సాక్షి, అమరావతి: అడవులు, కొండల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన గృహానికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెలలో రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలపై అధ్యయనం చేశాయి.
అడవులు, కొండ ప్రాంతాల్లోని గిరిజనుల గృహాలకు విద్యుత్ లైన్లు వేయడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను వీరు అధ్యయనం చేశారు. గిరిజనుల నుంచి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నంద్యాల జిల్లాలో 213 గిరిజన ఆవాసాల విద్యుదీకరణకు రూ.5 కోట్లు కేటాయించింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.24 కోట్లతో 1982 గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సర్విసులు అందిస్తోంది.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ.33.49 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. ఇంకా ఏవైనా విద్యుత్ అందని గిరిజన గృహాలను కూడా డిస్కంలు గుర్తిస్తున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల విద్యుదీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎంజేఏఎన్‌ఎంఏఎన్) పథకానికి కూడా మన రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం ద్వారా విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాని ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
అర్హులైన గిరిజన లబ్దిదారులందరికీ ప్రభుత్వం సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలు, ట్రూ–అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్టీ వినియోగదారుల రాయితీ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది.
గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి ఉండేది. 100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల సర్విసులకు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 200కు పెంచింది. ఎస్టీల విద్యుత్ సబ్సిడీ గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. దీంతో సర్వీసులూ పెరిగాయి. 5 లక్షలకు పైగా ఎస్టీ కుటుంబాలకు ఇప్పుడు ఉచిత విద్యుత్ అందుతోంది.
ప్రతి ఆవాసానికీ విద్యుత్
ఈపీడీసీఎల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేని 271 గిరిజన మారుమూల హాబిటేషన్స్‌ను గుర్తించాం. 4944 గిరిజన కుటుంబాలకు విద్ద్యుదీకరణ చేయడానికి రూ.29.96 కోట్లతో గతంలో ప్రతిపాదనలు రూపొందించాం.
తాజాగా 1,474 గిరిజన ఆవాసాల్లో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ. 33.49 కోట్లతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఇంకా విద్యుదీకరణ చేయని 245 హాబిటేషన్స్‌లో 1,544 గృహాల విద్యుదీకరణకు పాడేరు డివిజన్‌లోని గిరిజన ప్రాంతాల్లో సర్వే చేశాం. ప్రతిపాదనలు కూడా రూపొందించాం. –ఎల్ మహేంద్రనాథ్, ఎస్‌ఈ, విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment