గ్రానైట్ పరిశ్రమ జీఎస్టీ స్లాబ్‌పై పునరాలోచించండి
కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీని కోరిన సురవరం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్నుల స్లాబ్‌లో చేర్చడంపై పునరాలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. అన్ని రకాల గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్ను పరిధిలో చేర్చడం వల్ల 32 శాతం పన్ను పరిధిలో ఉన్న పెద్ద తరహా పరిశ్రమలు నాలుగు శాతం పన్ను తగ్గి 28 శాతం స్లాబ్‌లోకి వస్తాయన్నారు. ప్రస్తుతం రెండు శాతం సీఎస్టీ, రాష్ట్రంలో 14.5 శాతం వ్యాట్ చెల్లిస్తున్న చిన్న తరహా గ్రానైట్ వ్యాపారులు కూడా 28 శాతం స్లాబ్‌లోకి వస్తారని, దీని వల్ల చిన్న తరహా పరిశ్రమల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని బుధవారం అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
స్లాబ్‌ల తగ్గింపునకు తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు సుధాకర్‌రెడ్డిని, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గసభ్యుడు నారాయణను బుధవారం ఢిల్లీలో కలుసుకొని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు సురవరం కేంద్రమంత్రికి లేఖ రాశారు. సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను 5 శాతం స్లాబ్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్‌పై జూన్ 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సురవరం, నారాయణను కలిసినవారిలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.శంకర్, కోశాధికారి పి.యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.