కుప్పం గ్రానైట్‌.. అంతర్జాతీయంగా ఫుల్‌ డిమాండ్‌  | Kuppam Green Granite: Price, Exports, Employment Details Here | Sakshi
Sakshi News home page

కుప్పం గ్రానైట్‌.. అంతర్జాతీయంగా డిమాండ్‌ 

Published Thu, Jul 14 2022 7:39 PM | Last Updated on Thu, Jul 14 2022 7:43 PM

Kuppam Green Granite: Price, Exports, Employment Details Here - Sakshi

కుప్పంలో గ్రానైట్‌ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ లభించే అరుదైన గ్రీన్‌ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యమైన రాళ్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి బంగారం లావాదేవీల కారణంగా స్థానిక ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతోంది. 


సాక్షి, చిత్తూరు/శాంతిపురం:
జిల్లా సరిహద్దు ప్రాంతంలోని కుప్పం నియోజకవర్గం గ్రానైట్‌ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. పొరుగునే తమిళనాడు, కర్ణాటక ఉండడంతో లావాదేవీలకు మరింత అనుకూలంగా మారింది. ఈ ప్రాంతంలో వివిధ రకాల గ్రానైట్‌ రాళ్లు లభిస్తుంటాయి. అయితే గ్రీన్‌ గ్రానైట్‌కు మాత్రం మంచి డిమాండ్‌ ఉంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల రాళ్లు ఇక్కడ దొరుకుతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. ప్రధానంగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు, సి.బండపల్లె, రామకుప్పం మండలం బగళనత్తం, ముద్దనపల్లె, గుడుపల్లె మండలం ఓయన్‌ పుత్తూరు, పాపానూరులో సుమారు 100 వరకు గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. ఇక్కడే గ్రానైట్‌ రాళ్లను వివిధ సైజ్‌ల్లో తీర్చిదిద్దుతారు. ప్లేట్లు, క్యూబ్స్, కర్బ్స్‌గా పల ఆకృతుల్లో రాళ్లను మలుస్తుంటారు. 


వేలాది మందికి ఉపాధి 

కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్‌ క్వారీల్లో సుమారు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. తమిళనాడు, చత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 20వేల మందికి జీవనోపాధి లభిస్తోంది. మొత్తం 40వేల కుటుంబాల వరకు గ్రానైట్‌ పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడి కార్మికులు ఒక్కో గ్రానైట్‌ పీస్‌కు కూలీ కింద రోజుకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. 


ఆకర్షణీంగా డిజైన్లు 

కుప్పం పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల గ్రానైట్‌ రాళ్లు లభిస్తుంటాయి. ఆకుపచ్చ (గ్రీన్‌), బూడిద రంగు (గ్రే), గ్రీన్‌ అండ్‌ గ్రే రాళ్లు ఆకర్షణీయమైన లేన్లుగా ఉంటాయి. వీటి బేస్‌ తెల్లటి మచ్చలు, లైనింగ్‌తో చూడగానే ఆకట్టుకుంటాయి. ఇక తక్కువ పరిమాణంలో బ్లాక్‌స్టోన్‌ కూడా దొరుకుతుంటాయి. వీటిలో గ్రీన్‌ గ్రానైట్‌ అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. 

బ్రిటీష్‌ కాలంలోనే.. 
బ్రిటీష్‌ వారి పాలనలోనే కుప్పం గ్రానైట్‌ ఎగుమతి ప్రారంభమైనట్లు రికార్డుల్లో ఉంది. 1925లో ఇక్కడి నుంచి లండన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సమాధి రాళ్ల కోసం తెల్లదొరలు కుప్పం గ్రానైట్‌ను తీసుకెళ్లినట్లు పేర్కొని ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం సుమారు 35 ఏళ్లుగా కుప్పం గ్రానైట్‌ ఎగుమతులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 


కోవిడ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే.. 

గత రెండేళ్లలో కోవిడ్‌ కారణంగా గ్రానైట్‌ వ్యాపారం డీలా పడింది. లావాదేవీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర సంక్షభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యథావిధిగా పుంజుకుందని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఎగుమతులు కూడా బాగా సాగుతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్‌: తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపు.. ఇవి గమనించండి!)

రూ.కోట్ల లావాదేవీలు.. 
కుప్పం గ్రీన్‌ గ్రానైట్‌కు అధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ గ్రానైట్‌ను కొనుగోలు చేసేందుకు దేశ,విదేశీ వ్యాపారులు పోటీపడుతుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ నిర్మాణాల్లో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే కుప్పం నుంచి ప్రతి నెలా సుమారు 2వేల టన్నుల వరకు గ్రీన్‌ గ్రానైట్‌ ఎగుమతి చేస్తున్నారు. రూ.కోట్ల లావాదేవీలు సాగిస్తున్నారు. భారీ గ్రానైట్‌ బండలను స్థానికంగానే ట్రిమ్మింగ్‌ చేసి వివిధ సైజుల్లో తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సైతం పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది.  


రాతి పనే జీవనాధారం  

మాకు రాతి పనే జీవనాధారం. గ్రానైట్‌ డ్రస్సింగ్‌ క్యాంపుల్లో నేను, నా భార్య జయమ్మ పనిచేస్తున్నాం. ఒక్కో పీస్‌కు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వస్తోంది. ఈ డబ్బుతోనే మా పిల్లలను చదివిస్తున్నాం. వాళ్లు మాలాగా కాయకష్టం చేయకుండా ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. గ్రానైట్‌ వ్యాపారం బాగా సాగితే కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుంది.  
– సుబ్రమణ్యం, రాళ్లబూదుగూరు

మరో పని తెలియదు 
చదువు ఒంట బట్టక మా నాన్నతో కలిసి చిన్నతనం నుంచి రాయిని తొలిచే పనులకు వచ్చేవాడిని. సుమారు 20 ఏళ్లుగా రాతి పని చేస్తుండటంతో మరో వృత్తి తెలియదు. పనులు బాగా దొరికితే రోజుకు రూ వెయ్యి వరకు వస్తుంది. అయితే కరోనా సమయంలో పనిలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాం. ప్రభుత్వం, దాతల సాయంతో పొట్ట పోసుకున్నాం. ఇప్పుడు మళ్లీ పనులు పెరుగుతున్నాయి.  
– కార్తీక్, కార్మికుడు, సోలిశెట్టిపల్లె  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement