సముద్రంలో కలిసిన 1903 టీఎంసీల గోదావరి వరద
మరో 86 టీఎంసీల కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్: గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ కడలి వైపు కదిలిపోతున్నాయి. ఇప్పటికే 1,903 టీఎంసీల గోదావరి, 86 టీఎంసీల కృష్ణా జలాలు కలిపి మొత్తం 1989 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది.
ఎగువ గోదావరి పరీవాహకంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వరద రాకపోవడంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో 10 రోజులుగా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం(తెలంగాణ) నుంచి అంతర్వేది(ఏపీ) వరకూ పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో వస్తున్న వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
వర్షాల్లేక వరద తగ్గుముఖం..
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు, వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.25 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 3,583 క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టు కాల్వలకు విడుదల చేస్తున్నారు. గోదావరికి ప్రాణహిత వరద తోడుకావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 2,89,710 క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్ నుంచి 4,48,810 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్ నుంచి 4,61,484 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు దిగువన వదులుతున్నారు.
⇒ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కాళేశ్వరం లింక్–2లో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.82 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,676 క్యూసె క్కులు ఉండగా, 3,602 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది.
ఎగువ కృష్ణాలో తగ్గిన వరద
కృష్ణా పరీవాహకంలో ఎగువన వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 15,000, నారాయణపూర్ నుంచి 6,000, జూరాల ప్రాజెక్టు నుంచి 82,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,84,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు 1,04,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్/దోమలపెంట : శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జునసాగర్ వద్ద కొన్ని గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఆదివారం ఉదయానికి 16 గేట్లకు తగ్గించారు. మధ్యాహ్నానికి 14, 10 గేట్లకు తగ్గిస్తూ సాయంత్రానికి ఎనిమిది గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పర్యాటకులతో ఆదివారం నాగార్జునసాగర్ జనసంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.
సొంతవాహనాల్లో తరలిరావడంతో డ్యాం దిగువన కృష్ణాతీరం వెంట గల రోడ్లన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుందనే సాకుతో ఆదివారం కూడా తెలంగాణ వైపు లాంచీలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు చాలామంది నిరాశతో వెళ్లారు. కొంతమంది మాత్రం రైట్ బ్యాంకు వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆరు గేట్లు పైకెత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment