సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,32,164 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 877.6 అడుగులకు చేరింది. నీటి నిల్వ 176.33 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 39 టీఎంసీలు అవసరం. శనివారంనాటికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 78,314 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,26,405 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోకి శుక్రవారం కూడా 2 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ప్రవాహం కొనసాగనుంది. సాగర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4,588 క్యూసెక్కులు వస్తోంది. పులిచింతలకు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజిలోకి 16,192 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,991 క్యూసెక్కులు, సముద్రంలోకి 7,201 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి
Comments
Please login to add a commentAdd a comment