వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేయనున్న ఓఆర్‌ఆర్ మ్యాప్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) చుట్టూ జలవలయం లా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 158 కిలోమీటర్ల మార్గంలో విస్తరించిన ఓఆర్‌ఆర్ చుట్టూ రూ.3 వేల కోట్లతో ఈ వాటర్‌గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం 3,000 ఎంఎం డయా వ్యాసార్థంగల మైల్డ్ స్టీల్‌తో సిద్ధం చేసిన భారీ మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమా యత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నీటిని నగరం నలుచెరగులా సరఫరా చేసేం దుకు వీలుగా ఈ గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఈ జలవలయం పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మరో మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధంచేసి పనులు మొదలుపెట్టే దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది.
భారీ జలవలయం.. దాహార్తి దూరం..
హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీతోపాటు.. ఔటర్‌కు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, నూతనంగా ఏర్పాటుకానున్న టౌన్ షిప్‌లు, కాలనీలకు 24 గంటలు తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతీ వ్యక్తికి తలసరిగా నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటాడైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది.
ఏ మూలకైనా తరలించేలా..
ఈ నీటిని ఔటర్ లోపల ఏ మూలకైనా తరలించే అవకాశం ఉంది. ఈ గ్రిడ్ వ్యవస్థతో జల మండలి పరిధిలోని 500 స్టోరేజీ రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా జలాశయాల నుంచి వచ్చే నీరు పంపింగ్ అంతగా అవసరం లేకుం డా గ్రావిటీ(భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నేరుగా గ్రిడ్ పైప్‌లైన్‌లోకి చేరేలా నేలవాలు అధికంగా ఉండే చోటనే అనుసంధానించనుండటం విశేషం. ఈ వాటర్‌గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమలులో ఉంది. ఆయా నగరాల అనుభవాలను కూడా పరిశీలించిన తర్వాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.
7 చోట్ల వాటర్‌గ్రిడ్ జంక్షన్లు..
కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాల నీటిని ఈ వాటర్‌గ్రిడ్ భారీ పైప్‌లైన్‌కు అనుసంధానించేందుకు ఔటర్ చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్‌చెరు వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైప్‌లైన్‌కు అనుసంధానించనున్నారు. శామీర్‌పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్ నీటిని కిస్మత్‌పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మనాగారం(చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్‌పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment