సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించే ప్రతిపాదనపైనా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దృష్టి పెట్టింది. గతంలో ప్రతిపాదించిన మాదిరి ఇచ్చంపల్లి వద్ద భారీ రిజర్వాయర్ కాకుండా చిన్న రిజర్వాయర్ నిర్మించి మిగులు జలాలను తరలించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జానంపేట, అకినేపల్లి ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది.
పాతదే.. మళ్లీ కొత్తగా..
దక్షిణాది నదుల కోసం ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకాన్ని చేపట్టిన కేంద్రం... అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014లోనే మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానానికి 299 కి.మీ. మేర నీటి తరలింపు ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరమవుతాయని, ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కే రూ. 14,636 కోట్లు అవసరమని లెక్కగట్టింది. 312 కి.మీ. పొడవైన ఇచ్చంపల్లి–పులిచింతలకు సైతం భారీ అంచనా వ్యయాలనే ప్రతిపాదించారు.
ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు. మరో 51 వేల ఎకరాల అటవీ, 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉందని గతంలో తేల్చారు. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో ఇది మూలన పడింది. దీనికి బదులుగా ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీలు సాగర్‌కు, అటు నుంచి కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపైనా తెలంగాణ వ్యతిరేకత చూపడంతో ఇదే జిల్లాలో జానంపేట నుంచి పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించింది. అయితే దీని ద్వారా సైతం తమకు ఒనగూరే ప్రయోజనం లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇక్కడ చిన్న రిజర్వాయర్ నిర్మించి ఆ నీటిని పెద్దవాగు రిజర్వాయర్, తమ్మలగుట్ట రిజర్వాయర్‌ల మీదుగా తరలించి సూర్యాపేట వద్ద గల మూసీతో కలపాలని ప్రతిపాదిస్తున్నారు.
ఇటు నుంచి సాగర్ ఎడమ గట్టు కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీరందిస్తూ గోదావరి నీటిని సాగర్‌కు తరలించేలా ఈ కొత్త ప్రతిపాదన ఉంది. నీటిని పూర్తిగా పైప్‌లైన్ ద్వారా తరలిస్తేనే మేలన్న అభిప్రాయం ఉంది. ఇలా అయితే సాగర్ కింద కృష్ణా నీటి అవసరాలను తగ్గించవచ్చని, డిండిలో భాగంగా ఉన్న గొట్టిముక్కుల రిజర్వాయర్‌కు సైతం గోదావరి నీటిని తరలించే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నీటితో ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలైన చుండూర్, పెద్దఊర, గుర్రంపాడు, నార్కట్‌పల్లి ప్రాంతాలకు నీటిని అందించవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఇది వీలుకాకుంటే ఇప్పటికే నిర్మిస్తున్న తుపాకులగూడెం నుంచి మూసీకి, అటు నుంచి సాగర్‌కు తరలించేలా మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన సైతం ఉంది. అయితే ఇందులో ఈ ప్రతిపాదనను తెలంగాణ ఆమోదిస్తుందన్నది తెలియాల్సి ఉంది.
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి
Published Tue, Mar 5 2019 2:36 AM | Last Updated on Tue, Mar 5 2019 2:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment