కార్మిక సమస్యలు మంత్రికి పట్టవా!
► అసోసియేషన్ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
►డీఎంఎఫ్‌ను రద్దు చేయాలంటూ బైక్ ర్యాలీ
►ఐదో రోజుకు చేరుకున్న దీక్షలు
టెక్కలి : వెనుక బడిన జిల్లాకు తగిన గుర్తింపు తీసుకువచ్చిన గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం అదనపు చార్జీలు విధించి ఆయా పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులంతా రోడ్డున పడుతుంటే కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా నష్టపోయే విధంగా ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ 100, 36లను రద్దు చేసి అదనపు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టెక్కలి మైన్‌స కార్యాలయం వద్ద గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు, కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నారుు. దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై అదనపు చార్జీల విధించడం సమంజసం కాదన్నారు.
ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకోకుండా వాటిపై అధిక చార్జీలు విధించి పరిశ్రమలు మూతపడే విధంగా కుట్రలు చేయడం దారుణమన్నారు. కొద్ది రోజులుగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు సీఎంతో సహా సంబంధిత మంత్రుల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతుంటే జిల్లాకు చెందిన కార్మిక మంత్రి కనీసం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. గ్రానైట్ యజమానులు, కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను తమ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని రెడ్డి శాంతి భరోసా ఇచ్చారు. తిలక్ మాట్లాడుతూ పరిశ్రమలు మూతపడే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి చెందిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతి మాట్లాడుతూ పరిశ్రమలను బతికించుకోవాలంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలన్నారు.
అంతకు ముందు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కోత మురళీధర్, ప్రతినిధులు శ్రీనివాస్, రామకృష్ణ, సి.హెచ్.రావ్, వెంకటాచలపతి, పార్థు తదితరుల ఆధ్వర్యంలో కార్మికులంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎంఎఫ్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని నినదించారు.