సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, తుంగభద్ర వరద జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న నీరు తోడవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు సుంకేశుల బ్యారేజ్ నుంచి 1,28,985 క్యూసెక్కులు, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న 44,047 క్యూసెక్కులకు హంద్రీ నుంచి వస్తున్న 250 క్యూసెక్కులు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,73,282 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుద్పత్తి చేస్తూ దిగువకు 63,885 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలంలో 882.1 అడుగుల్లో 199.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహం తోవడంతో సాగర్‌లోకి 67,722 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు 9,351 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 560.4 అడుగుల్లో 233.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌కు దిగువన మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.
పులిచింతల ప్రాజెక్టులోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. వాటికి పాలేరు, మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 22,955 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇందులో కృష్ణా డెల్టాకు 12,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 10,924 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి స్థిరంగా వరద కొనసాగుతుండటం, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో గురువారమూ శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగనుంది. ఇక పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,76,712 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 10,100 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,66,612 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
శ్రీశైలంలో 199.27 టీఎంసీల నిల్వ
Published Thu, Aug 4 2022 3:41 AM | Last Updated on Thu, Aug 4 2022 3:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment