సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్న గ్రానైట్ పరిశ్రమపై మరో దెబ్బ. ఇటీవల పెంచిన ఫీజులు ఆ పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా 112 శాతం ఫీజులు పెంచడంతో పరిశ్రమ కుదేలవుతుందని యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సతమతమవుతుంటే ఈనెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన మైనింగ్ పాలసీతో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమకు గడ్డుకాలం వచ్చింది. దీంతో గ్రానైట్ రంగంలో చిన్న తరహా పరిశ్రమగా ఉన్న కంకర క్వారీలు, మిల్లులను యాజమాన్యాలు రెండు రోజులుగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన ఫీజులను తగ్గించాలని ఆందోళనబాట పట్టాయి.
దిక్కుతోచని స్థితిలో...
నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి మైనింగ్‌శాఖ ఫీజులు పెంచుతుంది. ఇది కూడా కొంతమేర పెరగడంతో పరిశ్రమపై అంతగా భారం పడలేదు. కానీ 2015 తర్వాత ఒక్కసారిగా ఆరేళ్లకుగాను 112 శాతం ఫీజులను పెంచుతూ ప్రభుత్వం 17 జీఓలను విడుదల చేసింది. దీనికితోడు ఇదే నెలలో విద్యుత్ చార్జీలు కూడా పెంచడం, గత నెల రోజుల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల నిర్వహణ, రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్రంలో 500 గ్రానైట్ క్వారీలు, సుమారు 1,200 గ్రానైట్ పరిశ్రమలు, 750 కంకర మిల్లులు, 2,549 కంకర క్వారీలు ఉన్నాయి.
ఏ సెక్టార్‌నూ వదల్లేదు..
గ్రానైట్ రంగంలో ఏ సెక్టార్‌నూ వదలకుం డా విపరీతంగా ఫీజులు పెంచారు. ఇప్పటి వరకు ఉన్న డెడ్ రెంట్ (ఏటా చెల్లించే రుసుం), సీనరేజీ, దరఖాస్తు రుసుం, లీజు బదిలీ, లీజు పునరుద్ధరణ (రెన్యువల్) ఫీజులు, రిఫండబుల్, నాన్ రిఫండబుల్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. ఒక హెక్టార్ క్వారీకి ప్రస్తుతం వార్షిక డెడ్‌రెంట్æ రూ.లక్ష ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెరిగింది.
కలర్ గ్రానైట్ క్వారీ డెడ్‌రెంట్ రూ.80 వేల నుంచి 1.60 లక్షలైంది. మార్బుల్, భవన నిర్మాణ రాళ్లు, రహదారి కంకర, మాన్యుఫాక్చర్డ్ ఇసుకకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. రోడ్డు మెటల్ సీనరేజీ ఫీజు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.50 ఉంటే ఇప్పుడు రూ.65కు చేరింది. చిప్స్ రూ.50 నుంచి రూ.658కి, మార్బుల్ రూ.100 నుంచి 130కి పెంచారు.
అలాగే, బ్లాక్ గ్రానైట్ గ్యాంగ్ సైజు రాళ్లకు రూ.3వేల నుంచి రూ.3.900కు, కలర్ గ్రానైట్ గ్యాంగ్ సైజు రాళ్లకు రూ.2,300 నుంచి రూ.2,900కి పెరిగింది. కట్టర్ సైజు రాళ్లకు రూ.2వేల నుంచి రూ.2.800కి పెంచారు. అలాగే, రాయల్టీ 80 శాతం పెరగగా, సీవరేజీ ఫీజులోనూ 80 శాతం మొత్తాన్ని పర్మిట్ ఫీజు పేరుతో వసూలు చేయనున్నారు. అంటే కట్టాల్సిన సీనరేజీ ఫీజుతో పాటు 80 శాతం పర్మిట్ ఫీజు జతచేసి ఖనిజాన్ని గని నుంచి రవాణా చేసుకోవాల్సి వస్తుంది.
గృహ రంగంపై ప్రభావం
మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రభావం గృహ రంగంపై తీవ్రంగా పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలతో నాలుగు కట్టర్లు ఉన్న పరిశ్రమకు నెలకు రూ.50 వేలు అదనంగా విద్యుత్ బిల్లు వస్తుంది. అంటే మైనింగ్ ఫీజుతో మరో రూ.50 వేల భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు దీనికి అదనం. ఇప్పటివరకు పాలిష్ గ్రానైట్ ధర చదరపు అడుగుకు నాణ్యత ఆధారంగా రూ.100 నుంచి రూ.200 వరకు ఉంది. పెరిగిన ధరలతో ఇది రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇసుకకు పర్మిట్ ఫీజును రాయల్టీపై 40 శాతంగా నిర్ణయించారు. ఇసుక, కంకర తదితర «ధరల భారంతో గృహ నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది.
కేటీఆర్ భరోసా ఇచ్చారు..
కొత్త మైనింగ్ పాలసీతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్తోంది. ఫీజుల తగ్గింపుతోపాటు మా సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్లీ గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నాం.
– వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), రాష్ట్ర గ్రానైట్ క్వారీ యజమానుల సంఘం అధ్యక్షుడు
బంద్ కొనసాగిస్తాం
పెంచిన ఫీజులతో పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం పునరాలోచన చేసి పరిశ్రమలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. పన్నుల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తాం.
– బి.వేణుగోపాల్, అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా క్రషర్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment