CM YS Jagan: ఏడాదిలో వెలిగొండ | CM YS Jaganmohan Reddy Comments On Veligonda Project | Sakshi
Sakshi News home page

CM YS Jagan: ఏడాదిలో వెలిగొండ

Published Thu, Aug 25 2022 3:09 AM | Last Updated on Thu, Aug 25 2022 10:03 AM

CM YS Jaganmohan Reddy Comments On Veligonda Project - Sakshi

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్సార్, బీఎస్సార్‌ విగ్రహాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో బూచేపల్లి కుటుంబ సభ్యులు, నాయకులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల ప్రజల ఈ చిరకాల కోరికను తీర్చాకే 2024లో ఎన్నికలకు వెళతామని అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఆమె తనయుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (బీఎస్సార్‌)ల కాంస్య విగ్రహాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

అనంతరం బూచేపల్లి ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 18.80 కిలోమీటర్ల మొదటి టన్నెల్, 18.78 కిలోమీటర్ల రెండో టన్నెల్‌ పనులను 2014కు ముందు నాన్నగారు ఉరుకులు, పరుగులు పెట్టించారని తెలిపారు. 2014 వరకు మొదటి టన్నెల్‌ను ఏకంగా 11.58 కి.మీ పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాలనలో మొదటి టన్నెల్‌ను కేవలం 4.33 కి.మీ. మాత్రమే తవ్వాగా, మనం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 2.89 కిలో మీటర్లు తవ్వి పూర్తి చేశామని చెప్పారు.

రెండో టన్నెల్‌ పనులు 2014 వరకు 8.74 కిలో మీటర్లు తవ్వితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 2.35 కిలో మీటర్లు మాత్రమే తవ్వి, చేతులు దులుపుకున్నారన్నారు. మన ప్రభుత్వం వచ్చాక రెండో టన్నెల్‌ను ఇప్పటికే 3.71 కిలో మీటర్లు పూర్తి చేశామని, ఇక మిగిలిన 3.96 కి.మీలు కూడా 2023 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపు రేఖలన్నీ సమూలంగా మారిపోతాయని అన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
సభలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

మంచి చేసే మనుషులు చిరస్థాయిగా ఉంటారు
► మంచి చేసే మనుషులు చనిపోయినా, చిరస్థాయిగా మనస్సుల్లో నిలిచి ఉంటారు. మంచి చేసిన వారికి చావు ఉండదు. ఒకవైపు నాన్నగారు.. మరో వైపు సుబ్బారెడ్డి అన్న.. ఇలాంటి నాయకులను ఎవరూ మరిచిపోలేరు. – గాంధీ, అంబేడ్కర్, మహాత్మా పూలే, జగ్జీవన్‌ రామ్, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, మహానేత వైఎస్సార్‌.. ఇలాంటి వారందరినీ కలకాలం తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ, వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు ఎప్పటికీ మరణం ఉండదు. వీళ్లంతా తెలుగు నేల మీద గుర్తుండిపోయే శిఖరాలు.
► నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగారు. నాన్నగారి విగ్రహంతోపాటు, ఆయనతో కలిసి అడుగులు వేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (శివప్రసాదరెడ్డి నాన్న) గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది.
► రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని విజయవాడలో ఏప్రిల్‌ 14న ఆవిష్కరించనున్నాం.

ఆ అడుగులు మరచిపోలేం
► రైతులకు ఉచిత విద్యుత్‌ అన్నప్పుడు.. కుయ్‌.. కుయ్‌ అని అంబులెన్స్‌ శబ్ధం విన్నప్పుడు, ఆరోగ్యశ్రీ అన్నప్పుడు మనకు ఆ దివంగత మహానేతే గుర్తుకు వస్తారు. ఆ రోజుల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పినప్పుడు.. కొందరు తీగలు చూపి, బట్టలు ఆరేసుకునేందుకే అవి పనికొస్తాయని ఎద్దేవా చేశారు.
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అట్టడుగున ఉన్న పేద వారు నిజంగా జీవితంలో పైకి రావాలంటే ముఖ్యమైనది చదువు మాత్రమే. పేదల పిల్లలు చదువుకోవాలని ఆ మహానేత తపించారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చారు. లక్షల కొద్దీ ఇళ్ల నిర్మాణం, జల యజ్ఞం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి వేసిన అడుగులు ఇప్పటికీ మరిచిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. 
► అలా మంచి చేసిన రాజశేఖరరెడ్డి కొడుకుగా, మీ బిడ్డగా జగన్‌ నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మాట ఇస్తున్నా. మీ చల్లని దీవెనలతో ఎన్నికలప్పుడు చెప్పిన హామీలలో 95 శాతం పూర్తి చేశాం. మీ చిరునవ్వులు, మీ ఆప్యాయతలు పంచి పెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితునికి,  మిత్రునికి, అవ్వకు, తాతకు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు.

గ్రానైట్‌ పరిశ్రమకు భరోసా
► స్టోన్‌ కటింగ్‌ మిషన్‌లకు సంబంధించి చిన్న చిన్న యాజమాన్యాల కింద పది మందికి పైగా పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆరోజు నేను ఏదైతే చెప్పానో.. ఆ విధంగా మళ్లీ స్లాబ్‌ సిస్టమ్‌ విధానాన్ని తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడకు వచ్చే ముందే జీవో నంబరు 58 విడుదల చేశాం. 
► నాన్న గారి హయాంలో తీసుకొచ్చిన ఈ స్లాబ్‌ పద్ధతిని 2016లో చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో చిన్న చిన్న గ్రానైట్‌ పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయి. అందుకే దాదాపు ఏడు వేల యూనిట్లకు లబ్ధి చేకూరేలా జీవో 58 తీసుకొచ్చాం.
► ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్‌ ఎక్కువగా ఉంటుంది. 22 క్యూబిక్‌æ మీటర్ల ముడి గ్రానైట్‌ ప్రాసెస్‌ యూనిట్లకు సింగిల్‌ బ్లేడ్‌కు రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.54 వేలు నెలకు ఇచ్చేలా సీనరేజ్‌ స్లాబు నిర్ణయించాం. శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో సింగిల్‌ బేŠల్‌డ్‌కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.44 వేల సీనరేజ్‌ స్లాబ్‌ నిర్ణయించాం.
► ఇలా స్లాబ్‌ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి రూ.135 కోట్లు నష్టం వాటిల్లితుందని తెలిసినా, మీ బాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ప్రకటించిన కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లు స్పీడ్‌ అందుకుంటాయి. వాటికి అనుబంధంగా రవాణా, మార్కెట్‌ రంగాల్లో అవకాశాలు మెరుగుపడి కార్మికులకు మేలు జరుగుతుంది.

విద్యుత్‌ యూనిట్‌కు రూ.2 రాయితీ  
► గ్రానైట్‌ పరిశ్రమకు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తున్నాను. దీంతో చిన్న చిన్న పరిశ్రమలు సైతం పుంజుకుంటాయి. చిన్న చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం యూనిట్‌కు హెచ్‌టీకి రూ.6.30, ఎల్‌టీకీ యూనిట్‌ రూ.6.70 చొప్పున వసూలు చేసేది. ఆ చార్జీల్లో ఇక మీదట నుంచి ప్రతి యూనిట్‌కు రూ.2 రాయితీ ప్రకటిస్తున్నా. అటు స్లాబ్‌ సిస్టం అమలు చేయటం, ఇటు విద్యుత్‌ యూనిట్లలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అయినా పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని భావించాను. 
► విద్యుత్‌ రాయితీ వల్ల ఏకంగా ప్రభుత్వానికి రూ.210 కోట్లు భారం పడుతుంది. మరో వైపు సీనరేజ్‌ మార్పు వల్ల రూ.135 కోట్ల భారం పడుతుంది. వెరసి రెండింటి మీద దాదాపు రూ.350 కోట్లు భారం పడుతుంది. ఈ రోజు నుంచి ఈ రెండూ అమలులోకి వస్తాయి. 

జెడ్పీ భవనం కోసం రూ.20 కోట్లు
► ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరిందని.. రూ.20 కోట్లు మంజూరు చేయాలని.. ఇక్కడకు వచ్చేటప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ అడిగారు. రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నాను. తాళ్లూరు మండలం శివరామ్‌పురంలోని మొగిలిగుండాల చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చే పనిని చేపట్టాం. ఆ అమ్మ కోరిక మేరకు ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్‌ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మినీ రిజర్వాయర్‌గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చాం. 
► మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర బాబు, కనిగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

ఎక్కడున్నావు రాజశేఖరన్నా..
ఒంగోలు సబర్బన్‌:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తి సభలో బుధవారం నవ్వుల.. పువ్వులు విరిశాయి. బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ.. డాక్టర్‌ వైఎస్సార్‌పై స్వయంగా రాసిన పాటను వినిపించారు. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. ‘ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. మళ్లెప్పుడొస్తావు రాజశేఖరన్నా.. ఏమైపోయావు రాజశేఖరన్నా.. మంచి మనసున్న రాజశేఖరన్నా.. చందమామ రూపున్న వాడా.. మా కుటుంబానికి ఆత్మీయ సోదరుడా’ అంటూ భావోద్వేగంతో పాట పాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆమె వద్దకు వచ్చి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని తను ఆశీనులైన కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన వారు కరతాళ ధ్వనులు చేస్తూ మనసారా నవ్వుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement