‘అలయన్‌స’లో ముదురుతున్న వివాదం
► లాకౌట్‌కు చేస్తారంటున్న కార్మికులు
► కార్మికులను సంఖ్యను
► తగ్గిస్తున్నామంటున్న యాజమాన్యం
► కేసుల భయంతో పోలీసులకు
► కార్మికుల ముందస్తు ఫిర్యాదు
కారూరు(తడ): కారూరు పంచాయతీ పరిధిలో ఉన్న అలయన్స్ మినరల్స్ గ్రానైట్ పరిశ్రమలో కార్మికులు, మేనేజ్‌మెంట్ మధ్యన నెలకొన్న వివాదం ముదురుతోంది. వివరాల్లోకి వెళితే.. చెక్‌పోస్టు సమీపంలో ఉన్న అలయన్స్ పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పదేళ్లకుపైగా పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 2 నెలల క్రితం కార్మికులు ఇంక్రిమెంట్లపై పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. గత ఏడాది ఇంక్రిమెంట్ వేయనందున ఈ ఏడాది రూ.2వేలు వేయాలని కోరారు. చివరకు రూ.1400 ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్ అంగీకరించింది. కాగా ఈ నెల 16న కంపెనీని లాకౌట్ చేస్తున్నట్లుగా మేనేజ్‌మెంట్ తమకు నోటిమాటగా చెప్పిందని ఎంతో కాలంగా కంపెనీని నమ్ముకుని ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం అలయన్స్‌కి అనుబంధంగా ఉన్న మెర్క్యురీ గ్రానైట్ పరిశ్రమను మూసివేసే సమయంలోనూ కార్మికులకు అన్యాయం చేశారని కార్మికులు గుర్తుచేస్తున్నారు. పరిశ్రమ మూతవేసే సమయంలో అందులోని కార్మికుల్లో సగం మందికి తిరిగి ఉపాధి కల్పిస్తామని చెప్పి కేవలం ఐదుగురికే ఉద్యోగాలు ఇచ్చారని చెబుతున్నారు. తొలగించే కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం అందించాలని కోరుతున్నారు.
పోలీసులకు కార్మికుల ఫిర్యాదు
మేనేజ్‌మెంట్ చర్చల సమయంలో గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించవచ్చునని భయంతో కార్మికులు శనివారం పోలీసులకు ముందస్తు ఫిర్యాదు చేశారు. మేనేజ్‌మెంట్ ఒత్తిడి తెచ్చి కార్మికులపై తప్పుడు కేసులు బనాయిస్తే ఆమోదించవద్దని కోరారు. యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ మేనేజ్‌మెంట్ పెద్దల స్వార్థంతో కంపెనీ సంక్షోభంలో చిక్కుకుందని, ఇందుకు కార్మికులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కార్మికులకు నాయకత్వం వహిస్తున్న సీనియర్ కార్మికుడు శివాజీ వాపోయారు. రెండు రోజులుగా కార్మికుల పరిహారం విషయమై మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తున్నా ఎటువంటి ఫలితం కనబడడంలేదని తెలిపారు. తొలుత సెటిల్‌మెంట్‌కి ఒప్పుకోని మేనేజ్‌మెంట్ ఇప్పుడు ఆమోదిస్తామని చెబుతోందన్నారు. చర్చలకు వెళ్లి ఏదైనా గట్టిగా మాట్లాడితే లేనిపోని కేసులు పెడతారనే భయంతోనే ముందస్తు ఫిర్యాదు చేస్తునట్టు తెలిపారు. అధికారులు జో క్యం చేసుకని సమస్యను సామరస్యంగా పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
లాకౌట్ నోటీసులు జారీ చేయలేదు
లాకౌట్‌కు సంబంధించి ఎటువంటి నోటీసు జారీ చేయలేదు. అవసరానికి మించి ఉన్న కార్మికులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎవర్ని తొలగించాలనేది ఇంకా నిర్ధారించలేదు. కార్మికులకు చట్టపరంగా న్యాయం చేస్తాం. పెద్దల సమక్షంలో పరిహారం అందజేస్తాం. - కృష్ణమూర్తి, హెచ్‌ఆర్, అలయన్‌స కంపెనీ