ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టుల్లో జలకళ..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, దాని ఉప నదుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమ యానికి జలాశయంలో నీటి నిల్వ 134.95 టీఎంసీలకు చేరింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షా లు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో స్థిరంగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లతోపాటు తుంగభద్ర డ్యామ్ నుంచీ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు.
జూరాల నుంచి 1.75 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1.60 లక్షల క్యూసెక్కులు కలిపి.. మూడు లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో వేగంగా నిండుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండేందుకు ఇంకా 80 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటంతో మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండి, గేట్లెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 31వేలకు పైగా క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మరో 2,400 క్యూసెక్కులను మళ్లిస్తున్నారు.
భద్రాచలం వద్ద తగ్గిన వరద
ఎగువన వానలు నిలిచిపోయి, నీటి చేరిక తగ్గిపోవడంతో గోదావరి శాంతించింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రవాహం 15,96,899 క్యూసెక్కులకు, నీటి మట్టం 56.1 అడుగులకు తగ్గింది. వరద 53 అడుగులకన్నా తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. ఎగువన వర్షాలు లేకపోతే మరో మూడు రోజుల్లో వరద ఉధృతి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
గోదావరిలో ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 96 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లికి ప్రవాహం 69,487 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాణహిత, ఇంద్రావతి ఇతర నదుల్లో ఇంకా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మి బ్యారేజీకి 6,06,240 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీకి 11,06,400 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీకి 15,48,608 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వరద కాల్వ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 3,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment