ఖమ్మం రూరల్: జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. నిర్వహణ ఖర్చులు పెరగడం, విద్యుత్ కోతలు ఉండడం, రామెటీరియల్ ధరలు పెరగడం, సబ్సిడీలు వర్తించకపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తోంది. రెండేళ్లుగా నెలకొన్న ఈ పరిస్థితులు దృష్ట్యా ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. ఇప్పటికే సుమారు 100 ఫ్యాక్టరీలు లాగవుట్ అయ్యాయి. ఈ పరిణామాలతో యజమానులే కాకుండా కార్మికులు, ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వారు రోడ్డున పడుతున్నారు. తామింత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నా పాలకులకేమీ పట్టడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ధర పెరిగి..
జిల్లాలో సుమారు 600 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 1.50 లక్షల మంది మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. గ్రానైట్ ముడిసరుకు (రాయి) ధర విపరీతంగా పెరిగింది. గత ఏడాది క్రితం వరకు క్యూబిక్ మీటరు రాయి రూ.18 వేలకే దొరికేదని, ఇప్పుడు రూ.25 వేలు పలుకుతోందని యజమానులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా క్వారీ తవ్వకాలపై ఆంక్షలు విధించడం వల్ల రాయి కొరత ఏర్పడి ధర పెరిగిందని తెలిపారు.
విద్యుత్ వెతలు
ఒకవైపు ఎడాపెడా విద్యుత్ కోత, మరోవైపు పెరిగిన విద్యుత్ చార్జీలు గ్రానైట్ పరిశ్రమల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి. రెండేళ్ల క్రితం ఒక ఫ్యాక్టరీకి నెలసరి విద్యుత్ బిల్లు సగటున రూ.లక్ష వచ్చేదని, ప్రస్తుతం రూ.2.50లక్షలు వస్తోందని యజమానులు తెలిపారు. దీనికి తోడు సర్‌చార్జీల పేరుతో అదనంగా వేలాది రూపాయలు బిల్లులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నడిచినా నడవకపోయినా నెలకు విద్యుత్ బిల్లు మాత్రం రూ.60వేలు తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గత ఏడాది క్రితం యూనిట్‌కు రూ.5.70 పైసలు ఉన్న ధర, ఇప్పుడు రూ.6.20 పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఒక కేవీ విద్యుత్ వాడుకుంటే గత ఏడాది రూ.2.50 వసూలు చేసిన విద్యుత్ శాఖ ఇప్పుడు రూ.3.50 తీసుకుంటోందని అంటున్నారు. దీంతో ఫ్యాక్టరీల నిర్వహణ కష్టంగా మారిందంటున్నారు.
వర్తించని సబ్సిడీలు
చిన్నతరహా పరిశ్రమలకు 2004-2009 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం సబ్సిడీలు, పావలా వడ్డీ రుణాలు, క్యాపిటల్ ఫీజు ఇచ్చేది. ఆ తర్వాత సబ్సిడీ నయాపైసా కూడా ఇవ్వడం లేదని యజమానులు అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీలు వెంట వెంటనే వచ్చేవని, ప్రస్తుతం చిన్నతరహా పరిశ్రమలను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరలిపోతున్న ఇతర రాష్ట్రాల కార్మికులు
ఇక్కడి ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి మూతపడుతుండడంతో ఇతర రాష్ట్రాల కార్మికులు పని దొరకక తిరిగి స్వస్థలాలకు వెళ్తున్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు చక్కబడి ఫ్యాక్టరీలు నిడిపించాలన్నా మానవ వనరులు లేక కష్టమేనని యజమానులు అంటున్నారు.