- ఏపీకి తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. కృష్ణా జలాల విషయంలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో ఏపీకి నీటి విడుదల చేయడం అంత సమంజసం కాదని తేల్చి చెబుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా శ్రీశైలం నుంచి సుమారు ఆరు టీఎంసీలు నీటిని విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. దీనిపై ఇది వరకే ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్‌తో చర్చలు జరిపారు.
శ్రీశైలం వినియోగార్హమైన నీరు 14 టీఎంసీలు మాత్రేమే ఉండటంతో నీటి విడుదలకు ఆయన అంగీకరించలేదు. ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటినే జూన్, జులై వరకు గృహ అవసరాలకు సరిపెట్టాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఇప్పుడే నీటినంతా వాడుకోవడం సబబు కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి విడుదలకై ఏపీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషితో బుధవారం చర్చలు జరపాలని భావించినా కుదరలేదు. నీటి విడుదలకు సుముఖంగా లేనందునే జోషి సమయాన్ని కేటాయించలేనట్లుగా తెలుస్తోంది.