త్వరలో ఈపీఎఫ్ ఆఫీస్
ఖమ్మం: ‘సింగరేణి, గ్రానైట్ పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగంలో జిల్లాలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి సేవలందించేందుకు ఇక్కడ ఈపీఎఫ్ కార్యాలయం లేకపోవడం శోచనీయం. ఖమ్మంలో ఈపీఎఫ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను’ అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహా సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని టేకులపల్లి, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుతీరును తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మంలో ఈపీఎఫ్ కార్యాలయ ఏర్పాటుకు సర్వే చేయించేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం జన్‌ధన్ యోజన, పేదలకు పెన్షన్ కోసం బీమా పథకం, మహిళా సంక్షేమం కోసం బేటీ బచావో.. బేటీ బడావో, స్వచ్ఛభారత్, ఆదర్శ గ్రామాలు, స్మార్ట్ సిటీలు, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా తదితర పథకాలను ప్రవేవపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఏడాది కాలంలో మోదీ దేశ ప్రజలకు దగ్గరయ్యారన్నారు.
జిల్లాలో ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునేందుకు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయూలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ రావడమే ఆలస్యమన్నారు. సింగరేణిలో ఇప్పుడున్న గనులు కాకుండా అవకాశం ఉన్న ప్రతి చోటా గనులు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జిల్లాలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగాలి..
జిల్లాలో బలమైన రాజకీయశక్తిగా బీజేపీ ఎదగాలని దత్తాత్రేయ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఏడాది కాలంలో ప్రధాని మోదీ 48 దేశాలు తిరిగి దేశ ఔన్నత్యాన్ని చాటారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ధర్మారావు పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల సహాయ సహకారాలను కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి ప్రత్యేకతను తీసుకువచ్చారని చెప్పారు. జిల్లాలో భారతీయ జనతాపార్టీకి ఆదరణ లభిస్తోందని, అన్ని ప్రాంతాల నుంచి పార్టీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్‌రావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంగల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యుడు పొదిలి రాజలింగేశ్వరరావు, మారుతి వీరభద్రప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గల్లా సత్యనారాయణ, కార్యదర్శులు ఉపేందర్, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధన్, వెంకన్న, నాయకులు లలిత, హేమమాలిని, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, ఉదయప్రతాప్ పాల్గొన్నారు.