శ్రీశైలం జలాలే కీలకం
- వాటర్‌గ్రిడ్ ద్వారా 3 జిల్లాలకు నీరు
- ఎల్లూరు లిఫ్ట్ నుంచే నీటితరలింపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వాటర్‌గ్రిడ్’ పథకానికి శ్రీశైలం జలాశయమే కీలకం కానుంది. రాష్ట్రంలోని దాదాపు నాలుగోవంతు మండలాలకు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచే తాగునీటిని పంపింగ్ చేయనున్నారు. రక్షితమంచినీటి జలాలు అందించేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజించారు. రెండు సెగ్మెంట్లకూ కృష్ణానది నీటిని పంపింగ్ చేసేలా డిజైన్లు రూపొందించారు.
అత్యంత కీలకమైన మొదటి సెగ్మెంటుకు మాత్రం శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నీటిని పంపింగ్ చేస్తారు. దీనిద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని 128 మండలాలు, ఎనిమిది మున్సిపాలిటీల్లో దాహార్తి తీరనుంది. తొలుత వాటర్‌గ్రిడ్ కోసం ఎల్లూరు కోతిగుండు వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించినా, ఆప్రతిపాదన విరమించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను తోడేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఉపయోగించనున్నారు.
వాటర్‌గ్రిడ్ మొదటి సెగ్మెంటుకు ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 13.11 టీఎంసీలను వినియోగిస్తారు. మహబూబ్‌నగర్‌కు 5.10, నల్లగొండకు 4.59, రంగారెడ్డికి 3.41టీఎంసీల చొప్పున తరలిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి (53.85 టీఎంసీలు) చేరినా వాటర్‌గ్రిడ్ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా డిజైన్ రూపొందించారు. పారిశ్రామిక అవసరాలనూ దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు.
కాగా, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తాగునీటిని పంప్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పథకం పూర్తిస్థాయిలో పనిచేయడం కష్టమేనన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌కు నీటిని తరలించడంపై స్థానికంగా నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పది శాతం మేర నీటిని తాగునీటికి వాడొచ్చనే నిబంధన మేరకే వాటర్‌గ్రిడ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.