ఆక్వా జోన్ పరిధిలో కొత్తగా మరో 3,467 విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ
ఇప్పటికే 54,072 కనెక్షన్లకు వర్తింపు
నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్ల విద్యుత్ సబ్సిడీని భరించిన ప్రభుత్వం
తాజాగా ఏటా మరో రూ.55 కోట్ల అదనపు భారం
ఆక్వా సాధికారత కమిటీ భేటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీదిరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం స్పష్టంచేశారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం జరిగింది.
ఇటీవల ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు మార్చి ఒకటో తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో 4,68,458 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దానిలో 3,33,593.87 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్నట్టుగా ఈ–ఫిష్ సర్వే ద్వారా నిర్ధారించినట్లు మంత్రులు తెలిపారు. మొత్తం 66,993 విద్యుత్ కనెక్షన్లలో ఇప్పటికే ఆక్వా జోన్ పరిధిలో అర్హత పొందిన 50,605 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తుండగా, తాజాగా కమిటీ ఆమోదంతో ఆ సంఖ్య 54,072కు పెరిగిందన్నారు.
ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్లు విద్యుత్ సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లించిందన్నారు. తాజాగా అర్హత పొందిన కనెక్షన్లకు ఏటా రూ.55 కోట్లు అదనపు భారం పడనుందన్నారు. ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన సీడ్ సరఫరా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వడ్డీ రఘురాం చెప్పారు.
ఇక నుంచి అప్సడా అనుమతి పొందిన తర్వాతే విదేశాల నుంచి బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకోవాలని, అలా చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందేవారిలో అర్హులను గుర్తించి సబ్సిడీ వర్తింపజేసేందుకు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు.
ఏపీలోనే వంద కౌంట్ రూ.245
ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటిస్తూ, దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు వివరించారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తోందన్నారు.
గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు రైతుకు దక్కుతోందన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, నీరబ్‌కుమార్ ప్రసాద్, కె.విజయానంద్ జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment