సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శ్రీశైలం నిర్వాసితులు... ఈ పదం వినగానే టక్కున గుర్తొచ్చేది 98 జీఓ. ఇంతగా జనంలోకి చొచ్చుకుపోయిన అంశమిది. మూడు దశాబ్దాలు గా శ్రీశైలం నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఉద్యమిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నా ఆ ఆశ కూడా అడియాసే అయింది. పాలకులు పట్టించుకోక, ప్రభుత్వాలు ఆదరించక శ్రీశైలం నిర్వాసితుల బతుకుల్లో వెలుగులు కానరాకుండా పోతున్నా యి.
స్వరాష్ట్రంలోనూ నిర్వాసితుల అంశం కొలిక్కిరాకపోవడం... ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ అంశంగా మారడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేత బీరం హర్షవర్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత జి.రాంభూపాల్‌రెడ్డి నిర్వాసితులకు అండగా పోరాటాలు చేయడం... తాజాగా తెలంగాణ నవనిర్మాణ వేదిక అధ్యక్షుడు మురళీధర్‌గుప్తా శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం కోసమే రానున్న ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ప్రకటించడం చర్చనీయాశమైంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ముంపు నిర్వాసితుల అంశం ఉమ్మడి జిల్లాలో ఎన్నికల అజెండాగా మారింది.
ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం
1981లో శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నదీ తీరంలోని 67 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి. 11 వేల కుటుంబాలకు చెందిన 27 వేల మందికి పైగా ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. బంగారం వంటి పంట పండే భూములు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోవడంతో రైతులు కూలీలుగా మారారు. కర్నూలు జిల్లాతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజవర్గాల్లోని గ్రామాలు నీటిముంపునకు గురయ్యాయి.
నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. జీఓ 98ను రూపొందించారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా రూ.17.90కోట్లు చెల్లించారు. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కోసం కేవలం రూ.2.90కోట్లు మాత్రం ఖర్చు చేశారు. నాటి నుంచి నేటివరకూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో కొందరికి ఉద్యోగాలు
జీఓ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 1992లో కొందరికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో అధికంగా కర్నూల్ జిల్లా వాసులకే అవకాశం దక్కింది. అర్హులైన వారు ఉద్యోగాల కోసం ధరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ఇప్పటివరకు 2,435 మంది నిర్వాసిత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు, ఉద్యోగ అర్హత లేనివారికి అదనపు పరిహారం చెల్లించాలని భావించారు. ఈ క్రమంలోనే ఆయన అకాల మరణం చెందారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 143 మంది నిర్వాసిత నిరుద్యోగులకు లష్కర్ పోస్టులను ఇచ్చారు. నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన కోసం జీఓ నెం 68ను రూపొందించారు. రాష్ట్రం విడిపోవడంతో ఈ అంశం అటకెక్కింది.
విభజన తర్వాత....
రాష్ట్ర విభజన జరిగితే తమకు ఉద్యోగాలు వస్తాయని శ్రీశైలం నిర్వాసితులు భావించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయాక కర్నూలు జిల్లాలోని నిర్వాసిత నిరుద్యోగలందరికీ అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జరగలేదు. దీంతో నిర్వాసితులు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో వంద రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు కూడా చేశారు. అప్పట్లో ప్రభుత్వం స్పందించగా.. మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలల తరబడి ఎదురుచూసిన ఆహామి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక, న్యాయబద్దమైన పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నిర్వాసితుల పక్షాన టీజేఏసీ, తెలంగాణ నవనిర్మాణ వేదిక, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీతో పాటు పలు రాజకీయ పార్టీలు నేటికీ పోరాటాలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు.
ఉద్యోగాలు కల్పించాలి
నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. వారి ఉద్యమంలో న్యాయం ఉంది. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వమే జీఓ ఇచ్చింది. ఆంధ్రా పాలకుల వివక్ష వైఖరి కారణంగా ఉద్యోగాల కల్పనలో ఆలస్యం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అంతా భావించారు. రాష్ట్రం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిన నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రతీ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలి. – మురళీధర్‌గుప్తా, తెలంగాణ నవనిర్మాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
నిర్వాసితులపై ఇంకా వివక్షే...
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులపై పాలక ప్రభుత్వాలు ఇంకా వివక్షత కొనసాగిస్తున్నాయి. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 98 జీఓ అమలులో మాత్రం వెనకంజ వేస్తోంది. ఏపీలో నిర్వాసిత నిరుద్యోగులందరికీ దాదాపుగా ఉద్యోగాలు ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ బతికి ఉంటే నిర్వాసితులందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని కేసీఆర్ కూడా ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నిర్వాసిత కుటుంబాలకు అదనపు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. – జి.రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment