సంక్షోభం దిశగా కరీంనగర్‌ గ్రానైట్‌  | Karimnagar Granite towards crisis | Sakshi
Sakshi News home page

సంక్షోభం దిశగా కరీంనగర్‌ గ్రానైట్‌ 

Published Sun, Sep 29 2019 3:17 AM | Last Updated on Sun, Sep 29 2019 3:17 AM

Karimnagar Granite towards crisis - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమ సంక్షోభం దిశగా సాగుతోంది. ఇప్పటికే చైనాకు ఎగుమతులు తగ్గడంతో సగానికిపైగా క్వారీలు మూతపడ్డాయి. 2011 నాటి సీనరేజీ ఫీజు, రూ.749 కోట్ల పెనాల్టీ బకాయిలు తాజాగా కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ వైరం కూడా ఇప్పుడు గ్రానైట్‌ పరిశ్రమకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల 125 మంది క్వారీ యజమానులకు గనుల శాఖ డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో క్వారీల యజమానులు పరిశ్రమను 3 రోజులు మూసే యాలని నిర్ణయించుకున్నారు. శనివారం నుంచి  బంద్‌ మొదలైంది. కరీంనగర్‌ రూరల్, గంగాధర, హుజురాబాద్, కేశవపట్నం, వీణవంక మండ లాల్లోని క్వారీల్లో శనివారం కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో కూడా క్వారీలను మూసేశారు. గ్రానైట్‌ కట్టింగ్‌ యూనిట్లు కూడా మూతపడ్డాయి. ఆదివారం నుంచి గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు కూడా బంద్‌ పాటించనున్నాయి. 

రూ.624 పెనాల్టీ 
2011లో కరీంనగర్‌ నుంచి 8 రైల్వే యార్డుల (ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీలు) ద్వారా గ్రానైట్‌ బ్లాకులు కాకినాడ పోర్టుకు చేరాయి. సముద్ర మార్గంలో గ్రానైట్‌ను రవాణా చేసే క్రమంలో విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి, సీనరేజీ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీనరేజీ ఫీజును రూ.125 కోట్లుగా అప్పట్లో నిర్ణయించారు. దీనిపై 5 రెట్ల అపరాధ రుసుము విధించడంతో రూ.749 కోట్ల మొత్తాన్ని కరీంనగర్‌ వ్యాపారులు చెల్లించాల్సిందిగా లెక్కగట్టారు. సుమారు 200 క్వారీల నుంచి రవాణా అయినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఈ మేరకు మైనింగ్‌ అధికారులు నోటీసులు ఇవ్వడంతోపాటు క్వారీల అనుమతులు నిలిపేశారు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతోపాటు మైనింగ్‌ చట్టప్రకారం అప్పీలేట్‌ అధికారికి అప్పీల్‌ చేయగా, సీనరేజీ ఫీజును 1+5 బదులు 1+1గా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ మేరకు కొందరు క్వారీ యజమానులు చెల్లింపులు చేశారు. అయితే ఈ ప్రక్రియ గనుల శాఖలో ఏళ్ల తరబడి సాగుతుండగా, కోర్టుల సహాయంతో మరికొందరు క్వారీలు నడుపుతున్నారు. 

వ్యాపారులను వేధిస్తున్న ఎంపీ సంజయ్‌.. 
కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారం ద్వారా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న వారిని మాఫియాగా చిత్రీకరించి ఎంపీ బండి సంజయ్‌ వేధింపులకు గురి చేస్తున్నారని కరీంనగర్‌ జిల్లా గ్రానైట్‌ క్వారీఓనర్స్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలతో పరిశ్రమ మనుగడకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయన చర్యలకు నిరసనగా మూడు రోజుల బంద్‌ పాటిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు శ్రీధర్, మాజీ అధ్యక్షుడు టి.తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షుడు రంగారావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కార్యదర్శి మహేందర్‌రావు తెలిపారు. 

నెల రోజుల కింద మళ్లీ తెరపైకి.. 
సీనరేజీ ఫీజు, పెనాల్టీ బకాయిల అంశాన్ని ఎంపీ బండి సంజయ్‌ మరోసారి తెరపైకి తెచ్చారు. గ్రానైట్‌ వ్యాపారుల నుంచి సీనరేజీ ఫీజు, పెనాల్టీ వసూలు చేయట్లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, కార్యదర్శులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల గవర్నర్‌ తమిళిసై సుందరరాజన్‌ను కలసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో 2011లో 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా గ్రానైట్‌ రవాణా చేసిన క్వారీల యజమానులకు గనుల శాఖ నోటీసులు జారీ చేయనుంది. వరంగల్‌లోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూధన్‌రెడ్డి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement