నా శ్రమ వృథా కాలేదు | I could not care waste | Sakshi
Sakshi News home page

నా శ్రమ వృథా కాలేదు

Published Thu, Dec 11 2014 1:30 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

నా శ్రమ వృథా కాలేదు - Sakshi

నా శ్రమ వృథా కాలేదు

సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతటా వాటర్‌గ్రిడ్ పథకం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ల బృందంతో కలిసి బుధవారం బెజ్జంకి మండలం హన్మాజీపల్లికు వచ్చిన సీఎం సిద్దిపేటకు తాగునీరు సరఫరా చేస్తున్న ఇంటెక్ వెల్ కం పంప్‌హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వయంగా తాగునీటి సరఫరా పథకం నిర్మాణానికి తాను పడిన శ్రమ, దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలను అధికారులకు వివరించారు.
 
 ‘సిద్దిపేటకు నీళ్లందించే ఈ పథకం కోసం నేనెంతో కష్టడిన. రెండ్రోజులు సర్వే చేయించా. సాంకతిక అంశాలు మినహా ఈ పథకాన్ని డిజైన్ చేసింది కూడా నేనే. ఇక్కడికి రావడానికి అప్పుడు సరైన దారి కూడా లేదు. మనుషులే కాదు, పశువులు కూడా తిరగని అటవీ ప్రాంతమిది. ఇక్కడినుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకు గ్రావిటీ ద్వారా నీళ్లెట్ల తీసుకుపోవాల్నా అని ఆలోచించి ఒకరోజు అందరూ వద్దని చెప్పినా మొండిగా దగ్గర్లో ఉన్న గుట్టపైకి నడుచుకుంటూ పోయిన.
 
 అక్కడే రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్న. ఆరోజుల్లో ఇంత టెక్నాలజీ కూడా లేకుండే. ఇంటెక్‌వెల్ కం పంప్‌హౌస్, పైప్‌లైన్ల నిర్మాణానికి, గుట్టలపై రిజర్వాయర్ల ఏర్పాటుకు ఎంతో కష్టపడినం. అప్పటినుంచి 32 సార్లు ఈడికొచ్చిన. నాడు నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో తుపాకుల నడుమ వీటిని నిర్మించాల్సి వచ్చింది.
 
 
 పక్కనే ఉన్న మైలారంగుట్టపైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఎత్తున నిర్మించడమే దీని ప్రత్యేకత. ఆనాడు నేనుపడిన శ్రమ వృథా కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలోని 180 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నేటికీ నిరంతరాయంగా తాగునీటిని అందించగలుగుతున్నాం’ అని పేర్కొన్నారు. ఇంటెక్‌వెల్ కం పంప్‌హౌస్ నిర్మాణం గురించి వివరిస్తూ ‘డెడ్‌స్టోరేజీ లెవెల్‌లోనూ నీటిని సరఫరా చేసేలా పంప్‌హౌస్‌ను నిర్మించినం. కాలం కలిసిరాకపోయినా చివరి నీటి చుక్క వరకు పంపింగ్ చేసేలా తీర్చిదిద్దనం. దీనిని రోల్ మోడల్‌గా తీసుకుని వాటర్‌గ్రిడ్ పథకాన్ని మరింత సమర్ధవంతంగా రూపొందించండి. అందుకోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోండి. పంప్‌హౌస్‌కు వెళ్లే దారి కనీసం 15 అడుగుల వెడల్పు ఉండేలా చర్యలు తీసుకోండి. ఎందుకంటే పంప్‌హౌస్‌కు వినియోగించే మోటార్లు అత్యంత బరువైనవి. ఏదైనా రిపేర్ వస్తే క్రేన్ ద్వారా డీసీఎంలోకి మార్చాల్సి ఉంటుంది. ఆరోజు ఈ ఆలోచన రాకపోవడం వల్ల పంప్‌హౌస్‌కు వెళ్లే దారిని ఇరుకుగా నిర్మించినం. మోటార్లు రిపేర్‌కు వచ్చినప్పుడు వాటిని తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఇబ్బంది అవుతోంది’ అని పేర్కొన్నారు. అనంతరం తాగునీటి సరఫరా, సాంకేతిక అంశాల గురించి సిద్దిపేట గ్రామీణ నీటిసరఫరా డీఈ నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు.
 
 ఈ సందర్భంగా సీఎం వారిని ఉద్దేశించి ‘ఈ పథకంపై మీకు పూర్తి అవగాహన కలిగిందా?’ అని ప్రశ్నించారు. వారు లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేశారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, సీఎం సహాయ కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్పీ శివకుమార్, పలువురు నీటిపారదల ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.
 
 కేటీఆర్ మినహా మంత్రులంతా రాక
 సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని పరిశీలించేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు బుధవారం హన్మాజీపల్లికి వచ్చారు. ఉదయం 11.30 గంటలకు మంత్రుల బృందం అక్కడికి వచ్చింది. జిల్లా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మినహా మిగిలిన మంత్రుల బృందమంతా అక్కడికి వచ్చింది.  
 
 ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, జోగు రామన్నతోపాటు శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి వీరిలో ఉన్నారు. వీరంతా ఇంటెక్‌వెల్ కం పంప్‌హౌస్‌వద్దకు వెళ్లి పథకాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అందరూ కలిసి ఒకే బస్‌లో సిద్దిపేటకు వెళ్లిపోయారు. మంత్రుల బృందం వెళ్లిన ముప్పావు గంటకు ఈటెల రాజేందర్, సీఎంవో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో అక్కడికి వచ్చారు.
 
 సీఎం అసహనం
 ఉదయం 11.45 గంటలకు రావాల్సిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12.40గంటలకు హన్మాజీపల్లె చేరుకున్నారు. సీఎం హెలికాప్టర్ దిగిన వెంటనే అక్కడున్న టీఆర్‌ఎస్ మహిళా నాయకులు తోసుకువచ్చే ప్రయత్నం చేయగా వారిపై కసరుకున్నారు. ‘‘మీకు ఇక్కడేం పని. ఎందుకొచ్చారు? ఇది అధికారులకు సంబంధించిన కార్యక్రమమని తెలుసు కదా! అధికారుల కార్యక్రమానికి ఆటంకం కాదా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడికి ఇంజనీర్లు రాకపోవడంతో ‘‘చీఫ్ ఇంజనీర్లు యాడున్నరు?’’ అని పక్కనే ఉన్న వారిని అడిగారు. పంప్‌హౌస్ సమీపంలోని టెంట్ వద్ద ఉన్నారని అధికారులు బదులివ్వడంతో ‘‘ఆడ కూసుంటే ఎట్లా? ఈడికి వచ్చిన పని గుర్తులేదా? వెంటనే పిలవండి. పంప్‌హౌస్ దగ్గరకు ఎమ్మెల్యేలు, అధికారులు మినహా నాయకులను ఎవరినీ రానీయకండి’’ అని ఆదేశించారు.
 
 అధికారులపై రసమయి ఫైర్
 సాంస్కృతిక వారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అధికారులపై మండిపడ్డారు. ఇంటెక్ వెల్ కం పంప్‌హౌస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఒకరిద్దరు మంత్రులు ఫొటోలు ఉండటాన్ని గమనించిన బాలకిషన్ ‘‘మంత్రులందరూ ఇక్కడికి వస్తున్నారని మీకు తెలుసు కదా.. మిగిలిన మంత్రుల ఫొటోలు ఎందుకు పెట్టలేదు? ఇదేం పద్దతి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసేపు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement