ్‌  
చీమకుర్తిలోని బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాలో మంచి డిమాండ్‌ ఉంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ గ్రానైట్‌ను నేనే చైనాకు తీసుకుపోయి మార్కెటింగ్‌ చేశాను. ఆ తర్వాత మరో రెండు కంపెనీలు నాతో కలిసి వ్యాపారం చేశాయి. క్వారీలు పెరిగాక ఎగుమతి కూడా భారీగా పెరిగింది. 
– ఎల్‌.టి.నన్వాని, జూబ్లీ గ్రానైట్‌ యజమాని  

స్లాబ్‌ సిస్టంతో మంచి రోజులు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చీమకుర్తి వచ్చినప్పుడు స్లాబ్‌ సిస్టం అమలు చేస్తున్నట్లు చెప్పి, ఆమేరకు జీఓ ఇచ్చారు. ఈ విధానం వల్ల ఫ్యాక్టరీల యజమానులకు నిర్ణీత ధరకు రాయి దొరుకుతోంది.  విద్యుత్‌ చార్జీలపై యూనిట్‌కు రూ.2 రాయితీ వల్ల చాలా కలిసి వస్తుంది. మొత్తం మీద ఫ్యాక్టరీల యజమానులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది.  
– యర్రంనేని కోటేశ్వరరావు, ఫ్యాక్టరీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్, గుండ్లాపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement