galaxy granites
-
గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్‌లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్‌లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్‌లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్‌ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్‌మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్‌ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్‌లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్‌ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్‌ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్
(బివి రాఘవ రెడ్డి) ఈ భూ మండలంలో రెండు విలువైన సంపదలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు కాగా.. మరొకటి ప్రకాశం జిల్లా చీమకుర్తి భూగర్భంలో ఉన్న గెలాక్సీ బ్లాక్ గ్రానైట్. 45 ఏళ్ల కిందట.. తనకు రోజూ మంచి కాఫీ ఇస్తున్నాడన్న అభిమానంతో చీమకుర్తి తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ టీస్టాల్ యజమానికి సాగు చేసుకోమంటూ రెండెకరాలకు పట్టా రాసిచ్చారు. పశువుల మేత కూడా మొలవని ఆ భూమి నాకెందుకంటూ అతను పట్టా తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ భూమి విలువ ఇప్పుడు ఎకరా రూ.3 కోట్లు! చీమకుర్తికి 4 కి.మీ దూరంలో రాళ్లు, రప్పలు, రేగుచెట్లతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న వేమా ఎల్లయ్య రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. అదే భూమి గర్భంలో రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉన్నట్లు తర్వాత కాలంలో బయట పడింది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ మరింతగా వెలుగులు విరజిమ్మనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతులు పెరగటంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబరు 58ని ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త స్లాబ్ సిస్టం అమలులోకి రానుంది. సింగిల్ కట్టర్ బ్లేడ్ ఉన్న ఫ్యాక్టరీ యజమాని రూ.27 వేలు చెల్లిస్తే 22 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయిని ప్రాసెస్ చేసుకునేందుకు అనుమతి వస్తుంది. మల్టీ కట్టర్ బ్లేడ్ ఫ్యాక్టరీ అయితే రూ.54 వేలు చెల్లించి 44 క్యూబిక్ మీటర్ల రాయిని ప్రాసెస్ చేసుకోవచ్చు. విద్యుత్ చార్జీల రాయితీపైనా త్వరలో జీవో విడుదల కానుంది. ఆ మేరకు యూనిట్‌కు రూ.2 రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఒక్కో ఫ్యాక్టరీ యజమానికి నెలకు కనీసం రూ.లక్ష ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు రా మెటీరియల్‌ను క్వారీ యజమానుల వద్ద నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. విజిలెన్స్ దాడుల భయం లేకుండా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. రామాయపట్నం పోర్టు ఇక్కడి ఎగుమతిదారులకు వరం కానుంది. రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇప్పటికే 1650 గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 60 అధునాతన ఫ్యాక్టరీలు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యాయి. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే యజమానులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం జనరల్ కేటగిరీ, బీసీ వర్గాలకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం సబ్సిడీ వస్తుంది. దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రెండు మూడు సంవత్సరాల్లోనే తీర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ సహకారం బాగుండటంతో ఏటేటా ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడేళ్లలోనే 250కి పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 90 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదికి 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఎగుమతి జిల్లా నుంచి ఏడాదికి 8.82 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, టర్కీ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. అందులో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఒక్కటే 6.25 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతి అవుతుంది. బ్లాక్ గ్రానైట్ ఏడాదికి 80 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్ 1.77 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతవుతోంది. వెలికితీసిన గ్రానైట్ విలువ రూ.1.26 లక్షల కోట్లు! ఇక్కడ గ్రానైట్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఏడాదికి 11 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికి తీసినా ప్రస్తుతం పది లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. 35 ఏళ్లలో సరాసరిన ఏడాదికి 4 లక్షల క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టినా 1.40 కోట్ల చ.మీటర్ల గ్రానైట్ రాయిని తవ్వి తీసినట్లు అంచనా. క్యూబిక్ మీటర్ గ్రానైట్ నాణ్యతను బట్టి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. క్యూబిక్ మీటర్‌కు సరాసరిన రూ.90 వేలు లెక్కగట్టినా ఇప్పటి వరకు రూ.1.26 లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్‌ను బయటకు తీసినట్లు అంచనా. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్న గ్రానైట్‌లో 30 శాతం గనుల ద్వారా వెలికితీయగా.. రానున్న 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరువు జిల్లాలో కనకవర్షం... ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువుకు పెట్టింది పేరు. అలాంటి జిల్లా నేడు పారిశ్రామిక కేంద్రంగా మారిందంటే దానికి చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కారణం. అప్పట్లో ఎందుకూ పనికి రాదనుకున్న రామతీర్థం పరిసరాల్లోని భూమి నేడు ఎకరం రూ.3 నుంచి రూ.4 కోట్లకు పైనే పలుకుతోంది. చీమకుర్తితో పాటు ఒంగోలు శివారులో నున్న పేర్నమిట్ట ఎస్టేట్, సంతనూతలపాడు, మార్టూరు, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ తదితర ప్రాంతాల్లో 1650 గ్రానైట్ ఫ్యాక్టరీలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల కార్మికులు ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదుకున్న వైఎస్... 2008లో ఆర్థిక మాంద్యం కారణంగా గ్రానైట్ గనుల లీజుదారులు తీవ్రంగా నష్టాల బారిన çపడ్డారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీలో మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ నంబర్లు 104, 105 ను జారీ చేశారు. దాంతోనే తాము ఒడ్డున పడ్డామని చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బ్లాక్ గెలాక్సీ.. పేరెలా వచ్చిందంటే చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో గ్రానైట్ ఉన్నట్లు 1983లో బయటపడింది. 1985లో మైనింగ్ లీజుకు తీసుకున్న జూబ్లీ గ్రానైట్ యజమాని నన్వాని వెలికి తీసిన గ్రానైట్‌ను మార్కెటింగ్ కోసం చైనా తీసుకెళ్లారు. నల్లని బండపై నగిషీలు అద్దినట్టున్న ఆ గ్రానైట్‌కు బ్లాక్ గెలాక్సీ అని పేరుపెట్టారు. దాని డిమాండ్‌ను గుర్తించిన చైనా అధునాతన కటింగ్ మిషన్లతో పెద్దఎత్తున యూనిట్లను నెలకొల్పింది. రూ.11,015 ఆదాయంతో మొదలు రామతీర్థం పరిసరాల్లో గ్రానైట్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం మొట్టమొదటి సారిగా 8.094 హెక్టార్లలో ఒకే ఒక లీజుతో రాయల్టీ ద్వారా రూ.11,015 ఆదాయం వచ్చినట్లు ఒంగోలు భూగర్భ గనుల శాఖాధికారుల వద్దనున్న గణాంకాలు చెబుతున్నాయి. 2013లో రాయల్టీ రూçపంలో ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 1081 హెక్టార్లలో 327 లీజులతో ఏడాదికి రూ.566 కోట్ల ఆదాయం రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి వస్తోందని మైన్స్ డీడీ తెలిపారు. జీఎస్టీ, డెడ్రెంట్లు, పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది. ఏటా రూ.500– రూ.600 కోట్లు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 85 శాతం చైనాకు ఎగుమతి అవుతోంది. గ్రానైట్ రాయి కటింగ్‌కు, పాలిషింగ్‌కు ఉపయోగించే మిషనరీ, డైమండ్ కట్టర్లు, సెగ్మెంట్లు అన్నీ చైనా లో పెద్దఎత్తున అభివృద్ధి చేసి యూనిట్లు స్థాపించారు. కొన్నేళ్లుగా మన పారిశ్రామికవేత్తలు చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. – బి.జగన్నాథరావు, మైన్స్ డీడీ, ఒంగోలు చైనా మార్కెట్‌తోనే డిమాండ్ చీమకుర్తిలోని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ గ్రానైట్‌ను నేనే చైనాకు తీసుకుపోయి మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత మరో రెండు కంపెనీలు నాతో కలిసి వ్యాపారం చేశాయి. క్వారీలు పెరిగాక ఎగుమతి కూడా భారీగా పెరిగింది. – ఎల్.టి.నన్వాని, జూబ్లీ గ్రానైట్ యజమాని స్లాబ్ సిస్టంతో మంచి రోజులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చీమకుర్తి వచ్చినప్పుడు స్లాబ్ సిస్టం అమలు చేస్తున్నట్లు చెప్పి, ఆమేరకు జీఓ ఇచ్చారు. ఈ విధానం వల్ల ఫ్యాక్టరీల యజమానులకు నిర్ణీత ధరకు రాయి దొరుకుతోంది. విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 రాయితీ వల్ల చాలా కలిసి వస్తుంది. మొత్తం మీద ఫ్యాక్టరీల యజమానులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. – యర్రంనేని కోటేశ్వరరావు, ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్, గుండ్లాపల్లి -
కళ తప్పిన గెలాక్సీ
► గ్రానైట్ వ్యాపారానికి గడ్డుకాలం ► అంతర్జాతీయ మార్కెట్లో గెలాక్సీకి తగ్గిన గిరాకీ ► అలవెన్సులలో కొట్టుకుపోతున్న యజమానుల లాభాలు ►ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ రాబడి రెట్టింపు చీమకుర్తి రూరల్: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌కు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ తగ్గింది. 15 ఏళ్ల క్రితం పది పన్నెండు దేశాలకు ఎగుమతయ్యే గెలాక్సీ గ్రానైట్‌కు ఇప్పుడు చైనా ఒక్కటే దిక్కయింది. డిమాండ్ తగ్గటంతో చైనా కూడా సగానికి సగం ఉచితంగా ఇస్తానంటేనే కొనుగోలు చేస్తామని మెలిక పెడుతోంది. ఒక క్యూబిక్ మీటరు గ్రానైట్ కొనుగోలు చేస్తే మరో క్యూబిక్ మీటరు రాయిని ఉచితంగా ఇవ్వాలి. ఇలాగైతేనే గ్రానైట్‌ను కొంటామని కొర్రీలు వేస్తుండటంతో చేసేది లేక చీమకుర్తి మండలంలోని రామతీర్థంలో ప్రసిద్ధి చెందిన గ్రానైట్ క్వారీల్లో వ్యాపారాలు కళతప్పాయి. చైనాకు అమ్మినదానిలో సగానికి మాత్రమే ఆదాయం వస్తోంది. మిగిలిన సగం రాయిని ఉచితంగానే ఇవ్వాల్సి వస్తోందని గ్రానైట్ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక క్యూబిక్ మీటరు కొనుగోలు చేస్తే కూబిక్ మీటరుకు చుట్టుపక్కల అదనంగా రెండు మూడు అంగుళాల కొలతలలో అలవెన్స్ రూపంలో ఉచితం ఇచ్చేవారు. డిమాండ్ తగ్గేకొద్దీ క్యూబిక్ మీటరుకు మరో క్యూబిక్ మీటరు ఫ్రీగా ఇవ్వాల్సి రావడంతో గ్రానైట్ యజమానులు అమ్మినదానిలో సగం రాయికే ఆదాయం వస్తుందంటున్నారు. ప్రభుత్వానికి రెట్టింపు రాయల్సీ రాబడి..: గ్రానైట్ యజమానులకు ఆదాయం తగ్గినా ప్రభుత్వానికి మాత్రం రాయల్టీలో డబుల్ ఇన్‌కం వస్తోంది. ఎగుమతి చేసే రాయిలో అలవెన్స్‌ల కింద ఉచితంగా ఇచ్చే రాయికి కూడా రాయల్టీ లెక్కగట్టటమే ఇందుకు కారణం. ఒక గ్రానైట్ యజమాని నెలకు వెయ్యి క్యూబిక్ మీటర్లు ఎగుమతి చేస్తే దానిలో మరో వెయ్యి క్యూబిక్ మీటర్లును ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని వలన గ్రానైట్ యజమానికి వెయ్యి క్యూబిక్ మీటర్లకే బయ్యరు డబ్బులు చెల్లిస్తారు. కాని గ్రానైట్ యజమాని మాత్రం రెండు వేల క్యూబిక్ మీటర్లుకు రాయల్టీ చెల్లించాల్సి వస్తోంది. దానితో ప్రభుత్వానికి రాయల్టీలో రాబడి రెట్టింపయింది. క్వారీలపై భారం మీద భారం..: ఇప్పటికే గ్రానైట్ ఎగుమతులలో అలవెన్సుల భారం కుంగదీస్తుంటే ఇది చాలదన్నట్లుగా ఇటీవల రాయల్టీ పెంచటం, డీఎంఎఫ్ అదనపు పన్నును విధించటం గ్రానైట్ యజమానులను మరింత భారంగా మారింది. 2015 నవంబర్లోనే రాయల్టీని 30 శాతం పెంచగా డీఎంఎఫ్ పేరుతో మరో 30 శాతం పన్ను విధించారు. గ్రానైట్ యజమానులు, ఫ్యాక్టరీ యజమానుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే డీఎంఎఫ్‌ను 30 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించటంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. గత మూడేళ్ల ఎగుమతులు, రెవెన్యూ లాభాలపై మైన్స్ ఏడీ కార్యాలయం నుంచి సేకరించిన పీసీçల్లిగణాంకాలను పరిశీలిస్తే .. మొదటి రెండేళ్లతో పోల్చుకుంటే 2016–17 జనవరి 31 నాటికే మొదటి రెండేళ్ల ఆదాయాన్ని ప్రభుత్వం రాబట్టుకుంది. ఇక మిగిలిన రెండు నెలలు కాలంలో వచ్చే ఎగుమతులు, ఆదాయం చూస్తే గత మూడేళ్ల కంటే ఎక్కువుగానే ఉన్నట్లు కనిపిస్తోంది.