‘హా’లిడే !
జిన్నారం : పవర్ కట్‌లతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమల యాజమాన్యాల కు సర్కార్ మరో షాకిచ్చింది. డిమాం డ్ మేరకు విద్యుత్ అందివ్వలేని పరిస్థితుల్లో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించింది. ఈ మేరకు వారంలో ఓ రోజు పరిశ్రమల కార్యకలపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో పరిశ్రామల యాజమాన్యాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సర్కార్ నిర్ణయంతో కార్మికులు కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నెలరోజులపాటు పనిచేస్తేనే అంతంతమాత్రంగా డబ్బులొస్తున్నాయని, ఇపుడు పవర్ హాలిడే పేరుతో నెలలో 5 రోజుల పాటు పనిలేకపోతే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
జిన్నారం మండలంలోని బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు రెండువందలకు పైగా ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఉంటేనే ఈ పరిశ్రమలు నడిచే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారంలో ఒక రోజు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఏంచేయాలో తెలియక పరిశ్రమల యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
బొంతపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో ప్రతి గురువారం, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ప్రతి మంగళవారం విద్యుత్ హాలీడే ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కరెంటు కోతలు అధికం కావడంతో పరిశ్రమలను నడపటమే భారంగా మారుతోందని, ఈ పరిస్థితుల్లో ఏకంగా పవర్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమలు మూసుకోవడం తప్ప తమకు మరోదారి లేదని యాజమాన్యాలు అంటున్నాయి. పలుకుబడి ఉన్న మరికొన్ని బహుళజాతి పరిశ్రమలు మాత్రం ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
హాలిడేతో 10 వేల మంది కార్మికులకు కష్టం
జిన్నారం మండలంలోని చిన్న తరహా పరిశ్రమల్లో సుమారు 10 వేల మందికిపైగా కార్మికులు విధులను నిర్వహిస్తుంటారు. ఒక రోజు కరెంటు లేని కారణంగా చిన్న పరిశ్రమలు పరిశ్రమకు హాలీడే ప్రకటిస్తాయి. దీంతో కార్మికులు ఒక రోజు కూలీని కోల్పోతున్నారు. పొట్ట కూటి కోసం ఎక్కడి నుంచో ఈ ప్రాంతాలకు వచ్చి కొద్ది డబ్బును సంపాదించుకుందామంటే ఈ కరెంటు కోతలు తమకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి కార్మికులు వాపోతున్నారు.
రసాయన పరిశ్రమల్లో తప్పక రియాక్టర్‌లు నడుస్తూనే ఉండాలని, ఈ పరిస్థితుల్లో ఒక రోజు కరెంటు లేకపోతే ఏం చేయాలో తెలియక యాజమాన్యాలు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాయి. జనరేటర్లు ఉపయోగించుకోవటం వల్ల కొంతలాభం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, భారం అధికమవుతుందని యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్‌లు నిరంతరంగా నడుస్తుండటం వల్ల ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరెంటు సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలు, కార్మికులు కోరుతున్నారు.
పరిశ్రమలను నడపటం కష్టమైంది
కరెంటు సమస్యలు తరచూ వస్తుండటంతో పరిశ్రమలను నడపటం కష్టమవుతోంది. విద్యుత్ సమస్యను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే పరిశ్రమలు మూయడం తప్ప మరోమార్గం లేదు.
-ఆనంద్‌రావు, పారిశ్రామిక వేత్త