‘మిషన్‌భగీరథ’కు సిద్ధమవుతున్న పైపులు
నాగపూర్ సమీపంలో పైపుల తయారీ కేంద్రం
గోపాల్‌పేట : ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటిని అందించాలని సీఎం కేసీఆర్ మిషన్‌భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇందుకోసం అ వసరమైన పైపులను ఆయా జిల్లాల్లోనే తయారు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 55 మండలాలకు అతిపెద్ద ఎంఎస్(ఐరన్) పైపులు అందించడానికి గోపాల్‌పేట మండలం నాగపూర్ గ్రామ సమీపంలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇఫ్ప్రాస్ట్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 27ఎకరాల విస్తీర్ణంలో పైపుల తయారీకి కావాల్సిన మిషనరీలు, పరికరాలను ఏర్పాటు చేశారు. 6మీటర్ల పొడువు, 2.33 డయా కలిగిన ఎంఎస్(ఐరన్) పైపులను తయారు చేస్తున్నారు.
నిత్యం 100 పైపుల తయారీ
2యూనిట్లతో నిత్యం 100 పైపుల వరకు తయారు చేస్తున్నారు. తయారు చేసిన పైపులకు బయట సిమెంట్ కోటింగ్, లోపల పెయింట్ కోటింగ్ వేస్తున్నారు. ఈ పైపులను తయారు చేసే పనుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. ఈ కంపెనీ వారు కడ్తాల్‌లో కూడా పైపులు తయారు చేస్తున్నారు. మిగితా 9 మండలాలకు ఐహెచ్‌పీ కంపెనీ బాధ్యతలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా 356 కిలో మీటర్ల మేరకు ప్రధాన లైనుకు ఎంఎస్ పైపులు, దీనికి డిస్ట్రిబ్యూటర్ లైన్‌కు 4200 కిలోమీటర్లు హెచ్‌డీపీ పైపులు, 1856 కిలోమీటర్లు వరకు డీఐ పైపులు బిగించనున్నారు. ఒక కిలో మీటర్‌కు 6మీటర్ల పైపులు సుమారు 167 అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు రిజర్వాయర్ నుంచి పంపింగ్ ద్వారా గౌరిదేవిపల్లికి నీటిని తీసుకొచ్చి ఇక్కడి నుంచి గుడిపల్లి గట్టుకు పంపింగ్ ద్వారా ఎక్కిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా రెండు వేర్వేరు లైన్ల ద్వారా నీటిని ముందుకు తీసుకెళ్తారు. జిల్లాలో 118 ఓహెచ్‌పీఆర్ సంపులు నిర్మించనున్నారు. 8 చోట్ల ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఓహెచ్‌పీఆర్ సంపుల నుంచి గ్రామాల్లో ఓహెచ్‌ఆర్ ట్యాంకులకు తాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. రెండేళ్లలో పూర్తి చేయడం కోసం మోగా కంపెనీ వారు ప్రస్తుతం నాగపూర్, కడ్తాల్‌లో పైపుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారని, మరో నాలుగు చోట్ల తయారు చేస్తున్నట్లు పథకం చీప్ ఇంజనీరు కృపాకర్‌రెడ్డి తెలిపారు.