ఏటా విద్యుత్ కొనుగోలుకు రేటు నిర్ణయిస్తున్న విద్యుత్ నియంత్రణ మండలి
ఎంత రేటుకి విద్యుత్ కొన్నప్పటికీ ఈఆర్‌సీ చెప్పిన చార్జీలే వసూలు
అదనపు ఖర్చును వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంల విజ్ఞప్తి
యూనిట్‌కు రూ.1 ఖర్చయితే 40 పైసలే వసూలు
ఖర్చులు తగ్గితే వినియోగదారులకు వెనక్కి ఇచ్చేస్తున్న డిస్కంలు
ఆ విధంగా 2022–23 టారిఫ్‌లో రూ.4,800 కోట్లు తగ్గించి బిల్లుల్లో సర్దుబాటు
ఉచిత, రాయితీ విద్యుత్‌పై ట్రూ అప్ భారాన్ని మోస్తున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించినవే.
ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్‌సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్‌లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్‌సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్‌సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.
ఖర్చు చేసినంతా కాదు
డిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్‌వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్‌సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.
2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది.
అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్‌సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం
2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్‌సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.
ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.
2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment