గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం | valuable mineral in Chimakurti mines | Sakshi
Sakshi News home page

గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం

Published Sun, Oct 15 2023 4:08 AM | Last Updated on Sun, Oct 15 2023 4:09 AM

valuable mineral in Chimakurti mines - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్‌లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది.

చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్‌ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్‌ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్‌ బ్లాక్‌లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్‌లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్‌ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్‌ వేస్ట్‌ ఉంటుందనేది అంచనా.  

దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు...
ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సు­ర్‌­బురి బేసిన్‌లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వ­లు ఉండగా, రష్యాలోని యురల్‌ పర్వత శ్రే­ణు­లు, అమెరికా,  జింబాబ్వే, ఆస్ట్రేలియాలో­నూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌ­లా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్‌ ఆఫ్‌ మెటల్స్‌ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్‌ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి.  

ఎన్నెన్నో ప్రయోజనాలు..
నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్‌ ఆఫ్‌ మెటల్స్‌ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్‌ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటి­నం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే..

  • పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్‌ డివైజస్‌), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్‌పో్లజివ్స్, లాబ్స్‌ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. 
  • జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు.
  • వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్‌ చికిత్సలో ప్లాటినం గ్రూప్‌ ఆఫ్‌ మెటల్స్‌ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్‌మేకర్‌ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్‌ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. 
  •  ప్లాటినం–రోడియం కలిసిన ఖని­జాలు ఫ్లాట్‌ స్క్రీన్‌ టెలివిజన్, కంప్యూటర్‌ మోనిటర్, హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్లు, డిజిటల్‌ కెమెరాలు, డిస్‌ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్‌ డిస్‌ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. 

వంద గ్రాములు రూ.2.37 లక్షలు..
ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. 

గ్రానైట్‌ డంప్‌ల నుంచి..
చీమకుర్తి గ్రానైట్‌లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్‌ఐ, ఓఎన్‌జీసీ, ఎన్‌జిఆర్‌ఐ, ఎన్‌­ఎండీసీ, ఎంఇఎల్‌ఎల్‌ (మినరల్‌ ఎక్స్‌ల్పిరేషన్‌ కంపెనీ లిమిటెడ్‌), ఏఎండీ (అటావిుక్‌ మినరల్‌ డివిజన్‌), ఐబీఎం (ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్‌ జియలాజికల్‌ ప్రోగ్రామింగ్‌ బోర్డు సమావేశాలు జరిగేవి.

ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్‌ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్‌ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్‌ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్‌ వేస్ట్‌ను ప్రాసెస్‌ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement