► గ్రానైట్ వ్యాపారానికి గడ్డుకాలం
► అంతర్జాతీయ మార్కెట్‌లో గెలాక్సీకి తగ్గిన గిరాకీ
► అలవెన్సులలో కొట్టుకుపోతున్న యజమానుల లాభాలు
►ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ రాబడి రెట్టింపు
చీమకుర్తి రూరల్: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌కు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ తగ్గింది. 15 ఏళ్ల క్రితం పది పన్నెండు దేశాలకు ఎగుమతయ్యే గెలాక్సీ గ్రానైట్‌కు ఇప్పుడు చైనా ఒక్కటే దిక్కయింది. డిమాండ్ తగ్గటంతో చైనా కూడా సగానికి సగం ఉచితంగా ఇస్తానంటేనే కొనుగోలు చేస్తామని మెలిక పెడుతోంది. ఒక క్యూబిక్ మీటరు గ్రానైట్ కొనుగోలు చేస్తే మరో క్యూబిక్ మీటరు రాయిని ఉచితంగా ఇవ్వాలి. ఇలాగైతేనే గ్రానైట్‌ను కొంటామని కొర్రీలు వేస్తుండటంతో చేసేది లేక చీమకుర్తి మండలంలోని రామతీర్థంలో ప్రసిద్ధి చెందిన గ్రానైట్ క్వారీల్లో వ్యాపారాలు కళతప్పాయి. చైనాకు అమ్మినదానిలో సగానికి మాత్రమే ఆదాయం వస్తోంది. మిగిలిన సగం రాయిని ఉచితంగానే ఇవ్వాల్సి వస్తోందని గ్రానైట్ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక క్యూబిక్ మీటరు కొనుగోలు చేస్తే కూబిక్ మీటరుకు చుట్టుపక్కల అదనంగా రెండు మూడు అంగుళాల కొలతలలో అలవెన్స్ రూపంలో ఉచితం ఇచ్చేవారు. డిమాండ్ తగ్గేకొద్దీ క్యూబిక్ మీటరుకు మరో క్యూబిక్ మీటరు ఫ్రీగా ఇవ్వాల్సి రావడంతో గ్రానైట్ యజమానులు అమ్మినదానిలో సగం రాయికే ఆదాయం వస్తుందంటున్నారు.
ప్రభుత్వానికి రెట్టింపు రాయల్సీ రాబడి..: గ్రానైట్ యజమానులకు ఆదాయం తగ్గినా ప్రభుత్వానికి మాత్రం రాయల్టీలో డబుల్ ఇన్‌కం వస్తోంది. ఎగుమతి చేసే రాయిలో అలవెన్స్‌ల కింద ఉచితంగా ఇచ్చే రాయికి కూడా రాయల్టీ లెక్కగట్టటమే ఇందుకు కారణం. ఒక గ్రానైట్ యజమాని నెలకు వెయ్యి క్యూబిక్ మీటర్లు ఎగుమతి చేస్తే దానిలో మరో వెయ్యి క్యూబిక్ మీటర్లును ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని వలన గ్రానైట్ యజమానికి వెయ్యి క్యూబిక్ మీటర్లకే బయ్యరు డబ్బులు చెల్లిస్తారు. కాని గ్రానైట్ యజమాని మాత్రం రెండు వేల క్యూబిక్ మీటర్లుకు రాయల్టీ చెల్లించాల్సి వస్తోంది. దానితో ప్రభుత్వానికి రాయల్టీలో రాబడి రెట్టింపయింది.
క్వారీలపై భారం మీద భారం..: ఇప్పటికే గ్రానైట్ ఎగుమతులలో అలవెన్సుల భారం కుంగదీస్తుంటే ఇది చాలదన్నట్లుగా ఇటీవల రాయల్టీ పెంచటం, డీఎంఎఫ్ అదనపు పన్నును విధించటం గ్రానైట్ యజమానులను మరింత భారంగా మారింది. 2015 నవంబర్‌లోనే రాయల్టీని 30 శాతం పెంచగా డీఎంఎఫ్ పేరుతో మరో 30 శాతం పన్ను విధించారు. గ్రానైట్ యజమానులు, ఫ్యాక్టరీ యజమానుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే డీఎంఎఫ్‌ను 30 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించటంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.
గత మూడేళ్ల ఎగుమతులు, రెవెన్యూ లాభాలపై మైన్స్ ఏడీ కార్యాలయం నుంచి సేకరించిన పీసీçల్లిగణాంకాలను పరిశీలిస్తే .. మొదటి రెండేళ్లతో పోల్చుకుంటే 2016–17 జనవరి 31 నాటికే మొదటి రెండేళ్ల ఆదాయాన్ని ప్రభుత్వం రాబట్టుకుంది. ఇక మిగిలిన రెండు నెలలు కాలంలో వచ్చే ఎగుమతులు, ఆదాయం చూస్తే గత మూడేళ్ల కంటే ఎక్కువుగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
కళ తప్పిన గెలాక్సీ
Published Tue, Feb 28 2017 6:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement