Krishna River
-
శ్రీశైలం, సాగర్ గేట్లు మళ్లీ ఎత్తివేత
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: ఎగువన విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రేడియల్ క్రస్ట్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల, సుంకేసుల నుంచి 1,26,428 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 3 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 99,064 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలో 589.40 (310.2522టీఎంసీలు) అడుగులకు చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు 4 రేడియల్ క్రస్ట్‌గేట్లు, 8 గంటలకు 6 గేట్లు 5 అడుగులు ఎత్తి 48,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదనతో కలిసి సాగర్ వద్ద నదిలోకి 84,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి సాయంత్రం 6 గంటలకు 18,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 15,847 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,220 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,35,132 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,15,664 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
హంద్రీనీవా, గాలేరునగరి విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాలను పరీవాహక ప్రాంతం బయటకు తరలించేలా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని తెలంగాణ ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కృష్ణాజలాలపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా కృష్ణానదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్రప్రతాప్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఆయా ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పర్యావరణ మదింç³# అథారిటీలకు కూడా విడివిడిగా రాసిన లేఖలో్లనూ విస్తరణ ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావరణ అనుమతి(ఈసీ) అమలు కాకుండా నిలిపివేయాలని కోరారు. ఈ విస్తరణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని పలుమార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 ఆగస్టు 26న గాలేరునగరి నుంచి హంద్రీనీవాకు నీటితరలింపు నిమిత్తం రూ.5,036 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించిందని వివరించారు. గాలేరునగరి కాలువ 56 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న చెరువులకు 15.53 టీఎంసీల కృష్ణాజలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ వివరాలివ్వండి ప్లీజ్ శ్రీశైలం–నాగార్జునసాగర్ రూల్‌కర్వ్ ముసాయిదా రూపొందించడానికి ప్రమాణాలేంటీ, ఏ ప్రాతిపదికన రూల్‌కర్వ్ సిద్ధం చేశారో ఆధారాల్విండంటూ మరో లేఖను ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాశారు. దీనిపై కేఆర్ఎంబీ స్పందిస్తూ ‘కేఆర్ఎంబీకి సహకరించండి. తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వి వాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించడానికే సమావేశం ఏర్పాటు చేశాం’అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ లేఖపై స్పందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ స్టేక్ హోల్డర్ కావడం వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నదని జల వనరుల సంఘం, ప్రణాళిక సంఘం శ్రీశైలం ప్రాజెక్టును ఆమోదించిన పత్రాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు మురళీధర్‌రావు కోరారు. 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం, శ్రీశైలం కుడి కాల్వతోపాటు పోతిరెడ్డిపాడుకు కేంద్రం అను మ తి జారీచేసిన పత్రాలు ఇవ్వాలని కోరు తున్నా మ న్నారు. రూల్‌కర్వ్ ఎలానిర్ణయించారో తెలుసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
శ్రీశైలంలో 199.27 టీఎంసీల నిల్వ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, తుంగభద్ర వరద జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న నీరు తోడవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు సుంకేశుల బ్యారేజ్ నుంచి 1,28,985 క్యూసెక్కులు, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న 44,047 క్యూసెక్కులకు హంద్రీ నుంచి వస్తున్న 250 క్యూసెక్కులు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,73,282 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుద్పత్తి చేస్తూ దిగువకు 63,885 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 882.1 అడుగుల్లో 199.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహం తోవడంతో సాగర్‌లోకి 67,722 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు 9,351 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 560.4 అడుగుల్లో 233.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌కు దిగువన మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. వాటికి పాలేరు, మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 22,955 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇందులో కృష్ణా డెల్టాకు 12,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 10,924 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి స్థిరంగా వరద కొనసాగుతుండటం, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో గురువారమూ శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగనుంది. ఇక పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,76,712 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 10,100 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,66,612 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం.. రెండు రోజుల్లో ఫుల్
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,32,164 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 877.6 అడుగులకు చేరింది. నీటి నిల్వ 176.33 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 39 టీఎంసీలు అవసరం. శనివారంనాటికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 78,314 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,26,405 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోకి శుక్రవారం కూడా 2 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ప్రవాహం కొనసాగనుంది. సాగర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4,588 క్యూసెక్కులు వస్తోంది. పులిచింతలకు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజిలోకి 16,192 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,991 క్యూసెక్కులు, సముద్రంలోకి 7,201 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి -
3 రోజుల్లో శ్రీశైలం ఫుల్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, దాని ఉప నదుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమ యానికి జలాశయంలో నీటి నిల్వ 134.95 టీఎంసీలకు చేరింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షా లు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో స్థిరంగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లతోపాటు తుంగభద్ర డ్యామ్ నుంచీ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 1.75 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1.60 లక్షల క్యూసెక్కులు కలిపి.. మూడు లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో వేగంగా నిండుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండేందుకు ఇంకా 80 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటంతో మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండి, గేట్లెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 31వేలకు పైగా క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మరో 2,400 క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. భద్రాచలం వద్ద తగ్గిన వరద ఎగువన వానలు నిలిచిపోయి, నీటి చేరిక తగ్గిపోవడంతో గోదావరి శాంతించింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రవాహం 15,96,899 క్యూసెక్కులకు, నీటి మట్టం 56.1 అడుగులకు తగ్గింది. వరద 53 అడుగులకన్నా తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. ఎగువన వర్షాలు లేకపోతే మరో మూడు రోజుల్లో వరద ఉధృతి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గోదావరిలో ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 96 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లికి ప్రవాహం 69,487 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాణహిత, ఇంద్రావతి ఇతర నదుల్లో ఇంకా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మి బ్యారేజీకి 6,06,240 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీకి 11,06,400 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీకి 15,48,608 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వరద కాల్వ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 3,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
కృష్ణా జలాలు.. ఫిఫ్టీ ఫిఫ్టీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను తాత్కాలికంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) రూపకల్పన చేసే నిబంధనల్లో ఇదే దామాషాను కొనసాగించడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరిగేలా కేఆర్ఎంబీ నిబంధనలను సవరించాలని స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య జల పంపకాలు జరగాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ఈ నెల 18న కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణకు కేఆర్ఎంబీ రూపొందించిన పలు నిబంధనలను కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుకు అనుగుణంగా సవరించాలని ఈ లేఖలో తెలంగాణ కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగునీటిని తీసుకోవడానికి 830 అడుగుల కనీస నీటి మట్టం ఉండాలని కృష్ణా ట్రిబ్యునల్–1 స్పష్టం చేసిందని, కేఆర్ఎంబీ నిబంధనల్లో సైతం 854 అడుగుల నుంచి 830 అడుగులకు మార్చాలని సూచించింది. లేఖలో పేర్కొన్న అంశాలివీ.. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీలను.. నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా నదిలోకి తరలిస్తామని, అందులో 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలకు, మిగిలిన 45 టీఎంసీలను నాగార్జునసాగర్ ఎగువ ప్రాంత అవసరాలకు వాడుకుంటామని అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ ముందు అంగీకారం తెలిపింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలకు ఈ 45 టీఎంసీలు అదనం. గోదా వరి జలాల మళ్లింపు ఆధారంగా ఉమ్మడి ఏపీ గతంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. అందువల్ల ఈ 45 టీంఎసీలను క్యారీ ఓవర్‌గా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు అనుమతించరాదు. దీంతో తెలంగాణ 45 టీఎంసీలను కోల్పోతుంది. కృష్ణా నదిలోని ఫ్రీ సప్లైయిస్ నుంచి 72.2 టీఎంసీల కృష్ణా డెల్టా ఆయకట్టు డిమాండ్‌ను తీర్చా లని కృష్ణా ట్రిబ్యునల్–1 పేర్కొనగా, నాగార్జునసాగర్ నుంచి కేటాయించడం సరికాదు. ఈ కేటాయింపులను సవరించాలి. కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీల అవసరాలు ఉండగా, 181.2 టీఎంసీల లభ్యత ఉంది. నాగార్జునసాగర్ దిగువన ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి 101.2 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపు ద్వారా 80 టీఎంసీల లభ్యత ఉంది. కృష్ణా డెల్టాలో అదనంగా ఉన్న 29 టీఎంసీల లభ్యతను నాగార్జునసాగర్ కుడి కాల్వకు కేటాయించాలి. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని క్లాజ్–7 ఆధారంగా నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు 5.7 టీఎంసీల తాగునీటి కేటాయింపులు చేయాలి. శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల జలాల లభ్యత ఉందని కేఆర్ఎంబీ రూల్స్‌లో పేర్కొంది. నాగార్జునసాగర్, హైదరాబాద్ తాగునీరు, చెన్నైకి సరఫరా, ఎస్‌ఆర్‌బీసీలకు కలిపి మొత్తం 300 టీఎంసీలు పోగా, మిగి లే 282.5 టీఎంసీల నుంచి తెలంగాణలోని ఎస్ఎల్బీకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోత లకు 40 టీఎంసీలు, నెట్టేంపాడు ఎత్తిపోతలకు 25.4 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికు 90 టీఎం సీలు, డిండికి 30 టీఎంసీలు కేటాయించాలి. -
CM KCR : అనుక్షణం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, దీంతో తెలంగాణలోకి వరద ఉధృతి పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాలకు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు అధికారులను పంపించాలని ఆదేశించారు. ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరదల మూలంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంతో పాటు దుస్తులు, భోజన వసతి సమకూర్చాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా మరిన్ని హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెప్పించాలని సూచించారు. భారీ వర్షాలు, కృష్ణా, గోదావరి వరద పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉదయం కూడా వరదలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. మహాబలేశ్వరంలో 70 సెం.మీ. వర్షపాతం సమీక్ష సందర్భంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో నమోదవుతున్న వర్షపాతం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం మొదలుకుని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజీల్లో వరద పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు. కృష్ణా నది ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితిని కూడా వివరించారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని విభాగాలు సన్నద్ధంగా ఉండాలి ‘కృష్ణా నదీ ప్రవాహం పెరిగే అవకాశమున్నందున నాగార్జునసాగర్ కేంద్రంగా పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులను పంపించాలి. గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అగస్టు పదో తేదీదాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. శుక్ర, శనివారాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నీటిపారుదల, విద్యుత్, పోలీసు విభాగాలు సన్నద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడంతో పాటు, రిజర్వాయర్ల నుంచి నీటిని నెమ్మదిగా వదలాలి. రోడ్లు, భవనాల శాఖ వంతెనలు, రోడ్లను పరిశీలీస్తూ ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలి. మూసీ వరద కూడా పెరిగే అవకాశం మూసీ నది వరద ఉధృతి కూడా పెరిగే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారిపై హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలి. తక్షణమే శాశ్వత వరద నిర్వహణ బృందం వరదల సందర్భంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గతంలో వరద పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ఏడెనిమిది మంది అధికారులతో కూడిన వరద నిర్వహణ (ఫ్లడ్ మేనేజ్మెంట్) బృందాన్ని శాశ్వతంగా తక్షణమే ఏర్పాటు చేయాలి. పునరావాస క్యాంపుల నిర్వహణపై అవగాహన ఉన్న అధికారిని ఈ బృందంలో సభ్యుడిగా నియమించాలి. ఆర్మీ, పోలీసు, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థల సమన్వయం కోసం ఒకరిని నియమించాలి. వైద్యం, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల సమన్వయం కోసం ఒకరు, జీఏడీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖల సమన్వయం కోసం మరొక అధికారిని ఈ బృందంలో చేర్చాలి..’అని సీఎం ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ‘ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలి. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తక్షణమే పరిస్థితిని పర్యవేక్షించాలి. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీట మునిగింది. సీఎస్ అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలి. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. రానున్న రెండురోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు..’అని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎం కార్యాలయ ఓఎస్డీలు శ్రీధర్ దేశ్‌పాండే, ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయండి: సీఎస్ ఉదయం సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్షాలు, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. -
ఆ ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులు చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోవాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టు పనులను తక్షణం నిలిపివేయాలని ఇరు రాష్ట్రాలను కృష్ణా బోర్డు ఆదేశించింది. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగరీథ, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) పనులను ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కృష్ణా బోర్డు ఆదేశించింది. ఆ ప్రాజెక్టుల పనులపై ముందుకెళ్లొద్దని ఆదేశిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌కు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డుకు ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను పంపి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను తరలించడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోందని, వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని గతేడాది మే 14న ఏపీ జలవనరుల శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో ఆ 8 ప్రాజెక్టులను ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను మే 30న బోర్డు ఆదేశించింది. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించారు. ఆ 8 ప్రాజెక్టులను ఆపేయాలని మరోసారి సూచించారు. అయినప్పటికీ ఆ పనులను కొనసాగిస్తుండటంపై గత నెల 30న కృష్ణా బోర్డు దృష్టికి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు, తక్షణమే ఆ 8 ప్రాజెక్టుల పనులను ఆపేయాలంటూ తెలంగాణ సర్కార్‌ను తాజాగా ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లు, కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దెలచెర్వు ఎత్తిపోతల పనులను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్యులు హరికేశ్ మీనా మంగళవారం లేఖ రాశారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల్లో భాగంగా తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ, సోమరవాండ్లపల్లిల వద్ద నిర్మించే రిజర్వాయర్లను నింపడంతోపాటు ఎగువ పెన్నార్ జలాశయాన్ని నింపి ఆయకట్టుకు నీళ్లందించే పనులను ఏపీ అనుమతి లేకుండా చేపట్టిందని డిసెంబర్ 19న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు ఆ 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఏపీకి సూచించింది. -
న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు
వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు భారీగా నీరు సముద్రంలో కలుస్తోంది. అలాంటప్పుడు వాడుకునే నీటికి లెక్కలు కట్టడం భావ్యం కాదు. వృథాగా పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చనేదే మా విధానం. – రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు శాస్త్రీయంగా కేటాయించాలని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు వెలువడే వరకు 2015లో జూన్ 18, 19న రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేయనుంది. పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2014 జూన్ 2 నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను (ఆంధ్రప్రదేశ్ 776, తెలంగాణ 650 టీఎంసీలు) పంపిణీ చేయాలని తెగేసి చెప్పాలని నిర్ణయించింది. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటా విషయంలో తెలంగాణ లేవనెత్తే అభ్యంతరాలను సాక్ష్యాధారాలతో కొట్టిపారేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఆ నీటిని కేటాయిస్తే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. పూటకో మాట.. రోజుకో విధానమా? ► కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో మాట.. రోజుకో విధానం అనుసరిస్తుండటాన్ని అపెక్స్ కౌన్సిల్లో ఎండగట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకునేందుకు అంగీకరిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల అప్పటి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషిలు సంతకం చేసిన అంశాన్ని ఎత్తిచూపాలని నిర్ణయించింది. ► కేడబ్ల్యూడీటీ–2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాల్లో కేటాయించిన 197.50 టీఎంసీలను విభజన చట్టంలో షెడ్యూలు 11లో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గుంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు.. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. ► శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు పూర్తిగా నిండి.. గేట్లు ఎత్తేసిన సమయంలో.. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తగ్గించడానికి రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరనుంది. ► కేడబ్ల్యూడీటీ–1 నాలుగింట మూడొంతుల నీటి లభ్యత (75 శాతం) ఆధారంగా కృష్ణా నదిలో 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 పరిరక్షిస్తూనే.. మూడింట రెండొంతుల (66.66 శాతం) లభ్యత.. 75 శాతం నీటి లభ్యత మధ్య మిగిలిన 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలు (పునరుత్పత్తితో 197.50 టీఎంసీలు) కేటాయించింది. ఈ జలాలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను కోరనుంది. విభజన రోజు ఆధారంగా గోదావరి జలాల పంపిణీ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,360 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని.. పునరుత్పత్తితో కలిపి 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని 2004లో వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. ► 1970–71 నుంచి 2017–18 వరకు పోలవరం వద్ద 3,007 టీఎంసీల మిగులు జలాలు, 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,948 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని వ్యాప్కోస్ లెక్క కట్టింది. ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా జలాల్లో 1,400 టీఎంసీలను వినియోగించుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో మిగులు జలాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వినియోగించుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అపెక్స్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. -
విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు
-
కృష్ణా, గోదావరి డెల్టా కాలువల ప్రక్షాళన
సాక్షి, అమరావతి: కాలుష్య కాసారాలుగా మారుతున్న కృష్ణా, గోదావరి డెల్టా కాలువల ప్రక్షాళన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డెల్టా కాలువల్లో కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తోందన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన కృష్ణా, గోదావరి డెల్టా కాలువల్లో కాలుష్య నివారణపై జలవనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ కోసం పని చేస్తున్న సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు. మొదటి దశలో మురుగు నీటిని కాలువల్లో వదులుతున్న ప్రదేశాలను గుర్తించాలని, రెండో దశలో మురుగు నీటిని శుద్ధి చేశాకే కాలువల్లోకి వదలిపెట్టాలని, మూడో దశలో సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్దేశించారు. ఇందుకోసం కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ మిషన్‌కు తానే చైర్మన్‌గా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. జీడబ్ల్యూఎస్ సహకారం కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసిన గండిపేట వెల్ఫేర్ సొసైటీ (జీడబ్ల్యూఎస్) ప్రతినిధులను సమావేశంలో సీఎం అధికారులకు పరిచయం చేశారు. కృష్ణా, గోదావరి డెల్టా కాలువల్లో కాలుష్య నియంత్రణ చర్యలకు ఈ సంస్థ సహకారం తీసుకోవాలని సూచించారు. కేరళలోని కన్నూర్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం జీడబ్ల్యూఎస్ చేపట్టిన చర్యలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఆ సంస్థ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అదే తరహాలో ఈ సంస్థ సహకారంతో కృష్ణా, గోదావరి డెల్టా కాలువల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్‌కు జీడబ్ల్యూఎస్ ప్రతినిధి రాజశ్రీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలోని నాలుగు కిలోమీటర్ల పొడవున కృష్టా డెల్టా కాలువను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. -
వరద పోటెత్తడంతో తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు
సాక్షి, విజయవాడ: కృష్ణవేణి ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నదీమతల్లి.. నీటి చెమ్మ దొరకగా అల్లాడిన మాగాణులను సస్యశ్యామలం చేస్తూ బిరబిరా సముద్రుడి చెంతకు పరుగులు పెడుతోంది. పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో బ్యారేజ్ 70 గేట్లు తొమ్మిదడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కరకట్ట ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అలాగే తోట్లవల్లూరు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరోవైపు సాగర సంగమం వద్ద సముద్రపు పోటు ఉండటంతో హంసలదీవిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నీట మునిగిన కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం పుష్కరఘాట్ శివాలయం కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం ఉదయం 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా రాత్రి అయ్యే సరికి 5 లక్షల క్యూసెక్కులకు చేరింది. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. బ్యారేజ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం.. ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచారు. ఆపై పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు 5.16 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే.. బ్యారేజ్ 70 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి 5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి.. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. రాత్రంగా ఇదే ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. 46.5 టీఎంసీలు సముద్రంలోకి... ఈ సీజన్లో ఇప్పటి వరకు 46.5 టీఎంసీ వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ గుండా సముద్రంలోకి చేరాయి. గురువారం కూడా వరద నీటి ఉధృతి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కరకట్ట దిగువన కృష్ణానది వైపు ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా తోట్లవల్లూరు మండలం పరిధిలోని పలు అరటి, బొప్పాయి తోటలు నీటిలో నానుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు.. ముంపునకు గురైన పాములలంకకు పడవలో వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్ విజయవాడ కృష్ణలంక రణదీవె నగర్, భూపేష్‌నగర్ గుప్తా, తారాకరామానగర్, బాలాజీనగర్, రామలింగేశ్వరనగర్‌లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక్కడి నివాసులను అధికారులు రాణిగారితోట, కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్, భ్రమరాంబపురంలో ఎస్వీ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలంటూ మైక్‌లలో ప్రచారం చేస్తున్నారు. పేదలు సురక్షిత ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి ఇళ్లలోని వస్తువులు దొంగల పాలు కాకుండా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న తోట్లవల్లూరు ప్రాంతంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దశాబ్దకాలం తర్వాత.. దశాబ్దకాలంగా కృష్ణానదికి వరద నీరు సరిగా రావడం లేదు. 2009లో 10.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలారు. ఆ తర్వాత ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వదలడం ఇదే తొలిసారి. ఏళ్లుగా సముద్రంలోకి వరద నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో సముద్రం గర్భంలో నుంచి ఉప్పునీరు తోసుకువస్తోంది. దీంతో బందరుతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైనుంచి వస్తున్న వరద నీటిని సముద్రంలోకి చేరుతుండటంతో ఉప్పునీటి విస్తరణ తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద పరిస్థితి -
ఉగ్ర స్వరూపిణి కృష్ణమ్మ
-
కృష్ణమ్మ పరవళ్లతో అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: కృష్ణమ్మ పరవళ్లతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కృష్ణమ్మ గలగల..
సాక్షి, కడప : అనుకున్న సమయం కంటే ముందే కృష్ణా జలాలు జిల్లాకు ముందుగానే చేరా యి. ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఇది సాధ్యపడింది. శుక్రవారం తెల్లవారుజామున 4.00 గంటల ప్రాంతంలో జిల్లా సరిహద్దులోని రా జోలి ఆనకట్టకు నీరు చేరింది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి మూడు వేల క్యూసెక్కుల నీరు చేరింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి కేసీ కెనాల్ అధికారులు పూజలు చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మైదుకూరు ప్రధాన కాలువకు 600 క్యూసెక్కులు, మిగిలిన నీటిని కుందూ నదిలోకి విడుదల చేశారు. శని వారం సాయంత్రానికి కృష్ణా జలాలు ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు చేరనున్నాయి. రోజురోజుకు నీటి విడుదల పెరగనుండడంతో కేసీ పరిధిలోని అన్ని కాలువలకు విడుదల చేయనున్నారు. జిల్లాకు కృష్ణా జలాలు చేరడం పట్ల కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఎంతో ఊరట.. కేసీ పరిధిలో కడప, కర్నూలు జిల్లాల పరిధిలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది..మనజిల్లా పరిధిలో 92 వేల ఎకరాలు అధికార ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్ నీటితో అనధికారికంగా మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు చేరే పరిస్థితి ఉంది. దీంతోపాటుగా భూగర్బ జలాలు పెరిగి బోరు బావుల్లో పుష్కలంగా నీరు అందుబాటులోకి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఎగువన వరద కొనసాగుతుండడంతో ఈ ఏడాది పది టీఎంసీల నీటిని కేసీకి తరలించే అవకాశం ఉంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి ఎగువన వర్షాలు కురిసి జిల్లాకు కృష్ణా జలాలు చేరడం ఉపశమనంగా మారింది. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుండి శుక్రవారం సైతం దాదాపు ఏడు వేల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. నాలుగు రోజులుగా రోజురోజుకు నీటి విడుదల పెరగడంతో అధికారులు అనుకున్న సమయం కంటే కృష్ణా జలాలు జిల్లాలో అడుగు పెట్టాయి. ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలంకు వరద కొనసాగుతోంది. పోతిరెడ్డిపాడు నుండి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, అంతే స్థాయిలో నీటిని బనకచర్ల హెడ్ రెగ్యులర్ నుండి వైఎస్సార్ కడపజిల్లాలోని నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రధానంగా కేసీ కెనాల్తోపాటు తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేశారు. పది రోజుల్లో గాలేరు–నగరి ద్వారా గండికోటతోపాటు తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం కృష్ణా జలాలు రానున్నాయి. ఇవి త్వరితగతిన చేరుతుండడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంకు 193 టీఎంసీల నీరు ఎగువ నుండి 3,42,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 193.67 టీఎంసీల (891 అడుగులు) నీరు చేరింది. రాజోలి నాడు.. గతేడాది ఆగస్టు 11న రాజోలిలో అడుగంటిన నీటి ప్రవాహం శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కేసీ రైతాంగ సాగునీటి ప్రదాయిని రాజోలి వద్ద ప్రవహిస్తోంది. గతేడాది ఇదే నెలలో వెలవెలబోయిన రాజోలి ఆనకట్టలో నేడు కృష్ణా జలాలు పారుతున్నాయి. శుక్రవారం రాజోలి వద్ద కుందూనదిలో 2500 క్యూసెక్కులు, మైదుకూరు కేసీ ప్రధాన కాలువలోకి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1.45లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రాజోలి వద్ద జలకళ సంతరించుకోవటంతో యావత్ రైతాంగం హర్షిస్తోంది. – చాపాడు -
ఈ నెల 7వరకు కృష్ణమ్మ శుద్ది
-
ఆ నీటి మడుగున ఏముంది..?
సాక్షి, కృష్ణా (మాగనూర్): మండల పరిధిలోని ముడుమాల్, పుంజనూర్ గ్రామాల మధ్యన ఉన్న కృష్ణానదిలో దాదాపు కిలోమీటర్ పొడవునా ఓ సొరంగంలా నీటి మడుగు కలదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ నీటి మడుగు ఉందని, దీని దిగువన కూడ రాతి బండనే ఉందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఈ నీటి మడుగు దాదాపు 50 అడుగుల లోతు వరకు ఉందని, నీటి దిగువన ఓ ఆంజనేయస్వామి ఆలయం, బంగారు రథం ఉందని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. ఈ నీటి మడుగు బయటకు ఎప్పుడు కన్పించదు. కానీ దీని దిగువకు కూడ ఎవ్వరుకూడ వెళ్లడానికి ప్రయత్నించలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో ఈ మడుగు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ మడుగుతో వరి పంటలకు, పశువులకు తాగునీటికి వరప్రదాయి అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి మడుగులో ఏముందో తెలుసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్థానికులు కోరతున్నారు. -
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించే ప్రతిపాదనపైనా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దృష్టి పెట్టింది. గతంలో ప్రతిపాదించిన మాదిరి ఇచ్చంపల్లి వద్ద భారీ రిజర్వాయర్ కాకుండా చిన్న రిజర్వాయర్ నిర్మించి మిగులు జలాలను తరలించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జానంపేట, అకినేపల్లి ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. పాతదే.. మళ్లీ కొత్తగా.. దక్షిణాది నదుల కోసం ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకాన్ని చేపట్టిన కేంద్రం... అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014లోనే మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానానికి 299 కి.మీ. మేర నీటి తరలింపు ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరమవుతాయని, ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కే రూ. 14,636 కోట్లు అవసరమని లెక్కగట్టింది. 312 కి.మీ. పొడవైన ఇచ్చంపల్లి–పులిచింతలకు సైతం భారీ అంచనా వ్యయాలనే ప్రతిపాదించారు. ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు. మరో 51 వేల ఎకరాల అటవీ, 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉందని గతంలో తేల్చారు. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో ఇది మూలన పడింది. దీనికి బదులుగా ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీలు సాగర్‌కు, అటు నుంచి కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపైనా తెలంగాణ వ్యతిరేకత చూపడంతో ఇదే జిల్లాలో జానంపేట నుంచి పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించింది. అయితే దీని ద్వారా సైతం తమకు ఒనగూరే ప్రయోజనం లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇక్కడ చిన్న రిజర్వాయర్ నిర్మించి ఆ నీటిని పెద్దవాగు రిజర్వాయర్, తమ్మలగుట్ట రిజర్వాయర్ల మీదుగా తరలించి సూర్యాపేట వద్ద గల మూసీతో కలపాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటు నుంచి సాగర్ ఎడమ గట్టు కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీరందిస్తూ గోదావరి నీటిని సాగర్‌కు తరలించేలా ఈ కొత్త ప్రతిపాదన ఉంది. నీటిని పూర్తిగా పైప్‌లైన్ ద్వారా తరలిస్తేనే మేలన్న అభిప్రాయం ఉంది. ఇలా అయితే సాగర్ కింద కృష్ణా నీటి అవసరాలను తగ్గించవచ్చని, డిండిలో భాగంగా ఉన్న గొట్టిముక్కుల రిజర్వాయర్‌కు సైతం గోదావరి నీటిని తరలించే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నీటితో ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలైన చుండూర్, పెద్దఊర, గుర్రంపాడు, నార్కట్‌పల్లి ప్రాంతాలకు నీటిని అందించవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఇది వీలుకాకుంటే ఇప్పటికే నిర్మిస్తున్న తుపాకులగూడెం నుంచి మూసీకి, అటు నుంచి సాగర్‌కు తరలించేలా మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన సైతం ఉంది. అయితే ఇందులో ఈ ప్రతిపాదనను తెలంగాణ ఆమోదిస్తుందన్నది తెలియాల్సి ఉంది. -
ఔటర్ చుట్టూ జలహారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టూ జలవలయం లా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 158 కిలోమీటర్ల మార్గంలో విస్తరించిన ఓఆర్ఆర్ చుట్టూ రూ.3 వేల కోట్లతో ఈ వాటర్‌గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం 3,000 ఎంఎం డయా వ్యాసార్థంగల మైల్డ్ స్టీల్‌తో సిద్ధం చేసిన భారీ మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమా యత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నీటిని నగరం నలుచెరగులా సరఫరా చేసేం దుకు వీలుగా ఈ గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఈ జలవలయం పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మరో మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధంచేసి పనులు మొదలుపెట్టే దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది. భారీ జలవలయం.. దాహార్తి దూరం.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీతోపాటు.. ఔటర్‌కు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, నూతనంగా ఏర్పాటుకానున్న టౌన్ షిప్‌లు, కాలనీలకు 24 గంటలు తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతీ వ్యక్తికి తలసరిగా నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటాడైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది. ఏ మూలకైనా తరలించేలా.. ఈ నీటిని ఔటర్ లోపల ఏ మూలకైనా తరలించే అవకాశం ఉంది. ఈ గ్రిడ్ వ్యవస్థతో జల మండలి పరిధిలోని 500 స్టోరేజీ రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా జలాశయాల నుంచి వచ్చే నీరు పంపింగ్ అంతగా అవసరం లేకుం డా గ్రావిటీ(భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నేరుగా గ్రిడ్ పైప్లైన్లోకి చేరేలా నేలవాలు అధికంగా ఉండే చోటనే అనుసంధానించనుండటం విశేషం. ఈ వాటర్‌గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమలులో ఉంది. ఆయా నగరాల అనుభవాలను కూడా పరిశీలించిన తర్వాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. 7 చోట్ల వాటర్‌గ్రిడ్ జంక్షన్లు.. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాల నీటిని ఈ వాటర్‌గ్రిడ్ భారీ పైప్‌లైన్‌కు అనుసంధానించేందుకు ఔటర్ చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్చెరు వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైప్‌లైన్‌కు అనుసంధానించనున్నారు. శామీర్‌పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్ నీటిని కిస్మత్పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మనాగారం(చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. -
కృష్ణాలో అడిగినంత నీరు ఇవ్వలేం..
- ఏపీకి తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. కృష్ణా జలాల విషయంలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో ఏపీకి నీటి విడుదల చేయడం అంత సమంజసం కాదని తేల్చి చెబుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా శ్రీశైలం నుంచి సుమారు ఆరు టీఎంసీలు నీటిని విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. దీనిపై ఇది వరకే ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్‌తో చర్చలు జరిపారు. శ్రీశైలం వినియోగార్హమైన నీరు 14 టీఎంసీలు మాత్రేమే ఉండటంతో నీటి విడుదలకు ఆయన అంగీకరించలేదు. ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటినే జూన్, జులై వరకు గృహ అవసరాలకు సరిపెట్టాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఇప్పుడే నీటినంతా వాడుకోవడం సబబు కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి విడుదలకై ఏపీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషితో బుధవారం చర్చలు జరపాలని భావించినా కుదరలేదు. నీటి విడుదలకు సుముఖంగా లేనందునే జోషి సమయాన్ని కేటాయించలేనట్లుగా తెలుస్తోంది. -
ఇసుకాసురులదే ఈ నేరం..!
తెనాలి : ఇసుక తవ్వకాల పేరుతో కృష్ణానదిలో నిబంధనలకు పాతరేసి మరీ గోతులు తీసిన ఇసుకాసురుల నేరానికి అమాయక యువత బలవు తోంది. నదీపాయలోని నీటి మడుగుల్లో పాతాళాన్ని తలపించే గోతులున్నట్టు తెలియని యువత, సరదా కోసం నీటిలో దిగి జలసమాధి అవుతున్న దుష్టాంతాలు కలవరపరుస్తున్నాయి. విహారానికి వచ్చి, నీటిలో కాసేపు సేదదీరుదామనుకుంటే మడుగు గర్భాల్లో దాగిన గోతులు మృత్యువులా ఒడిలోకి తీసుకుంటున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నాయి.నిన్నగాక, మొన్న వీర్లపాలెం వద్ద మృత్యువాత పడిన మంగళగిరికి చెందిన ముగ్గురు బీటెక్ విద్యార్థులతో కలుపుకుని ఏడాదిన్నర వ్యవధిలో 20 మంది వరకు మరణించిన దాఖలాలు ఇందుకు నిదర్శనం. కృష్ణానది కుడి కరకట్టకు అంచున కనకదుర్గమ్మ వారధి నుంచి పెనుమూడి వారధి వరకు దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. కరకట్ట ఆనుకుని తాడేపల్లి, మంగళగిరి రూరల్, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టి ప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని గ్రామాలున్నాయి. కరకట్ట ఏర్పడ్డాక వాహనాల రాకపోకలు పెరిగాయి. సమీప ప్రాంతాల్నుంచి ఆటవిడుపుకని యువకులు నదీతీరానికి రావటం పరిపాటిగా మారింది. నదీపాయల్లో అక్కడక్కడా ఉన్న మడుగుల్లోకి లోతు తక్కువనుకుని దిగుతూ, అగాధంలోకి కూరుకుపోతుండటం ఇటీవల పెరిగింది. ఈనెల 15న బీటెక్ చదువుతున్న మంగళగిరికి చెందిన అయిదుగురు చిన్ననాటి స్నేహితులు సరదాగా గడిపేందుకని కరక ట్ట మీదుగా దుగ్గిరాల మండల గ్రామం వీర్లపాలెంలో నదీతీరానికి వెళ్లారు. నీటిమడుగులోకి దిగిన అంకం అభిలాష్, బిట్ర సాయిశ్రీకర్, మలబంటి శివనాగప్రసాద్లు విగతజీవులయ్యారు. గత ఫిబ్రవరిలో తెనాలిలో ఇంటర్ చదువుతున్న తొమ్మిదిమంది విద్యార్థులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కాగానే, కొల్లూరు మం డలం చిలుమూరులంక వద్ద నదీతీరానికి విహారానికని వెళ్లారు. అందులో అయిదుగురు విద్యార్థులు జలసమాధి అయ్యారు. గత ఆగస్టు నెలలో సీతానగరం వద్ద ముగ్గురు ఇంటర్ విద్యార్థులు చనిపోయిన విషాదం ఇంకా స్థానికుల మది నుంచి చెరిగిపోలేదు. గత ఏడాది జనవరిలో కొల్లిపర మండలం మున్నంగి వద్ద ఈ తరహాలోనే ముగ్గురు స్నేహితులు చనిపోయారు. వారిలో ఇద్దరు ఇంటర్ సెకండియర్ విద్యార్థులు. వారేకాదు, అడపాదడపా ఎవరో ఒకరు నీటిలో దిగి గల్లంతవుతున్నారు.ఇలా ఏడాదిన్నరలో 20మందికి పైగా మరణించినట్టు సమాచారం. రోజువారీ పనుల్లో తెలియక నీటిలో దిగి మరణించిన వృద్ధుల వివరాలు అధికారుల వరకు రావటం లేదు. మామూళ్ల మత్తులో అధికారులు ... ప్రవాహ తీవ్రత, వరదల సమయాల్లో నదిలో గోతులు ఏర్పడుతుంటాయి. బంగారాన్ని మించిన ఆదాయాన్ని ఇసుకతో రాబట్టవచ్చన్న మహత్తరమైన ఆలోచన వచ్చాక ఇసుకాసురుల కన్నుపడి న దీతీరం చెల్లాచెదురైంది. నిబంధనలకు పాతరేసి, లెసైన్సు పొందిన విస్తీర్ణానికి మించి విస్తరించి, అంచనాలకు అందని లోతుల్లోకి పొక్లయిన్లతో కుళ్లబొడిచి మరీ ఇసుక తవ్వుకున్నారు. పర్యావరణానికి ప్రమాదమని తెలిసినా మామూళ్ల మత్తులో అధికారగణంలో పలువురు వారికి దాసోహమంటున్నారు. ఫలితంగానే నదిలోని నీటిపాయలు మృత్యునిలయంగా మారుతున్నాయి. కనీసం ఇలాంటిచోట్ల హెచ్చరిక బోర్డులనైనా ఏర్పాటుచేస్తే కొంత ఫలితముం డేది. ఇప్పటికయినా అధికారుల స్పందించాలి. -
2 గంటలు.. లబ్‌డబ్
ముక్త్యాల(జగ్గయ్యపేట) : కృష్ణానదిలో కొద్దిసేపు పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణానది అవతల ఒడ్డు గుంటూరు జిల్లా మాదిపాడు వరకు బల్లకట్టు ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం 6 గంటల సమయంలో ముక్త్యాల ఒడ్డు నుంచి వంద మంది ప్రయాణికులతో మర పడవ అవతల ఒడ్డుకు బయలు దేరింది. నది మధ్యలోకి వెళ్లే సరికి ఇంజిన్ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా పడవ ఆగిపోయింది. రెండు కిలోమీటర్ల వరకు దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పడవ ఆపరేటర్లు ఇంజిన్‌ను బాగు చేసి ఒడ్డుకు తీసుకువచ్చారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పడవ మరమ్మతుకు గురైందని ప్రయాణికులు అంటున్నారు. -
కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం
హైదరాబాద్: కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తారు. కృష్ణా జలాల వినియోగం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా చర్చిస్తారు. బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. ** -
నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 20 టీఎంసీలు డెల్టాకు 3 టీఎంసీలు, నల్లగొండకు 3 టీఎంసీల నీరు కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం హైదరాబాద్: రెండు రాష్ట్రాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 26 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతానికి తాగునీటికే పరిమితం చేసిన బోర్డు.. భారీ వర్షాలు కురిసి, ప్రాజెక్టుల్లోకి కొత్తనీరు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, అందుకోసం త్వరలోనే మరోమారు సమావేశం కావాలని నిర్ణయించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు తొలి సమావేశం గురువారం నగరంలోని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో జరిగిన ఈ సమా వేశంలో మెంబర్ సెక్రటరీ గుప్తాతో పాటు తెలంగాణ రాష్ర్టం నుంచి ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే బోర్డు ఆవశ్యకత, తీసుకునే నిర్ణయాలపై చైర్మన్ సభ్యులకు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి కొరత ఉన్న నేపథ్యంలో కేవలం తాగునీటి విడుదలకు సంబంధించే చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. డెల్టాకు రెండో వారం నీటి విడుదల విషయంలో తమతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు నుంచి పాల్గొన్న అధికారులు చెప్పారు. తాము వద్దన్నా డెల్టాకు నీటిని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు జోక్యం చేసుకుని డెల్టా తాగునీటి అవసరాలకు గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం మేరకే బోర్డు నీటిని విడుదల చేసిందని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ నగరం తాగునీటి అసవరాలకు రోజు 900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారని.. అయితే ఇందుకు బోర్డు అనుమతి లేదని ప్రకటించారు. పైగా హైదరాబాద్ అవసరానికి కేటాయించిన నీటి కోటా కూడా ఇప్పటికే మించిపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీటి నిల్వలను అంచనా వేసిన బోర్డు..సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 10 టీఎంసీలు, డెల్టాకు మూడు టీఎంసీలు, నల్లగొండకు మూడు టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే ఈ నీటిని కేవలం ఆయా ప్రాంతాల్లోని తాగునీటికే ఉపయోగించుకోవాలని సూచించింది. బోర్డు పూర్తి స్థాయిలో పనిచేయడం కోసం నియమ నిబంధనల రూపకల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలను తుది నిర్ణయానికి రావడానికి వీలుగా ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో ఇరు రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు, కేంద్రానికి చెందిన బోర్డు మెంబర్ సెక్రటరీలు ఉంటారు.