నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 20 టీఎంసీలు
డెల్టాకు 3 టీఎంసీలు, నల్లగొండకు 3 టీఎంసీల నీరు
కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం
హైదరాబాద్: రెండు రాష్ట్రాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 26 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతానికి తాగునీటికే పరిమితం చేసిన బోర్డు.. భారీ వర్షాలు కురిసి, ప్రాజెక్టుల్లోకి కొత్తనీరు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, అందుకోసం త్వరలోనే మరోమారు సమావేశం కావాలని నిర్ణయించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు తొలి సమావేశం గురువారం నగరంలోని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో జరిగిన ఈ సమా వేశంలో మెంబర్ సెక్రటరీ గుప్తాతో పాటు తెలంగాణ రాష్ర్టం నుంచి ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే బోర్డు ఆవశ్యకత, తీసుకునే నిర్ణయాలపై చైర్మన్ సభ్యులకు వివరించారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి కొరత ఉన్న నేపథ్యంలో కేవలం తాగునీటి విడుదలకు సంబంధించే చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. డెల్టాకు రెండో వారం నీటి విడుదల విషయంలో తమతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు నుంచి పాల్గొన్న అధికారులు చెప్పారు. తాము వద్దన్నా డెల్టాకు నీటిని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు జోక్యం చేసుకుని డెల్టా తాగునీటి అవసరాలకు గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం మేరకే బోర్డు నీటిని విడుదల చేసిందని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ నగరం తాగునీటి అసవరాలకు రోజు 900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారని.. అయితే ఇందుకు బోర్డు అనుమతి లేదని ప్రకటించారు. పైగా హైదరాబాద్ అవసరానికి కేటాయించిన నీటి కోటా కూడా ఇప్పటికే మించిపోయిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీటి నిల్వలను అంచనా వేసిన బోర్డు..సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 10 టీఎంసీలు, డెల్టాకు మూడు టీఎంసీలు, నల్లగొండకు మూడు టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే ఈ నీటిని కేవలం ఆయా ప్రాంతాల్లోని తాగునీటికే ఉపయోగించుకోవాలని సూచించింది. బోర్డు పూర్తి స్థాయిలో పనిచేయడం కోసం నియమ నిబంధనల రూపకల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలను తుది నిర్ణయానికి రావడానికి వీలుగా ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో ఇరు రాష్ట్రాలకు చెందిన ఈఎన్‌సీలు, కేంద్రానికి చెందిన బోర్డు మెంబర్ సెక్రటరీలు ఉంటారు.