granite industry
-
చిన్న పరిశ్రమలకు భరోసా ఇస్తోన్న సీఎం జగన్ సర్కార్ పాలసీలు
-
వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్
(బివి రాఘవ రెడ్డి) ఈ భూ మండలంలో రెండు విలువైన సంపదలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు కాగా.. మరొకటి ప్రకాశం జిల్లా చీమకుర్తి భూగర్భంలో ఉన్న గెలాక్సీ బ్లాక్ గ్రానైట్. 45 ఏళ్ల కిందట.. తనకు రోజూ మంచి కాఫీ ఇస్తున్నాడన్న అభిమానంతో చీమకుర్తి తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ టీస్టాల్ యజమానికి సాగు చేసుకోమంటూ రెండెకరాలకు పట్టా రాసిచ్చారు. పశువుల మేత కూడా మొలవని ఆ భూమి నాకెందుకంటూ అతను పట్టా తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ భూమి విలువ ఇప్పుడు ఎకరా రూ.3 కోట్లు! చీమకుర్తికి 4 కి.మీ దూరంలో రాళ్లు, రప్పలు, రేగుచెట్లతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న వేమా ఎల్లయ్య రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. అదే భూమి గర్భంలో రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉన్నట్లు తర్వాత కాలంలో బయట పడింది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ మరింతగా వెలుగులు విరజిమ్మనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతులు పెరగటంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబరు 58ని ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త స్లాబ్ సిస్టం అమలులోకి రానుంది. సింగిల్ కట్టర్ బ్లేడ్ ఉన్న ఫ్యాక్టరీ యజమాని రూ.27 వేలు చెల్లిస్తే 22 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయిని ప్రాసెస్ చేసుకునేందుకు అనుమతి వస్తుంది. మల్టీ కట్టర్ బ్లేడ్ ఫ్యాక్టరీ అయితే రూ.54 వేలు చెల్లించి 44 క్యూబిక్ మీటర్ల రాయిని ప్రాసెస్ చేసుకోవచ్చు. విద్యుత్ చార్జీల రాయితీపైనా త్వరలో జీవో విడుదల కానుంది. ఆ మేరకు యూనిట్‌కు రూ.2 రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఒక్కో ఫ్యాక్టరీ యజమానికి నెలకు కనీసం రూ.లక్ష ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు రా మెటీరియల్‌ను క్వారీ యజమానుల వద్ద నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. విజిలెన్స్ దాడుల భయం లేకుండా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. రామాయపట్నం పోర్టు ఇక్కడి ఎగుమతిదారులకు వరం కానుంది. రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇప్పటికే 1650 గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 60 అధునాతన ఫ్యాక్టరీలు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యాయి. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే యజమానులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం జనరల్ కేటగిరీ, బీసీ వర్గాలకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం సబ్సిడీ వస్తుంది. దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రెండు మూడు సంవత్సరాల్లోనే తీర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ సహకారం బాగుండటంతో ఏటేటా ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడేళ్లలోనే 250కి పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 90 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదికి 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఎగుమతి జిల్లా నుంచి ఏడాదికి 8.82 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, టర్కీ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. అందులో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఒక్కటే 6.25 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతి అవుతుంది. బ్లాక్ గ్రానైట్ ఏడాదికి 80 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్ 1.77 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతవుతోంది. వెలికితీసిన గ్రానైట్ విలువ రూ.1.26 లక్షల కోట్లు! ఇక్కడ గ్రానైట్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఏడాదికి 11 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికి తీసినా ప్రస్తుతం పది లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. 35 ఏళ్లలో సరాసరిన ఏడాదికి 4 లక్షల క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టినా 1.40 కోట్ల చ.మీటర్ల గ్రానైట్ రాయిని తవ్వి తీసినట్లు అంచనా. క్యూబిక్ మీటర్ గ్రానైట్ నాణ్యతను బట్టి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. క్యూబిక్ మీటర్‌కు సరాసరిన రూ.90 వేలు లెక్కగట్టినా ఇప్పటి వరకు రూ.1.26 లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్‌ను బయటకు తీసినట్లు అంచనా. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్న గ్రానైట్‌లో 30 శాతం గనుల ద్వారా వెలికితీయగా.. రానున్న 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరువు జిల్లాలో కనకవర్షం... ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువుకు పెట్టింది పేరు. అలాంటి జిల్లా నేడు పారిశ్రామిక కేంద్రంగా మారిందంటే దానికి చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కారణం. అప్పట్లో ఎందుకూ పనికి రాదనుకున్న రామతీర్థం పరిసరాల్లోని భూమి నేడు ఎకరం రూ.3 నుంచి రూ.4 కోట్లకు పైనే పలుకుతోంది. చీమకుర్తితో పాటు ఒంగోలు శివారులో నున్న పేర్నమిట్ట ఎస్టేట్, సంతనూతలపాడు, మార్టూరు, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ తదితర ప్రాంతాల్లో 1650 గ్రానైట్ ఫ్యాక్టరీలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల కార్మికులు ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదుకున్న వైఎస్... 2008లో ఆర్థిక మాంద్యం కారణంగా గ్రానైట్ గనుల లీజుదారులు తీవ్రంగా నష్టాల బారిన çపడ్డారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీలో మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ నంబర్లు 104, 105 ను జారీ చేశారు. దాంతోనే తాము ఒడ్డున పడ్డామని చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బ్లాక్ గెలాక్సీ.. పేరెలా వచ్చిందంటే చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో గ్రానైట్ ఉన్నట్లు 1983లో బయటపడింది. 1985లో మైనింగ్ లీజుకు తీసుకున్న జూబ్లీ గ్రానైట్ యజమాని నన్వాని వెలికి తీసిన గ్రానైట్‌ను మార్కెటింగ్ కోసం చైనా తీసుకెళ్లారు. నల్లని బండపై నగిషీలు అద్దినట్టున్న ఆ గ్రానైట్‌కు బ్లాక్ గెలాక్సీ అని పేరుపెట్టారు. దాని డిమాండ్‌ను గుర్తించిన చైనా అధునాతన కటింగ్ మిషన్లతో పెద్దఎత్తున యూనిట్లను నెలకొల్పింది. రూ.11,015 ఆదాయంతో మొదలు రామతీర్థం పరిసరాల్లో గ్రానైట్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం మొట్టమొదటి సారిగా 8.094 హెక్టార్లలో ఒకే ఒక లీజుతో రాయల్టీ ద్వారా రూ.11,015 ఆదాయం వచ్చినట్లు ఒంగోలు భూగర్భ గనుల శాఖాధికారుల వద్దనున్న గణాంకాలు చెబుతున్నాయి. 2013లో రాయల్టీ రూçపంలో ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 1081 హెక్టార్లలో 327 లీజులతో ఏడాదికి రూ.566 కోట్ల ఆదాయం రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి వస్తోందని మైన్స్ డీడీ తెలిపారు. జీఎస్టీ, డెడ్రెంట్లు, పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది. ఏటా రూ.500– రూ.600 కోట్లు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 85 శాతం చైనాకు ఎగుమతి అవుతోంది. గ్రానైట్ రాయి కటింగ్‌కు, పాలిషింగ్‌కు ఉపయోగించే మిషనరీ, డైమండ్ కట్టర్లు, సెగ్మెంట్లు అన్నీ చైనా లో పెద్దఎత్తున అభివృద్ధి చేసి యూనిట్లు స్థాపించారు. కొన్నేళ్లుగా మన పారిశ్రామికవేత్తలు చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. – బి.జగన్నాథరావు, మైన్స్ డీడీ, ఒంగోలు చైనా మార్కెట్‌తోనే డిమాండ్ చీమకుర్తిలోని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ గ్రానైట్‌ను నేనే చైనాకు తీసుకుపోయి మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత మరో రెండు కంపెనీలు నాతో కలిసి వ్యాపారం చేశాయి. క్వారీలు పెరిగాక ఎగుమతి కూడా భారీగా పెరిగింది. – ఎల్.టి.నన్వాని, జూబ్లీ గ్రానైట్ యజమాని స్లాబ్ సిస్టంతో మంచి రోజులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చీమకుర్తి వచ్చినప్పుడు స్లాబ్ సిస్టం అమలు చేస్తున్నట్లు చెప్పి, ఆమేరకు జీఓ ఇచ్చారు. ఈ విధానం వల్ల ఫ్యాక్టరీల యజమానులకు నిర్ణీత ధరకు రాయి దొరుకుతోంది. విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 రాయితీ వల్ల చాలా కలిసి వస్తుంది. మొత్తం మీద ఫ్యాక్టరీల యజమానులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. – యర్రంనేని కోటేశ్వరరావు, ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్, గుండ్లాపల్లి -
AP: రాష్ట్రంలో గ్రానైట్ 'మెరుపులు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. తన పాదయాత్రలో పలు ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల కష్టాలను విన్న వైఎస్ జగన్ ఆనాడు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ఆర్థిక మాంద్యం, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలతో మూతపడిన గ్రానైట్ పరిశ్రమలు మళ్ళీ పుంజుకొనేలా శ్లాబ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు శ్లాబ్ విధానాన్ని ప్రతిపాదించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేసేలా శ్లాబ్‌లను నిర్ణయించాలని కోరారు. దానిపై స్పందించిన వైఎస్ఆర్ 2009లో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ప్రతి కట్టర్‌కు రూ.14 వేల శ్లాబ్‌ను ఖరారు చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఈ విధానం అమలు కాలేదు. 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 97 ద్వారా శ్లాబ్ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే ఆర్థిక మాంద్యంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రానైట్ కర్మాగారాలు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 వేల గ్రానైట్ కర్మాగారాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన వేలాది కార్మికులు, రవాణా, మార్కెటింగ్ రంగాల వారు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను పలువురు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు కలిశారు. వారి కష్టాలను వివరించారు. గ్రానైట్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన శ్లాబ్ విధానానికి చర్యలు ప్రారంభించారు. గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో గనుల శాఖ అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. స్లాబ్ విధానం, ప్రయోజనాలు, ఆచరణ యోగ్యమైన విధానాలపై చర్చించారు. ఎవరైతే ఈ విధానం పట్ల ఆసక్తి చూపుతారో, వారు స్వచ్ఛందంగా దీని పరిధిలోకి వచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ విధానం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. సీనరేజికీ శ్లాబు విధానం స్టోన్ కటింగ్, క్వాలిటీ పరిశ్రమల్లో గ్రానైట్ బ్లాకులపై వసూలు చేసే సీనరేజి ఫీజుకు కూడా ప్రభుత్వం శ్లాబ్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలో సింగిల్ బ్లేడ్‌కి రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌కి రూ.54 వేలు రేటుగా నిర్ణయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బ్లేడ్‌కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.44 వేలు రేటుగా నిర్ణయించింది. తిరిగి తెరుచుకోనున్న పరిశ్రమలు ఇప్పటికే మూతపడిన పరిశ్రమలు శ్లాబ్ విధానంతో తిరిగి తెరుచుకుంటాయి. అంతే కాదు.. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాకుండా రెండో రకంతో ఉన్న చిన్న సైజ్ గ్రానైట్ బ్లాక్‌లను కూడా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు వృధాగా వదిలేస్తున్న ఈ ఖనిజాన్ని కూడా దేశీయ అవసరాలకు అనుగుణంగా చిన్న సైజుల్లో తయారుచేసి, మార్కెట్ చేసుకోవచ్చు. దీనివల్ల దేశీయ మార్కెట్లో అన్ని వర్గాల వారికి వారి అవసరాలకు అనుగుణమైన గ్రానైట్ పలకలను అందించే వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు గ్రానైట్ పరిశ్రమలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గ్రానైట్, కట్టింగ్, పాలిషింగ్, రవాణా, మార్కెటింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లభిస్తుంది. -
కుప్పం గ్రానైట్.. అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్
కుప్పంలో గ్రానైట్ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ లభించే అరుదైన గ్రీన్ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన రాళ్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి బంగారం లావాదేవీల కారణంగా స్థానిక ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతోంది. సాక్షి, చిత్తూరు/శాంతిపురం: జిల్లా సరిహద్దు ప్రాంతంలోని కుప్పం నియోజకవర్గం గ్రానైట్ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. పొరుగునే తమిళనాడు, కర్ణాటక ఉండడంతో లావాదేవీలకు మరింత అనుకూలంగా మారింది. ఈ ప్రాంతంలో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు లభిస్తుంటాయి. అయితే గ్రీన్ గ్రానైట్‌కు మాత్రం మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల రాళ్లు ఇక్కడ దొరుకుతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. ప్రధానంగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు, సి.బండపల్లె, రామకుప్పం మండలం బగళనత్తం, ముద్దనపల్లె, గుడుపల్లె మండలం ఓయన్ పుత్తూరు, పాపానూరులో సుమారు 100 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడే గ్రానైట్ రాళ్లను వివిధ సైజ్‌ల్లో తీర్చిదిద్దుతారు. ప్లేట్లు, క్యూబ్స్, కర్బ్స్గా పల ఆకృతుల్లో రాళ్లను మలుస్తుంటారు. వేలాది మందికి ఉపాధి కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీల్లో సుమారు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. తమిళనాడు, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 20వేల మందికి జీవనోపాధి లభిస్తోంది. మొత్తం 40వేల కుటుంబాల వరకు గ్రానైట్ పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడి కార్మికులు ఒక్కో గ్రానైట్ పీస్‌కు కూలీ కింద రోజుకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. ఆకర్షణీంగా డిజైన్లు కుప్పం పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు లభిస్తుంటాయి. ఆకుపచ్చ (గ్రీన్), బూడిద రంగు (గ్రే), గ్రీన్ అండ్ గ్రే రాళ్లు ఆకర్షణీయమైన లేన్లుగా ఉంటాయి. వీటి బేస్ తెల్లటి మచ్చలు, లైనింగ్‌తో చూడగానే ఆకట్టుకుంటాయి. ఇక తక్కువ పరిమాణంలో బ్లాక్‌స్టోన్ కూడా దొరుకుతుంటాయి. వీటిలో గ్రీన్ గ్రానైట్ అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. బ్రిటీష్ కాలంలోనే.. బ్రిటీష్ వారి పాలనలోనే కుప్పం గ్రానైట్ ఎగుమతి ప్రారంభమైనట్లు రికార్డుల్లో ఉంది. 1925లో ఇక్కడి నుంచి లండన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సమాధి రాళ్ల కోసం తెల్లదొరలు కుప్పం గ్రానైట్‌ను తీసుకెళ్లినట్లు పేర్కొని ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం సుమారు 35 ఏళ్లుగా కుప్పం గ్రానైట్ ఎగుమతులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే.. గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా గ్రానైట్ వ్యాపారం డీలా పడింది. లావాదేవీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర సంక్షభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యథావిధిగా పుంజుకుందని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఎగుమతులు కూడా బాగా సాగుతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!) రూ.కోట్ల లావాదేవీలు.. కుప్పం గ్రీన్ గ్రానైట్‌కు అధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ గ్రానైట్‌ను కొనుగోలు చేసేందుకు దేశ,విదేశీ వ్యాపారులు పోటీపడుతుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పలు కార్పొరేట్ కంపెనీలు తమ నిర్మాణాల్లో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే కుప్పం నుంచి ప్రతి నెలా సుమారు 2వేల టన్నుల వరకు గ్రీన్ గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రూ.కోట్ల లావాదేవీలు సాగిస్తున్నారు. భారీ గ్రానైట్ బండలను స్థానికంగానే ట్రిమ్మింగ్ చేసి వివిధ సైజుల్లో తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సైతం పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి పనే జీవనాధారం మాకు రాతి పనే జీవనాధారం. గ్రానైట్ డ్రస్సింగ్ క్యాంపుల్లో నేను, నా భార్య జయమ్మ పనిచేస్తున్నాం. ఒక్కో పీస్‌కు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వస్తోంది. ఈ డబ్బుతోనే మా పిల్లలను చదివిస్తున్నాం. వాళ్లు మాలాగా కాయకష్టం చేయకుండా ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. గ్రానైట్ వ్యాపారం బాగా సాగితే కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుంది. – సుబ్రమణ్యం, రాళ్లబూదుగూరు మరో పని తెలియదు చదువు ఒంట బట్టక మా నాన్నతో కలిసి చిన్నతనం నుంచి రాయిని తొలిచే పనులకు వచ్చేవాడిని. సుమారు 20 ఏళ్లుగా రాతి పని చేస్తుండటంతో మరో వృత్తి తెలియదు. పనులు బాగా దొరికితే రోజుకు రూ వెయ్యి వరకు వస్తుంది. అయితే కరోనా సమయంలో పనిలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాం. ప్రభుత్వం, దాతల సాయంతో పొట్ట పోసుకున్నాం. ఇప్పుడు మళ్లీ పనులు పెరుగుతున్నాయి. – కార్తీక్, కార్మికుడు, సోలిశెట్టిపల్లె -
‘గ్రానైట్ కుటుంబాన్ని విస్మరించను’
ఖమ్మం మయూరిసెంటర్: తాను వ్యాపారంలో ఎద గడానికి, రాజకీయంగా రాణించడానికి దోహద పడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమకు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమను కాపాడుకోవడం లో ముందుంటానని చెప్పారు. ఇటీవల రాజ్యసభ కు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరి శ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వం దలాది మంది గ్రానైట్ యజమానులు ఈ కార్యక్ర మానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అసోసి యేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడుతూ.. గ్రానైట్ పరిశ్రమలో ఉన్న వాళ్లంతా తన కుటుంబ సభ్యులని అన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా ముందుంటానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రానైట్ కుటుంబం నుంచి ఇంత కాలం తానొక్కడినే ఎంపీగా ఉన్నానని, ఇప్పుడు రవిచంద్ర కూడా ఎన్నికవడం సంతోషకర మన్నారు. సభలో గ్రానైట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, సంఘం ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంకటరమణ, గంగుల ప్రదీప్, రాయల నాగేశ్వర రావు, జిల్లా అశోక్, చక్రధర్‌రెడ్డి, శరాబందీ, కోటేశ్వరరావు, నరేందర్, వెంకట్రావు, ఫణి కుమార్, శ్రీధర్, రవీందర్రావు పాల్గొన్నారు. -
పెట్రోమంట.. ఫీజుల మోత
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్న గ్రానైట్ పరిశ్రమపై మరో దెబ్బ. ఇటీవల పెంచిన ఫీజులు ఆ పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా 112 శాతం ఫీజులు పెంచడంతో పరిశ్రమ కుదేలవుతుందని యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సతమతమవుతుంటే ఈనెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన మైనింగ్ పాలసీతో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమకు గడ్డుకాలం వచ్చింది. దీంతో గ్రానైట్ రంగంలో చిన్న తరహా పరిశ్రమగా ఉన్న కంకర క్వారీలు, మిల్లులను యాజమాన్యాలు రెండు రోజులుగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన ఫీజులను తగ్గించాలని ఆందోళనబాట పట్టాయి. దిక్కుతోచని స్థితిలో... నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి మైనింగ్‌శాఖ ఫీజులు పెంచుతుంది. ఇది కూడా కొంతమేర పెరగడంతో పరిశ్రమపై అంతగా భారం పడలేదు. కానీ 2015 తర్వాత ఒక్కసారిగా ఆరేళ్లకుగాను 112 శాతం ఫీజులను పెంచుతూ ప్రభుత్వం 17 జీఓలను విడుదల చేసింది. దీనికితోడు ఇదే నెలలో విద్యుత్ చార్జీలు కూడా పెంచడం, గత నెల రోజుల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల నిర్వహణ, రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్రంలో 500 గ్రానైట్ క్వారీలు, సుమారు 1,200 గ్రానైట్ పరిశ్రమలు, 750 కంకర మిల్లులు, 2,549 కంకర క్వారీలు ఉన్నాయి. ఏ సెక్టార్‌నూ వదల్లేదు.. గ్రానైట్ రంగంలో ఏ సెక్టార్‌నూ వదలకుం డా విపరీతంగా ఫీజులు పెంచారు. ఇప్పటి వరకు ఉన్న డెడ్ రెంట్ (ఏటా చెల్లించే రుసుం), సీనరేజీ, దరఖాస్తు రుసుం, లీజు బదిలీ, లీజు పునరుద్ధరణ (రెన్యువల్) ఫీజులు, రిఫండబుల్, నాన్ రిఫండబుల్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. ఒక హెక్టార్ క్వారీకి ప్రస్తుతం వార్షిక డెడ్‌రెంట్æ రూ.లక్ష ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెరిగింది. కలర్ గ్రానైట్ క్వారీ డెడ్‌రెంట్ రూ.80 వేల నుంచి 1.60 లక్షలైంది. మార్బుల్, భవన నిర్మాణ రాళ్లు, రహదారి కంకర, మాన్యుఫాక్చర్డ్ ఇసుకకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. రోడ్డు మెటల్ సీనరేజీ ఫీజు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.50 ఉంటే ఇప్పుడు రూ.65కు చేరింది. చిప్స్ రూ.50 నుంచి రూ.658కి, మార్బుల్ రూ.100 నుంచి 130కి పెంచారు. అలాగే, బ్లాక్ గ్రానైట్ గ్యాంగ్ సైజు రాళ్లకు రూ.3వేల నుంచి రూ.3.900కు, కలర్ గ్రానైట్ గ్యాంగ్ సైజు రాళ్లకు రూ.2,300 నుంచి రూ.2,900కి పెరిగింది. కట్టర్ సైజు రాళ్లకు రూ.2వేల నుంచి రూ.2.800కి పెంచారు. అలాగే, రాయల్టీ 80 శాతం పెరగగా, సీవరేజీ ఫీజులోనూ 80 శాతం మొత్తాన్ని పర్మిట్ ఫీజు పేరుతో వసూలు చేయనున్నారు. అంటే కట్టాల్సిన సీనరేజీ ఫీజుతో పాటు 80 శాతం పర్మిట్ ఫీజు జతచేసి ఖనిజాన్ని గని నుంచి రవాణా చేసుకోవాల్సి వస్తుంది. గృహ రంగంపై ప్రభావం మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రభావం గృహ రంగంపై తీవ్రంగా పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలతో నాలుగు కట్టర్లు ఉన్న పరిశ్రమకు నెలకు రూ.50 వేలు అదనంగా విద్యుత్ బిల్లు వస్తుంది. అంటే మైనింగ్ ఫీజుతో మరో రూ.50 వేల భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు దీనికి అదనం. ఇప్పటివరకు పాలిష్ గ్రానైట్ ధర చదరపు అడుగుకు నాణ్యత ఆధారంగా రూ.100 నుంచి రూ.200 వరకు ఉంది. పెరిగిన ధరలతో ఇది రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇసుకకు పర్మిట్ ఫీజును రాయల్టీపై 40 శాతంగా నిర్ణయించారు. ఇసుక, కంకర తదితర «ధరల భారంతో గృహ నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. కేటీఆర్ భరోసా ఇచ్చారు.. కొత్త మైనింగ్ పాలసీతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్తోంది. ఫీజుల తగ్గింపుతోపాటు మా సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్లీ గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నాం. – వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), రాష్ట్ర గ్రానైట్ క్వారీ యజమానుల సంఘం అధ్యక్షుడు బంద్ కొనసాగిస్తాం పెంచిన ఫీజులతో పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం పునరాలోచన చేసి పరిశ్రమలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. పన్నుల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తాం. – బి.వేణుగోపాల్, అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా క్రషర్స్ అసోసియేషన్ -
గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ హయాంలో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీల నిర్వాహకులు, వ్యాపారులు అక్రమాలకు తెరలేపగా.. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గనులను అడ్డగోలుగా దోచేశారు. క్వారీల నిర్వాహకులు, లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.కోట్లకొద్దీ రాయల్టీని ఎగ్గొట్టారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా అక్రమాలను వెలుగులోకి తీశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 155 క్వారీల్లో అక్రమాలు ఇప్పటివరకు జరిపిన విచారణలో 155 గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. వీటి నిర్వాహకులకు రూ.3,527 కోట్లు జరిమానా విధించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రానైట్ ఫ్యాక్టరీలు, పాలిషింగ్ యూనిట్లపైనా విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వీరినుంచి కూడా జీఎస్టీ, రాయల్టీ రూపంలో మరో రూ.2 వేల కోట్లు జరిమానా విధించేందుకు సన్నద్ధం కాగా.. గ్రానైట్ క్వారీ లీజుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజిలెన్స్ విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై 100 పైగా కేసులు నమోదు చేయించి ఆట కట్టించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడం వెనుక ప్రకాశం జిల్లాలోని భూగర్భ గనుల శాఖ (మైనింగ్) అధికారుల పాత్ర కూడా ఉంది. దాదాపు రాయల్టీ రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగ్గొట్టినట్టు విజిలెన్స్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. అక్రమాలకు చెక్ పెడతాం ఎవరైనా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదు. క్వారీల్లోంచి బయటకు తీసిన ప్రతి రాయి రవాణా చేసేప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి ఏ ఒక్కరైనా గండి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. గ్రానైట్ రవాణాపై ఎప్పటికప్పుడు విజిలెన్స్ నిఘా ఉంటుంది. – కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చదవండి: గోదావరి డెల్టాలకు పోల‘వరం’ -
సంక్షోభం దిశగా కరీంనగర్ గ్రానైట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం దిశగా సాగుతోంది. ఇప్పటికే చైనాకు ఎగుమతులు తగ్గడంతో సగానికిపైగా క్వారీలు మూతపడ్డాయి. 2011 నాటి సీనరేజీ ఫీజు, రూ.749 కోట్ల పెనాల్టీ బకాయిలు తాజాగా కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో రాజకీయ వైరం కూడా ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల 125 మంది క్వారీ యజమానులకు గనుల శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. దీంతో క్వారీల యజమానులు పరిశ్రమను 3 రోజులు మూసే యాలని నిర్ణయించుకున్నారు. శనివారం నుంచి బంద్ మొదలైంది. కరీంనగర్ రూరల్, గంగాధర, హుజురాబాద్, కేశవపట్నం, వీణవంక మండ లాల్లోని క్వారీల్లో శనివారం కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో కూడా క్వారీలను మూసేశారు. గ్రానైట్ కట్టింగ్ యూనిట్లు కూడా మూతపడ్డాయి. ఆదివారం నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా బంద్ పాటించనున్నాయి. రూ.624 పెనాల్టీ 2011లో కరీంనగర్ నుంచి 8 రైల్వే యార్డుల (ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు) ద్వారా గ్రానైట్ బ్లాకులు కాకినాడ పోర్టుకు చేరాయి. సముద్ర మార్గంలో గ్రానైట్‌ను రవాణా చేసే క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి, సీనరేజీ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీనరేజీ ఫీజును రూ.125 కోట్లుగా అప్పట్లో నిర్ణయించారు. దీనిపై 5 రెట్ల అపరాధ రుసుము విధించడంతో రూ.749 కోట్ల మొత్తాన్ని కరీంనగర్ వ్యాపారులు చెల్లించాల్సిందిగా లెక్కగట్టారు. సుమారు 200 క్వారీల నుంచి రవాణా అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు మైనింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడంతోపాటు క్వారీల అనుమతులు నిలిపేశారు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతోపాటు మైనింగ్ చట్టప్రకారం అప్పీలేట్ అధికారికి అప్పీల్ చేయగా, సీనరేజీ ఫీజును 1+5 బదులు 1+1గా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ మేరకు కొందరు క్వారీ యజమానులు చెల్లింపులు చేశారు. అయితే ఈ ప్రక్రియ గనుల శాఖలో ఏళ్ల తరబడి సాగుతుండగా, కోర్టుల సహాయంతో మరికొందరు క్వారీలు నడుపుతున్నారు. వ్యాపారులను వేధిస్తున్న ఎంపీ సంజయ్.. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారం ద్వారా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న వారిని మాఫియాగా చిత్రీకరించి ఎంపీ బండి సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారని కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. బ్లాక్మెయిల్ రాజకీయాలతో పరిశ్రమ మనుగడకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయన చర్యలకు నిరసనగా మూడు రోజుల బంద్ పాటిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు శ్రీధర్, మాజీ అధ్యక్షుడు టి.తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షుడు రంగారావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కార్యదర్శి మహేందర్‌రావు తెలిపారు. నెల రోజుల కింద మళ్లీ తెరపైకి.. సీనరేజీ ఫీజు, పెనాల్టీ బకాయిల అంశాన్ని ఎంపీ బండి సంజయ్ మరోసారి తెరపైకి తెచ్చారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి సీనరేజీ ఫీజు, పెనాల్టీ వసూలు చేయట్లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, కార్యదర్శులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల గవర్నర్ తమిళిసై సుందరరాజన్‌ను కలసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో 2011లో 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా గ్రానైట్ రవాణా చేసిన క్వారీల యజమానులకు గనుల శాఖ నోటీసులు జారీ చేయనుంది. వరంగల్‌లోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
గ్రానైట్ పరిశ్రమకు ఊరట
ఒంగోలు సెంట్రల్: వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన శుక్రవారం న్యూ ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 22వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో గ్రానైట్ పరిశ్రమపై విధించిన 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారు. ఇది జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులకు కొంత ఊరటనిచ్చింది. ఏసీ రెస్టారెంట్లపై 18శాతనికి బదులుగా 12 శాతం పన్ను వసూలు చేస్తారు. గ్యాస్ స్టవ్‌లు, వినియోగదారులు వస్తువులను 28 శాతం పన్ను పరిధి నుంచి తొలగించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. వస్త్రాలపై ఉన్న 12 శాతాన్ని 5 శాతానికి తగ్గించారు. స్కూలు స్టేషనరీ, రబ్బర్ బ్యాండ్స్, మామిడి పండ్ల రసం, పాపడాలు తదితర వస్తువలను 12 శాతం నుంచి 5 శాతం స్లాబ్‌కు మార్చారు. అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహార పదార్ధాల ప్యాకెట్లపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. చిన్న వ్యాపారులకు ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని సులభతరం చేయాలని కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ప్రతి నెలా రిటర్నులు ఫైల్ చేయాల్సిన విధానాన్ని మూడు నెలలక ఒక సారిగా మార్పు చేయాలని కూడా చర్చించిన్నట్లు సమాచారం. -
‘గ్రానైట్’పై జీఎస్టీ పిడుగు
– జీఎస్టీతో 28 శాతం పన్ను విధింపు – మూతపడే ప్రమాదంలో పరిశ్రమలు – ఆందోళనకు సిద్ధమవుతున్న యజమానులు హిందూపురం రూరల్ : గ్రానైట్ పరిశ్రమలపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) పిడుగు పడింది. ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేసే సరుకుపై 28 శాతం పన్ను విధించనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీతో భారీ స్థాయిలో పన్ను పడుతుండటంతో పలు గ్రానైట్ పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పరిశ్రమ యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులను గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ సభ్యులు కోరారు. చైనా ఉత్పత్తులతో దేశీయ గ్రానైట్ పరిశ్రమల ఉత్పత్తులు అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. వస్తు సేవా పన్నులో 28 శాతం గ్రానైట్ ఉత్పత్తులపై విధించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. పరిశ్రమలు నెలకొల్పడానికి బ్యాంకుల్లో తీసుకున్న రుణాల నెలవారి కంతులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి ముడి సరుకు (రాయి)పై రూ.2,600 రాయల్టీని చెల్లిస్తున్నాం. గ్రానైట్ పరిశ్రమల్లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ పన్ను తోడైతే పరిశ్రమలు మూతపడే అవకాశం లేకపోలేదు. జిల్లాలోని తాడిపత్రిలో కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలు సుమారు 450 ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో 14 పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 14 నుంచి 15 మంది ప్రత్యక్షంగా, 8 నుంచి 10 మంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గ్రానైట్ పరిశ్రమ నుంచి జీఎస్టీ నామమాత్రంగా వసూలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంది. శ్లాబ్ పద్ధతిలో రాయితీలు ఇవ్వాలి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు శ్లాబ్ పద్ధతిలో రాయల్టీ పన్నులు విధించి ఆదుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగిస్తే పరిశ్రమలు మనుగడ సాగిస్తాయి. లేనిపక్షంలో కార్మికులు వీధినపడే అవకాశం ఉంది. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపుపై బలంగా వాదనలు వినిపించి పన్ను శాతం 28 నుంచి 5 శాతానికి తగ్గించి పరిశ్రమలను ఆదుకోవాలి. - మల్లేశ్వరరెడ్డి, గ్రానైట్ పరిశ్రమ యజమాని, తాడిపత్రి -
గ్రానైట్ పరిశ్రమ జీఎస్టీ స్లాబ్‌పై పునరాలోచించండి
కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీని కోరిన సురవరం సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్నుల స్లాబ్‌లో చేర్చడంపై పునరాలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. అన్ని రకాల గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్ను పరిధిలో చేర్చడం వల్ల 32 శాతం పన్ను పరిధిలో ఉన్న పెద్ద తరహా పరిశ్రమలు నాలుగు శాతం పన్ను తగ్గి 28 శాతం స్లాబ్‌లోకి వస్తాయన్నారు. ప్రస్తుతం రెండు శాతం సీఎస్టీ, రాష్ట్రంలో 14.5 శాతం వ్యాట్ చెల్లిస్తున్న చిన్న తరహా గ్రానైట్ వ్యాపారులు కూడా 28 శాతం స్లాబ్‌లోకి వస్తారని, దీని వల్ల చిన్న తరహా పరిశ్రమల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని బుధవారం అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. స్లాబ్‌ల తగ్గింపునకు తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు సుధాకర్‌రెడ్డిని, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గసభ్యుడు నారాయణను బుధవారం ఢిల్లీలో కలుసుకొని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు సురవరం కేంద్రమంత్రికి లేఖ రాశారు. సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను 5 శాతం స్లాబ్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్‌పై జూన్ 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సురవరం, నారాయణను కలిసినవారిలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.శంకర్, కోశాధికారి పి.యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
వినూత్న నిరసన!
టెక్కలి : గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం పెంచిన సీనరేజ్ ధరల తగ్గించాలంటూ యజమానులు, కార్మికులు చేపట్టిన ఆందోళన శనివారం కొత్త పుంతలు తొక్కింది. ఓ వైపు శాంతియుత ఉద్యమం చేస్తూనే ఉధృతం చేయాలని కొందరు చేసిన సూచనల నేపథ్యంలో యజమానుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...సీనరేజ్ తగ్గించాలంటూ టెక్కలి మైన్ కార్యాలయం ఎదుట ఉత్తరాంధ్ర గ్రానైట్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కోత మురళీధర్, శ్రీనివాస్, రామకృష్ణతో పాటు కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపేందుకు పాత జాతీయ రహదారిపై వాహనాలను తుడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అంతా రోడ్డుపైకి వచ్చి ఓ బస్సును ఆపి తుడిచేందుకు సిద్ధం కాగా అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతితో పాటు కొందరు కార్మికులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపేందుకు యత్నించారు. దీంతో నిరసన ఉధృత రూపం దాల్చింది. పెంచిన సీనరేజ్ ధరలు తక్షణమే తగ్గించాలని, ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని చింతాడ గణపతితో పాటు పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తే మన సమస్యలు పరిష్కారం కావని తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయాలని గణపతి పట్టుబట్టారు. కార్మికులంతా రోడ్డున పడి ఇబ్బందులు పడుతుంటే కార్మిక మంత్రి కనీసం స్పందించకపోవడం ఆయన చేతకానితనమని గణపతి మండిపడ్డారు. శాంతియుత నిరసనలో ఎటువంటి ఉద్రిక్తతకు అవకాశం ఇవ్వొద్దంటూ కొందరు అడ్డుతగిలారు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ సమయంలో గణపతి, మరో ప్రతినిధి నగేష్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తోటి సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. మిగిలిన ప్రతినిధులు వారికి సర్దిచెప్పి దీక్షా శిబిరంలోకి తీసుకువెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం అధ్యక్షుడు కోత మురళీధర్ మాట్లాడుతూ గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులంతా శాంతియుతంగా పోరాటం చేయాలని సూచించారు. -
కార్మిక సమస్యలు మంత్రికి పట్టవా!
► అసోసియేషన్ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ►డీఎంఎఫ్‌ను రద్దు చేయాలంటూ బైక్ ర్యాలీ ►ఐదో రోజుకు చేరుకున్న దీక్షలు టెక్కలి : వెనుక బడిన జిల్లాకు తగిన గుర్తింపు తీసుకువచ్చిన గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం అదనపు చార్జీలు విధించి ఆయా పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులంతా రోడ్డున పడుతుంటే కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా నష్టపోయే విధంగా ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ 100, 36లను రద్దు చేసి అదనపు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టెక్కలి మైన్స కార్యాలయం వద్ద గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు, కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నారుు. దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై అదనపు చార్జీల విధించడం సమంజసం కాదన్నారు. ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకోకుండా వాటిపై అధిక చార్జీలు విధించి పరిశ్రమలు మూతపడే విధంగా కుట్రలు చేయడం దారుణమన్నారు. కొద్ది రోజులుగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు సీఎంతో సహా సంబంధిత మంత్రుల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతుంటే జిల్లాకు చెందిన కార్మిక మంత్రి కనీసం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. గ్రానైట్ యజమానులు, కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను తమ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని రెడ్డి శాంతి భరోసా ఇచ్చారు. తిలక్ మాట్లాడుతూ పరిశ్రమలు మూతపడే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి చెందిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతి మాట్లాడుతూ పరిశ్రమలను బతికించుకోవాలంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలన్నారు. అంతకు ముందు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కోత మురళీధర్, ప్రతినిధులు శ్రీనివాస్, రామకృష్ణ, సి.హెచ్.రావ్, వెంకటాచలపతి, పార్థు తదితరుల ఆధ్వర్యంలో కార్మికులంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎంఎఫ్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని నినదించారు. -
‘అలయన్స’లో ముదురుతున్న వివాదం
► లాకౌట్‌కు చేస్తారంటున్న కార్మికులు ► కార్మికులను సంఖ్యను ► తగ్గిస్తున్నామంటున్న యాజమాన్యం ► కేసుల భయంతో పోలీసులకు ► కార్మికుల ముందస్తు ఫిర్యాదు కారూరు(తడ): కారూరు పంచాయతీ పరిధిలో ఉన్న అలయన్స్ మినరల్స్ గ్రానైట్ పరిశ్రమలో కార్మికులు, మేనేజ్మెంట్ మధ్యన నెలకొన్న వివాదం ముదురుతోంది. వివరాల్లోకి వెళితే.. చెక్‌పోస్టు సమీపంలో ఉన్న అలయన్స్ పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పదేళ్లకుపైగా పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 2 నెలల క్రితం కార్మికులు ఇంక్రిమెంట్లపై పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. గత ఏడాది ఇంక్రిమెంట్ వేయనందున ఈ ఏడాది రూ.2వేలు వేయాలని కోరారు. చివరకు రూ.1400 ఇచ్చేందుకు మేనేజ్మెంట్ అంగీకరించింది. కాగా ఈ నెల 16న కంపెనీని లాకౌట్ చేస్తున్నట్లుగా మేనేజ్మెంట్ తమకు నోటిమాటగా చెప్పిందని ఎంతో కాలంగా కంపెనీని నమ్ముకుని ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అలయన్స్‌కి అనుబంధంగా ఉన్న మెర్క్యురీ గ్రానైట్ పరిశ్రమను మూసివేసే సమయంలోనూ కార్మికులకు అన్యాయం చేశారని కార్మికులు గుర్తుచేస్తున్నారు. పరిశ్రమ మూతవేసే సమయంలో అందులోని కార్మికుల్లో సగం మందికి తిరిగి ఉపాధి కల్పిస్తామని చెప్పి కేవలం ఐదుగురికే ఉద్యోగాలు ఇచ్చారని చెబుతున్నారు. తొలగించే కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం అందించాలని కోరుతున్నారు. పోలీసులకు కార్మికుల ఫిర్యాదు మేనేజ్మెంట్ చర్చల సమయంలో గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించవచ్చునని భయంతో కార్మికులు శనివారం పోలీసులకు ముందస్తు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చి కార్మికులపై తప్పుడు కేసులు బనాయిస్తే ఆమోదించవద్దని కోరారు. యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ మేనేజ్మెంట్ పెద్దల స్వార్థంతో కంపెనీ సంక్షోభంలో చిక్కుకుందని, ఇందుకు కార్మికులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కార్మికులకు నాయకత్వం వహిస్తున్న సీనియర్ కార్మికుడు శివాజీ వాపోయారు. రెండు రోజులుగా కార్మికుల పరిహారం విషయమై మేనేజ్మెంట్తో చర్చిస్తున్నా ఎటువంటి ఫలితం కనబడడంలేదని తెలిపారు. తొలుత సెటిల్మెంట్కి ఒప్పుకోని మేనేజ్మెంట్ ఇప్పుడు ఆమోదిస్తామని చెబుతోందన్నారు. చర్చలకు వెళ్లి ఏదైనా గట్టిగా మాట్లాడితే లేనిపోని కేసులు పెడతారనే భయంతోనే ముందస్తు ఫిర్యాదు చేస్తునట్టు తెలిపారు. అధికారులు జో క్యం చేసుకని సమస్యను సామరస్యంగా పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. లాకౌట్ నోటీసులు జారీ చేయలేదు లాకౌట్‌కు సంబంధించి ఎటువంటి నోటీసు జారీ చేయలేదు. అవసరానికి మించి ఉన్న కార్మికులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎవర్ని తొలగించాలనేది ఇంకా నిర్ధారించలేదు. కార్మికులకు చట్టపరంగా న్యాయం చేస్తాం. పెద్దల సమక్షంలో పరిహారం అందజేస్తాం. - కృష్ణమూర్తి, హెచ్ఆర్, అలయన్స కంపెనీ -
'ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం'
విజయవాడ (లబ్బీపేట): రాష్ట్రంలో గ్రానైట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ ఇండస్ట్రీ(ఎఫ్ఏపీజీఐ) చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన గ్రానైట్ ఇండస్ట్రీస్, క్లస్టర్స్ యజమానుల సమావేశం ఆదివారం విజయవాడలోని హోటల్ గేట్‌వేలో జరిగింది. ఈ సమావేశంలో 13 జిల్లాలతో కూడిన నూతన ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీని ఏర్పాటుచేశారు. ఫెడరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి లక్షలాదిమంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. తమ ఇండస్ట్రీకి ప్రభుత్వపరంగా ఏం చేయాలి, ప్రభుత్వానికి తామేమి చేయాలనే దానిపై ఫెడరేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సుమారు 200 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఫెడరేషన్ కార్యవర్గం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వరరావు(ప్రకాశం), వైస్ చైర్మన్లుగా కోట మురళీధర్(శ్రీకాకుళం) అంగర రాజేష్(విశాఖపట్నం), మారం వెంకరెడ్డి(ప్రకాశం), ఆర్.లక్ష్మీనారాయణ (ప్రకాశం), కె.వి.శ్రీనివాస్(చిత్తూరు), బి.సుశీల్‌కుమార్(అనంతపురం) ఎంపికయ్యారు. జనరల్ సెక్రటరీగా డాక్టర్ సీహెచ్.రావు(శ్రీకాకుళం), జాయింట్ సెక్రటరీలుగా కె.ఎం.హరికుమార్(శ్రీకాకుళం), సి.శ్రీనివాసరావు(విశాఖపట్నం), ఎన్.వి.రెడ్డి(ప్రకాశం), జి.మధు(అనంతపురం), బొడ్డు సుబ్బారావు(ప్రకాశం), తిరుపతిరెడ్డి, ఎం.ఎ.అజీమ్(ఒంగోలు), అల్లు నగేష్(శ్రీకాకుళం) నియమితులు కాగా, కోశాధికారిగా వై.శివప్రసాద్(విజయవాడ)ను నియమించారు. చీఫ్ పాట్రన్‌గా ఆర్.వీరమణి, హానరరీ చైర్మన్‌గా డాక్టర్ కె.సుబ్బారెడ్డిలను నియమించారు. వీరితో పాటు మరో 25 మందిని అడ్వయిజరీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. -
త్వరలో ఈపీఎఫ్ ఆఫీస్
ఖమ్మం: ‘సింగరేణి, గ్రానైట్ పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగంలో జిల్లాలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి సేవలందించేందుకు ఇక్కడ ఈపీఎఫ్ కార్యాలయం లేకపోవడం శోచనీయం. ఖమ్మంలో ఈపీఎఫ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను’ అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహా సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని టేకులపల్లి, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుతీరును తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఈపీఎఫ్ కార్యాలయ ఏర్పాటుకు సర్వే చేయించేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం జన్‌ధన్ యోజన, పేదలకు పెన్షన్ కోసం బీమా పథకం, మహిళా సంక్షేమం కోసం బేటీ బచావో.. బేటీ బడావో, స్వచ్ఛభారత్, ఆదర్శ గ్రామాలు, స్మార్ట్ సిటీలు, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా తదితర పథకాలను ప్రవేవపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఏడాది కాలంలో మోదీ దేశ ప్రజలకు దగ్గరయ్యారన్నారు. జిల్లాలో ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునేందుకు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయూలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ రావడమే ఆలస్యమన్నారు. సింగరేణిలో ఇప్పుడున్న గనులు కాకుండా అవకాశం ఉన్న ప్రతి చోటా గనులు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగాలి.. జిల్లాలో బలమైన రాజకీయశక్తిగా బీజేపీ ఎదగాలని దత్తాత్రేయ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఏడాది కాలంలో ప్రధాని మోదీ 48 దేశాలు తిరిగి దేశ ఔన్నత్యాన్ని చాటారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ధర్మారావు పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల సహాయ సహకారాలను కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి ప్రత్యేకతను తీసుకువచ్చారని చెప్పారు. జిల్లాలో భారతీయ జనతాపార్టీకి ఆదరణ లభిస్తోందని, అన్ని ప్రాంతాల నుంచి పార్టీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్‌రావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంగల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యుడు పొదిలి రాజలింగేశ్వరరావు, మారుతి వీరభద్రప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గల్లా సత్యనారాయణ, కార్యదర్శులు ఉపేందర్, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధన్, వెంకన్న, నాయకులు లలిత, హేమమాలిని, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, ఉదయప్రతాప్ పాల్గొన్నారు. -
కొంప ముంచుతున్న రాజస్థాన్ గ్రానైట్
⇒ ఆర్థిక సంక్షోభంలో గ్రానైట్ పరిశ్రమ ⇒ ముడి ఖనిజం దిగుమతికి తడిసి మోపెడు ⇒ నిర్వహణ భారంతో 50 పరిశ్రమలు మూత ⇒ అమ్ముడుపోని సరుకు.. యజమానులు అప్పులపాలు ⇒ కార్మికులు వలస బాట తాడిపత్రి : ఒకప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పరిశ్రమలు నడపలేని పరిస్థితి నెలకొంది. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ముడి సరుకు ధరలకు అనుగుణంగా ఉత్పత్తి చేసిన గ్రానైట్‌కు ధర లభించకపోవడంతో పరిశ్రమలు మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముడి సరుకు తెప్పించుకోవడం భారంగా మారడంతో ఆరు నెలల వ్యవధిలో ఏకంగా 50కి పైగా పరిశ్రమలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించింది. 212 పరిశ్రమల యజమానులు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జిల్లాలోనే పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ గనులు, ముడి సరుకు లేకున్నా నీరు, రవాణా తదితర సౌకర్యాలు ఉండడంతో సుమారు 300 గ్రానైట్ పరిశ్రమలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యేగానైట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రవాణా అవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. కొంప ముంచుతున్న రాజస్థాన్ గ్రానైట్ రాజస్థాన్ రాష్ట్రంలోని జాలురు ప్రాంతంలో కలర్ గ్రానైట్ ఇక్కడి కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. ఒక అడుగు రూ.50కే లభించడం వల్ల ఇతర రాష్ట్రాలకు కూడా అక్కడి నుంచే సరఫరా అవుతోంది. దీనికి తోడు నిర్మాణ రంగంలో అత్యధిక బరువు ఉన్న గ్రానైట్‌ను కాకుండా వివిధ రకాలైన, ఆకర్షణీయమైన టైల్స్ వాడడం వల్ల గ్రానైట్‌కు డిమాండ్ తగ్గింది. దీనికి తోడు ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రానైట్ ధరకు రాజస్థాన్ నుంచి సరఫరా అయ్యే ధరకు చాలా వ్యత్యాసం ఉండటంతో ఇక్కడ ఉత్పత్తిపై వ్యాపారులు అసక్తి చూపడం లేదు. పైగా నిర్మాణ రంగం కూడా రెండు సంవత్సరాలుగా అనుకున్న రీతిలో సాగడం లేదు. గ్రానైట్ ముడి సరకు దిగుమతి ధరలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమ కుదేలవుతోంది. పరిశ్రమల్లో ఆగిపోయిన సరుకు దాదాపు ఏడాదిగా గ్రానైట్ ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో ప్రతి పరిశ్రమలో పాలిష్ చేసిన గ్రానైట్ ఉత్పత్తులు ఎగుమతి కాకుండా ఆగిపోయాయి. మొత్తం పరిశ్రమల్లో రూ.5 కోట్ల వరకు ఉత్పత్తి ఆగిపోయిందని తెలుస్తోంది. నష్టాలు రావడంతో ప్రస్తుతం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే పరిశ్రమలను నడిపిస్తున్నారు. గతంలో 24 గంటలు పనిచేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో చాలా పరిశ్రమలను మూసి వేశారు. సొంతంగా నడిపించుకోలేక లీజుకు ఇస్తామని కొన్నింటి వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిలో చాలా మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్లలేని వారు ఇక్కడే మరో పని చూసుకుంటున్నారు. రాయల్టీ విధానంలో మార్పు తెస్తే ఊరట ప్రస్తుతం ప్రభుత్వం గ్రానైట్ ముడిసరుకుపై విధిస్తున్న రాయల్టీ విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్లాబ్ విధానంలో ఒక మీటర్‌కు సాధారణ గ్రానైట్ (బ్లాక్)కు రూ.1950, కలర్ గ్రానైట్‌కు రూ.1650 రాయల్టీ వసులు చేస్తున్నారు. కానీ స్లాబ్ పద్ధతిన ఇతర రాష్ట్రాల్లో యంత్రానికి రాయల్టీ వసులు చేస్తున్నారు. రాయాల్టీ విధానంలో కూడా మార్పులు తెస్తే కొంత ఊరట లభించనుంది. -
గ్రానైట్‌కు గడ్డుకాలం
ఖమ్మం రూరల్: జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. నిర్వహణ ఖర్చులు పెరగడం, విద్యుత్ కోతలు ఉండడం, రామెటీరియల్ ధరలు పెరగడం, సబ్సిడీలు వర్తించకపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తోంది. రెండేళ్లుగా నెలకొన్న ఈ పరిస్థితులు దృష్ట్యా ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. ఇప్పటికే సుమారు 100 ఫ్యాక్టరీలు లాగవుట్ అయ్యాయి. ఈ పరిణామాలతో యజమానులే కాకుండా కార్మికులు, ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వారు రోడ్డున పడుతున్నారు. తామింత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నా పాలకులకేమీ పట్టడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ధర పెరిగి.. జిల్లాలో సుమారు 600 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 1.50 లక్షల మంది మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. గ్రానైట్ ముడిసరుకు (రాయి) ధర విపరీతంగా పెరిగింది. గత ఏడాది క్రితం వరకు క్యూబిక్ మీటరు రాయి రూ.18 వేలకే దొరికేదని, ఇప్పుడు రూ.25 వేలు పలుకుతోందని యజమానులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా క్వారీ తవ్వకాలపై ఆంక్షలు విధించడం వల్ల రాయి కొరత ఏర్పడి ధర పెరిగిందని తెలిపారు. విద్యుత్ వెతలు ఒకవైపు ఎడాపెడా విద్యుత్ కోత, మరోవైపు పెరిగిన విద్యుత్ చార్జీలు గ్రానైట్ పరిశ్రమల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి. రెండేళ్ల క్రితం ఒక ఫ్యాక్టరీకి నెలసరి విద్యుత్ బిల్లు సగటున రూ.లక్ష వచ్చేదని, ప్రస్తుతం రూ.2.50లక్షలు వస్తోందని యజమానులు తెలిపారు. దీనికి తోడు సర్‌చార్జీల పేరుతో అదనంగా వేలాది రూపాయలు బిల్లులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నడిచినా నడవకపోయినా నెలకు విద్యుత్ బిల్లు మాత్రం రూ.60వేలు తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది క్రితం యూనిట్‌కు రూ.5.70 పైసలు ఉన్న ధర, ఇప్పుడు రూ.6.20 పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఒక కేవీ విద్యుత్ వాడుకుంటే గత ఏడాది రూ.2.50 వసూలు చేసిన విద్యుత్ శాఖ ఇప్పుడు రూ.3.50 తీసుకుంటోందని అంటున్నారు. దీంతో ఫ్యాక్టరీల నిర్వహణ కష్టంగా మారిందంటున్నారు. వర్తించని సబ్సిడీలు చిన్నతరహా పరిశ్రమలకు 2004-2009 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం సబ్సిడీలు, పావలా వడ్డీ రుణాలు, క్యాపిటల్ ఫీజు ఇచ్చేది. ఆ తర్వాత సబ్సిడీ నయాపైసా కూడా ఇవ్వడం లేదని యజమానులు అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీలు వెంట వెంటనే వచ్చేవని, ప్రస్తుతం చిన్నతరహా పరిశ్రమలను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోతున్న ఇతర రాష్ట్రాల కార్మికులు ఇక్కడి ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి మూతపడుతుండడంతో ఇతర రాష్ట్రాల కార్మికులు పని దొరకక తిరిగి స్వస్థలాలకు వెళ్తున్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు చక్కబడి ఫ్యాక్టరీలు నిడిపించాలన్నా మానవ వనరులు లేక కష్టమేనని యజమానులు అంటున్నారు.